నిర్మాత బట్టతలపై వెంట్రుకలు మొలవడానికి ప్రేరణ
ఇక బోనీ బట్టతలపై అందమైన హెయిర్ ఉంటే బావుంటుందని శ్రీదేవి కోరుకునేవారు. దానికోసం అతడిని ఒకసారి దాత కావాలని ప్లాంటేషన్ ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారట.
By: Sivaji Kontham | 28 Sept 2025 4:00 AM ISTఅప్పటివరకూ బట్టతలపై వెంట్రుకలు మొలిపించాలని, సిగరెట్లు మానేయాలని అతడిపై ఒత్తిడి తెచ్చేందుకు ఒకరు ఉండేవారు. కానీ ఆమె వెళ్లిపోయారు. అయినా ఇప్పటికీ ఆ మహాసాధ్వి జ్ఞాపకాల్లోంచి బయటపడలేకపోతున్నాడు నిర్మాత బోనీకపూర్. ఆమె ఎవరో కాదు.. తన దివంగత భార్య శ్రీదేవి.
పెళ్లవ్వక ముందు, ప్రేమలో ఉన్నప్పుడు బోనీని సిగరెట్లు మానేయాలని శ్రీదేవి కోరారట. న్యూయార్క్ లో ఉన్నప్పుడు శ్రీదేవి ఏమన్నారంటే... ``నన్ను ప్రేమించానని అన్నారు... అది నిజమైతే సిగరెట్లు ఇప్పుడే మానేస్తానని మాటివ్వండి!`` అంటూ శ్రీదేవి సినిమాటిగ్గా కోరగా, వెంటనే అంగీకరించిన బోనీకపూర్ తన చేతిలోని ఖరీదైన లైటర్, సిగరెట్లను దూరంగా విసిరేసాడు. పెద్ద సైజ్ కార్టెల్ సిగరెట్లలో నీళ్లు ఒంపేయాలని శ్రీదేవిని కోరాడు. ఆ తర్వాత అతడు 12 సంవత్సరాలు సిగరెట్ల జోలికి వెళ్లలేదు.
ఇక బోనీ బట్టతలపై అందమైన హెయిర్ ఉంటే బావుంటుందని శ్రీదేవి కోరుకునేవారు. దానికోసం అతడిని ఒకసారి దాత కావాలని ప్లాంటేషన్ ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారట. అయితే దివంగత శ్రీదేవి కోరికను అతడు మన్నించి ఈ ఏడాది ఆరంభంలో అందమైన క్రాపుతో కనిపించాడు. అంతేకాదు బరువు తగ్గిపోయి స్లిమ్‌గా అందమైన కుర్రాడిలా మారిపోయాడు. భార్య వెళ్లిపోయాక అతడిలో ఈ మార్పు చాలామందికి డౌట్లు పుట్టించింది.
అయితే తనలోని ప్రతి మార్పునకు దివంగత శ్రీదేవి ప్రేరణ అంటూ బోనీ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో తాను 26 కేజీల బరువు తగ్గడం, హెయిర్ మార్పిడి వంటివి తన భార్య కారణంగానే అని అన్నాడు. జీవితంలో ధూమపానం మానేయడానికి కూడా శ్రీదేవి ప్రేరణగా నిలిచారని తెలిపాడు. శ్రీదేవి దాత జుట్టు కోసం తనను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు.. ఆరోజు నాతో శ్రీ ఉన్నప్పుడు నేను జుట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఆమె కంటే అందమైన అమ్మాయి నాకు దొరకదు కదా అనుకున్నాడట. శ్రీదేవి కారణంగా తన జీవితంలో రెండుసార్లు ధూమపానం మానేశానని వెల్లడించాడు. శ్రీదేవి చనిపోయాక, చనిపోక ముందు కూడా తాను చెడు అలవాట్లను జయించానని అన్నాడు. తాగుడు మానేశానని కూడా తెలిపాడు బోనీ.
