బోనీ కపూర్‌పై డాక్యు-సిరీస్ తీయాలేమో!
చాలా మంది ప్రముఖుల జీవితకథల్ని బయోపిక్ పేరుతో వెండితెరకెక్కిస్తున్నారు. బయోపిక్ లు తీయడంలో అగ్ర నిర్మాత బోనీ కపూర్ కూడా ఆసక్తిగానే ఉన్నారు.
By: Sivaji Kontham | 27 Sept 2025 9:30 AM ISTచాలా మంది ప్రముఖుల జీవితకథల్ని బయోపిక్ పేరుతో వెండితెరకెక్కిస్తున్నారు. బయోపిక్ లు తీయడంలో అగ్ర నిర్మాత బోనీ కపూర్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. అదంతా సరే కానీ, జీవితకథలను తెరకెక్కించాలంటే అసాధారణ విజయాలు సాధించిన స్ఫూర్తి ప్రధాతలే కావాలా? జీవితంలో ఎన్నో ఎమోషన్స్ ని ఎదుర్కొన్న బోనీకపూర్ లాంటి ఒకరు సరిపోరంటారా? ఆయనపై డాక్యు సిరీస్ తీయాలేమో!!
నిజానికి బోనీ కపూర్ జీవితంలో చాలా ఎమోషన్ ఉంది. ట్రయాంగిల్ లవ్ ఉంది... మాజీ భార్యతో, పిల్లలతో ఎడబాటు ఉంది. అతడు 90లలో ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కానీ, తన సినిమా హీరోయిన్ శ్రీదేవిని ప్రేమించాడు. అతడి ప్రేమను శ్రీదేవి కొన్ని నెలలు సంవత్సరాల పాటు తిరస్కరిస్తూనే ఉంది. కానీ అతడు ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. చివరికి ఒక రోజు ఎస్ అని అటువైపు నుంచి అంగీకారం లభించింది. వెంటనే శ్రీదేవిని పెళ్లాడేసాడు. కానీ అప్పుడే అతడి జీవితంలో అసలైన తుఫాన్ మొదలైంది.
అతడు తల్లిదండ్రులు లేని శ్రీదేవికి తోడుగా వెళ్లాల్సి వచ్చింది. దానికోసం తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా విడిచిపెట్టాడు. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి తాజా ఇంటర్వ్యూలో బోనీ చెప్పిన విషయాలు నిజానికి ఎమోషనల్ డెప్త్ తో ఒక డాక్యుమెంటరీ తరహాలో బయోపిక్ కి కావాల్సినంత సరంజామాను కలిగి ఉన్నాయని ఎవరైనా అంగీకరిస్తారు.
నిజానికి 90లలో శ్రీదేవితో బోనీ కపూర్ ఎఫైర్ ఒక సంచలనం. అప్పట్లో ముంబైలోని స్థానిక టాబ్లాయిడ్లు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. బోనీ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు! అంటూ హెడ్డింగులు దర్శనమిచ్చాయి. అయితే తాను శ్రీదేవిని పెళ్లాడే ముందే తన భార్య మోనాకు ఈ విషయం చెప్పాడు. ఏదీ దాచలేదు. శ్రీదేవితో తనకున్న సంబంధం గురించి తాను ఎప్పుడూ తన మొదటి భార్యకు తెలియకుండా రహస్యంగా దాచలేదని వెల్లడించారు.
అంతేకాదు తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవితో తన పెళ్లి కోసం ఉంగరాలను కూడా మొదటి భార్య మోనాకపూర్ కొనుగోలు చేసిందని బోనీ చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. నేను ఆమెకు ఒప్పుకున్నాను! అని నా భార్యకు చెప్పాను.... అని తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ యాంకర్ కి ఈ విషయం చెప్పాడు బోనీ. నా ఉంగరం, శ్రీదేవి ఉంగరం చూడండి.. రెండిటినీ నా మొదటి భార్య మోనా కొనుగోలు చేసిందని బోనీ చెప్పాడు. నేను మోనాకు ప్రతిదీ ఓపెన్ గా చెప్పాను.. ఆమె నాపై పిల్లలకు ద్వేషం పుట్టకుండా పెంచింది. ఒక తండ్రిగా, తన మొదటి భార్య మోనాతో కలిసి ఉన్న తన ఇద్దరు పిల్లలు అర్జున్, అన్షుల కూడా ఆ కాలంలో బాధపడ్డారని బోనీ అంగీకరించారు.
1996లో బోనీ కపూర్ శ్రీదేవిని వివాహం చేసుకుని తన మొదటి కుటుంబం నుండి దూరంగా వెళ్లారు. ఆ సమయంలో, బోనీ మొదటి కుమారుడు అర్జున్ అతనికి ఒక లేఖ రాసి పంపాడు. ఆ లేఖలో ``నాన్నా నువ్వు ఇంటికి ఎందుకు రాకూడదు?`` అని అర్జున్ ఆవేదనగా రాసాడు. నేను బాధపడ్డాను. నేను ఏం చేయగలను? నేను విడిపోయాను. ఒక వైపు నా భార్య (శ్రీదేవి).. మరొక వైపు నా పిల్లలు ఉన్నారు. నేను శ్రీదేవిని ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోయాను. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఒంటరిగా ఉంది. కానీ ఇక్కడ కనీసం నా పిల్లలు వారి తల్లితో ఉన్నారు. వారు వారి తాతామామలతో నివసిస్తున్నారు! అని ఆయన అన్నారు. నా పిల్లలను ఆ సమయంలో అమతంగా ప్రేమించాను. కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నాను. నేను బలంగా ఉండాలి. ఎందుకంటే నేను నా పిల్లలందరినీ ప్రేమిస్తున్నాను. నా మాజీ భార్యను గౌరవించాను. మోనా ఎప్పుడూ నాపై పోటీ ఆట ఆడలేదు. పిల్లలు తల్లి బాధను చూడలేక బాధపడ్డారు. అది నాకు అర్థమైంది.. అని తెలిపాడు.
అయితే 2018లో శ్రీదేవి దుబాయ్ లోని ఓ బాత్ టబ్ లో కాలు జారి పడి మరణించారని కథనాలొచ్చాయి. దానిని అభిమానులు నమ్మేలేదు. కానీ దుబాయ్ పోలీస్ ప్రమాదవశాత్తూ శ్రీదేవి మరణించారని ధృవీకరించారు. శ్రీదేవి మరణం తర్వాత మాత్రమే ఆమె కుమార్తెలు జాన్వీ- ఖుషి ఇద్దరినీ అర్జున్ తన దరికి చేరనిచ్చాడు. అర్జున్, అన్షుల తల్లిని కోల్పోయిన ఇద్దరికీ అండగా నిలిచారు. ఇక బోనీకపూర్ వ్యక్తిగత జీవితం, ప్రేమకథలు ఇలా ఉంటే, అతడు ఒక నిర్మాతగా మాత్రం సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్ సహా సౌత్ లోను అతడి ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. తన ఇద్దరు కుమార్తెలను విజయవంతంగా కథానాయికలుగా ఇండస్ట్రీల్లోకి ప్రవేశపెట్టాడు.
