బాహుబలి శ్రీదేవి కాంట్రవర్సీ.. రాజమౌళి అలా మెసేజ్ చేశారా?
బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి మూవీలో శివగామి రోల్ ను దివంగత నటి శ్రీదేవి ఎందుకు రిజెక్ట్ చేశారోనని కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 7 Sept 2025 4:15 PM ISTబ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి మూవీలో శివగామి రోల్ ను దివంగత నటి శ్రీదేవి ఎందుకు రిజెక్ట్ చేశారోనని కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పందించి తెరదించారు. శ్రీదేవి భారీ డిమాండ్లు చేశారంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఆ సమయంలో పలు వ్యాఖ్యలు చేశారు.
బాహుబలి నిర్మాతలు తక్కువ పారితోషికం ఇస్తామని చెప్పినట్లు బోనీ కపూర్ తెలిపారు. దర్శకుడు రాజమౌళిని పూర్తి తప్పుదోవ పట్టించారని ఆరోపణలు చేశారు. ఆయన ముందు వచ్చి సినిమా కోసం నెరేట్ చేశారని తెలిపారు. అప్పుడు శ్రీదేవి చాలా ఎగ్జైట్ అయిందని వెల్లడించారు. అదే సమయంలో రాజమౌళి నుంచి వచ్చిన మెసేజ్ కోసం మాట్లాడారు.
శ్రీదేవికి తాను పెద్ద ఫ్యాన్ అని జక్కన్న చెప్పినట్లు తెలిపారు. సినిమా కోసం చర్చించిన తర్వాత.. ఆమె పట్ల తనకు చాలా గౌరవం పెరిగిందని రాజమౌళి చెప్పినట్లు వెల్లడించారు. రెమ్యునరేషన్ కోసం మాట్లాడినప్పుడు రాజమౌళి లేరని, నిర్మాతలు మాత్రమే మాట్లాడరని చెప్పారు. ఆ తర్వాత ఆఫర్ విషయం ఆయనకు వాళ్లు చెప్పలేదని అన్నారు.
శ్రీదేవి హోటల్ లో ఒక ఫ్లోర్ మొత్తం కావాలని, పెద్ద ఎత్తున సిబ్బంది కావాలని డిమాండ్ చేసినట్లు వచ్చినవి అబద్ధాలని అన్నారు. తాము కేవలం ఇద్దరి పిల్లల స్కూల్ సెలవులకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయమని మాత్రమే కోరామని అన్నారు. అంతకు మించి ఎలాంటి అహేతుకమైన డిమాండ్లు అస్సలు చేయలేదని తెలిపారు.
కానీ నిర్మాతలు రాజమౌళిని మాత్రం పూర్తిగా తప్పుదోవ పట్టించారని ఆయన పేర్కొన్నారు. తమ పిల్లలు అప్పటికి చిన్నవాళ్లు, వారితో ఎక్కువ సమయం గడిపేందుకు సరైన ప్రైవసీ కావాలనుకున్నామని తెలిపారు. అందుకు కుదరదంటే శ్రీదేవి ఆ పాత్ర చేయనని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ కన్నా తక్కువ ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు.
శ్రీదేవి వృత్తి నైపుణ్యాన్ని సమర్థిస్తూ ఆమెతో పనిచేయడం నిజంగా కష్టంగా ఉంటే డి. రామానాయుడు, కె. రాఘవేంద్రరావు, రాకేష్ రోషన్, యష్ చోప్రా వంటి అగ్ర చిత్ర నిర్మాతలు పదే పదే ఎందుకు ఎంపిక చేసుకున్నారని బోనీ అడిగారు. శ్రీదేవి బాహుబలి చేయకపోవడం పట్ల తనకు ఎటువంటి విచారం లేదని తెలిపారు. కానీ పరిస్థితిని వక్రీకరించిన విధానం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
