ది రాజా సాబ్.. ఇది మరో పవర్ఫుల్ క్యారెక్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.
By: M Prashanth | 2 Dec 2025 11:50 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ చూస్తుంటే.. మారుతి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో 'తాత' అనే దెయ్యం పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్ లో ఆ క్యారెక్టర్ హైలైట్ అవ్వడం కూడా చూశాం. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడిని ఈ ప్రాజెక్ట్ లో ఉన్నట్లు హైలెట్ చేశారు.
బాలీవుడ్ లో తనదైన విలక్షణ నటనతో గుర్తింపు తెచ్చుకున్న బోమన్ ఇరానీ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. "కనిపించని వాటిని పరిశీలించేవాడు.. మనసును చదివేవాడు.. నిజానికి, అంతుచిక్కని దానికి మధ్య నిలబడేవాడు" అంటూ ఆయన క్యారెక్టర్ గురించి ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.
బోమన్ ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రీ ఇడియట్స్, పీకే వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి. ఎంత చిన్న పాత్రనైనా తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు అలాంటి వెర్సటైల్ యాక్టర్ 'రాజా సాబ్'లో ఉన్నారంటే, ఆ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్ లో ఆయన లుక్ కూడా చాలా సీరియస్ గా, ఏదో మిస్టరీని ఛేదించే వ్యక్తిలా ఉంది.
మారుతి ఈ సినిమాతో కేవలం తెలుగు ఆడియెన్స్ నే కాకుండా, బాలీవుడ్ మార్కెట్ ను కూడా గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. సంజయ్ దత్, ఇప్పుడు బోమన్ ఇరానీ.. ఇలా నార్త్ ఆడియెన్స్ కు తెలిసిన ముఖాలను ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానింగే ఉంది. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా పాన్ ఇండియా స్థాయిలో క్యాస్టింగ్ ను సెట్ చేసుకోవడంలో మారుతి సక్సెస్ అయ్యారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా హార్రర్, కామెడీ ఎలిమెంట్స్ ను మిక్స్ చేస్తూ ప్రభాస్ ను కొత్తగా చూపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ లాంటి దిగ్గజ నటుల మధ్య ప్రభాస్ 'రాజా సాబ్'గా ఎలా రచ్చ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
'రాజా సాబ్' టీమ్ నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమా స్థాయిని పెంచుతూ పోతోంది. హార్రర్ కామెడీ జానర్ లో ప్రభాస్ ను చూడటం ఒక ఎత్తు అయితే, ఇలాంటి భారీ తారాగణంతో సినిమా రావడం మరో ఎత్తు. ఇక సినిమా నార్త్ లో ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
