Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

ముంబైలోని బొంబాయి హైకోర్టు, బీఎస్ఈ, వర్లీ-మహాలక్ష్మి రేస్‌కోర్స్‌తో పాటు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ను పేల్చివేస్తామంటూ వచ్చిన ఈమెయిల్ కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు. వరుసగా ప్రముఖులు, కీలక సంస్థలకు ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో సైబర్ క్రైమ్ విభాగం ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. జల్సా వద్ద అమితాబ్ భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు.

By:  Sivaji Kontham   |   6 Nov 2026 4:19 PM IST
మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?
X

ముంబై నగరంలో పలు కీలక ప్రాంతాలను పేల్చివేస్తామంటూ వచ్చిన ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ శుక్రవారం కలకలం రేపింది. బొంబాయి హైకోర్టుతో పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఇ), వర్లీ-మహాలక్ష్మి రేస్‌కోర్స్ ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ నివాసమైన `జల్సా` లక్ష్యంగాను బెదిరింపుల మెయిల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈమెయిల్ అందుకున్న వెంటనే ముంబై పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు , భద్రతా సంస్థలు అప్రమత్తమై రంగంలోకి దిగాయి.

బెదిరింపు వచ్చిన అన్ని కీలక ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు సందేశాన్ని అధికారులు ఒక నకిలీ (హోక్స్) ఈమెయిల్‌గా ధృవీకరించినా ముంబై వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు.

ఇటీవలి కాలంలో ముంబైలోని ప్రముఖుల ఇళ్లు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ఈమెయిల్ బెదిరింపులు రావడం పెరిగింది. గత నెలలో కూడా మేయర్ ఆఫీసుతో పాటు అమితాబ్ బచ్చన్ నివాసం, ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీ వేదికలను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్ బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో అమితాబ్ బచ్చన్ సైతం ఆదివారం తన అభిమానులను కలుసుకునే సాంప్రదాయ కార్యక్రమంలో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభివాదం చేశారు. ఆ త‌ర్వాత యువ‌హీరో ఆయుష్మాన్ ఖురానాకు బాంబ్ బెదిరింపు ఎదురైంది. దానిపైనా విచార‌ణ జ‌రిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మ‌నుషులు కొన్నిసార్లు సెల‌బ్రిటీల‌ను బెదిరిస్తుంటే, దీనిని ఆస‌రాగా చేసుకుని ఇత‌ర చిల్ల‌ర గ్యాంగ్ లు కూడా సెల‌బ్రిటీల‌ను, ముంబై పోలీసుల‌ను బెదిరించ‌డం ప్రారంభించాయి.

ఏది ఏమైనా ఈ వరుస బెదిరింపు ఘటనలను ముంబై పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ విభాగం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు -ఐపీ అడ్రసుల ఆధారంగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని..నగరాన్ని భద్రంగా ఉంచేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

`జ‌ల్సా` చుట్టూ దిగ్భంద‌నం:

బాంబు బెదిరింపుల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ నివాసమైన `జల్సా` వద్ద ముంబై పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం అభిమానులను కలిసే సాంప్రదాయం కోసం బంగ్లా బయట ప్రత్యేకంగా పారదర్శక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేయగా.. అమితాబ్ నవంబర్ 1న దాని వెనుక నిలబడే అభిమానులకు అభివాదం చేశారు. అలాగే జుహులోని బంగ్లా ప్రాంగణం, చుట్టుపక్కల రహదారుల్లో అదనపు పోలీస్ బలగాలను, బాంబు నిర్వీర్యక దళాలను భారీగా మోహరించడంతో పాటు అభిమానులు నివాసం దగ్గరకు రాకుండా బలమైన ఇనుప బారికేడ్లను అమర్చి... నిరంతర నిఘా కోసం సిసిటివి పర్యవేక్షణను పెంచారు.