Begin typing your search above and press return to search.

పుత్రర‌త్నం కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్న అగ్ర‌ నిర్మాత‌

బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్‌కి `రీమేక్ కింగ్` అనే పేరు ఊరికే రాలేదు. ఏ భాష‌లో ఏ సినిమా హిట్ట‌యినా దాని రీమేక్ హ‌క్కుల‌ను కొని దాచుకోవ‌డం ఆయన ప్ర‌త్యేక‌త‌.

By:  Sivaji Kontham   |   13 Feb 2026 8:00 AM IST
పుత్రర‌త్నం కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్న అగ్ర‌ నిర్మాత‌
X

బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్‌కి `రీమేక్ కింగ్` అనే పేరు ఊరికే రాలేదు. ఏ భాష‌లో ఏ సినిమా హిట్ట‌యినా దాని రీమేక్ హ‌క్కుల‌ను కొని దాచుకోవ‌డం ఆయన ప్ర‌త్యేక‌త‌. నిర్మాత‌గా సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ కెరీర్‌లో అత్యధిక శాతం సినిమాలు రీమేక్‌లే తెర‌కెక్కించారు. ఒక భాషలోని హిట్ కథను మరో భాషా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చడంలో బోనీకి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంద‌ని ప్రూవైంది. భార‌తీయ చిత్ర‌సీమ‌లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఫిలింమేక‌ర్‌ అత‌డు. సినిమా అన్ని విభాగాల‌పైనా మంచి ప‌ట్టున్నవాడు గ‌నుక ఇటీవ‌ల‌ ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారుతోంది.

అయితే అంత పెద్ద నిర్మాత అయి ఉండీ అత‌డు త‌న కుమారుడి కెరీర్ ని చ‌క్క‌దిద్ద‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుత్ర‌ర‌త్నం అర్జున్ క‌పూర్ ఇప్ప‌టికీ టైర్ -3 హీరోల్లో ఒక‌డిగా మిగిలిపోయాడు. చాలామంది ఔట్ సైడ‌ర్స్, డెబ్యూ హీరోలు సాధిస్తున్న దాంతో పోలిస్తే, అర్జున్ సాధించింది జీరో. దీంతో బోనీకి పుత్రోత్సాహ‌మ్ము.. లేకుండా పోయింది. పైకి త‌న సుపుత్రుడైన అర్జున్ క‌పూర్ న‌టుడిగా ప‌రిణ‌తి చెందుతున్నాడ‌ని చెబుతున్నా కానీ, లోలోన అత‌డు ఎద‌గ‌లేద‌ని, స్టార్ డ‌మ్ అందుకోలేద‌ని మ‌ద‌న‌ప‌డుతూనే ఉన్నాడు.

అర్జున్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా ప‌లువురు అగ్ర నిర్మాత‌లు అద్భుత‌మైన స్క్రిప్టుల‌తో సినిమాల‌ను రూపొందించారు. భారీ బ‌డ్జెట్ల‌ను కూడా అత‌డి కోసం కుమ్మ‌రించారు. కానీ సినిమాలేవీ విజ‌యం సాధించ‌లేదు. తాజాగా `తలైవర్ తంబి తలైమయిల్` అనే తమిళ పొలిటికల్ సెటైర్ సినిమా రీమేక్ హక్కులను కుమారుడి కోసం బోనీక‌పూర్ కొనుగోలు చేశార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

2026 పొంగల్ కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కోయంబత్తూరులో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌) కోసం వెళ్ళిన బోనీ కపూర్, అక్కడ థియేటర్లో ఈ సినిమా చూసి ఫిదా అయిపోయి వెంటనే హిందీ రీమేక్ హక్కులు తీసుకున్నాన‌ని చెప్పారు. అయితే అంత‌గా బోనీని ఆక‌ర్షించిన ఎలిమెంట్ ఈ సినిమా క‌థ‌లో ఏం ఉంది? అంటే.... ఒకే రోజు ఒక పెళ్లి, ఒక చావు జరిగితే.. ఆ గ్రామంలోని పంచాయతీ ప్రెసిడెంట్ పడే ఇబ్బందులు, రాజకీయ చదరంగం నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా ఇది. ఇందులో న‌టీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు పేరొచ్చింది. అందుకే బోనీ రీమేక్ హ‌క్కులు కొనుగోలు చేసారని చెబుతున్నారు.

త‌మిళ హీరో జీవా నటించిన పొలిటికల్ సెటైర్ `తలైవర్ తంబి తలైమయిల్` హిందీ రీమేక్ లో అర్జున్ క‌పూర్ న‌టించే వీలుంద‌ని బ‌లంగా వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి బోనీ కపూర్ తన సొంత నిర్మాణంలో తన కుమారుడు అర్జున్ కపూర్‌ను హీరోగా పెట్టి సినిమాలు చేయడం మనకు తెలిసిందే. త‌లైవ‌ర్.. కథలోని గ్రామీణ రాజకీయాలు, వ్యంగ్యం అర్జున్ కపూర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోతాయని ఆయన భావిస్తున్నట్లు టాక్.

అర్జున్ కపూర్‌కు `టూ స్టేట్స్` కొంత‌ మంచి పేరు తెచ్చింది. అందుకే త‌లైవ‌ర్ కథలో హ్యూమర్ పండితే బాలీవుడ్ ఆడియన్స్‌కు ఇది ఒక రిఫ్రెషింగ్ సినిమా అవుతుందని బోనీ భావిస్తున్నార‌ట‌. అయితే ఈ మధ్య కాలంలో రీమేక్ ల‌తో రిస్కులు ఎక్కువ‌. ఎందుకంటే ఒరిజిన‌ల్ సినిమాల‌ను నేరుగా ఓటీటీలో చూసే సౌలభ్యం ఉండటంతో, హిందీ నేటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేస్తేనే క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.