ఆ నటుడి కోసం సెట్లో 6 వ్యాన్‌లు దేనికి?
సినీపరిశ్రమలో నిర్మాతలకు అదనపు భారం గురించి, కాస్ట్ ఫెయిల్యూర్ గురించి చాలా చర్చ సాగుతోంది. అదే సమయంలో స్టార్ ల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి నిర్మాత ఎంతగా సతమతమవుతాడో కూడా చర్చల్లోకి వస్తోంది.
By: Sivaji Kontham | 13 Sept 2025 5:00 AM ISTసినీపరిశ్రమలో నిర్మాతలకు అదనపు భారం గురించి, కాస్ట్ ఫెయిల్యూర్ గురించి చాలా చర్చ సాగుతోంది. అదే సమయంలో స్టార్ ల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి నిర్మాత ఎంతగా సతమతమవుతాడో కూడా చర్చల్లోకి వస్తోంది. అరుదుగా కొందరు స్టార్లు మాత్రమే తమ స్టాఫ్ కి జీతాలిస్తున్నారు. చాలా మంది స్టాఫ్ కి కూడా నిర్మాతలే ఇవ్వాలని కండిషన్ పెడుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి సెట్లోకి మొత్తం 11 కారవ్యాన్‌లు వస్తున్నాయి. అందులో సగం స్టార్ కి చెందినవి. స్టార్ తో పాటు పరివారం కూడా వీటిలో చేరుతుంటారు.
ఈ విషయాల్ని ఇంత డీటెయిల్డ్ గా చెప్పినది ఎవరు? అంటే 40 ఏళ్లుగా సినీపరిశ్రమలో ఉన్న నటుడు సంజయ్ గుప్తా. టీనేజ్‌లో అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు 1994లో ఆతిష్: ఫీల్ ది ఫైర్ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. పరిశ్రమలో స్టార్లను చాలా దగ్గరగా చూసానని అతడు చెబుతున్నాడు. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్ సహా పాతతరం స్టార్లకు ఒకే ఒక్క మేకప్ వ్యక్తి, ఒకే ఒక్క స్పాట్ బాయ్ మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పటితరం స్టార్లు అలా కాదు. ఇటీవల నిర్మాతలు పరివార ఖర్చుల గురించి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. నిర్మాతలు లక్షల్లో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
కొందరు నటుల కోసం ఆరు వ్యాన్లు ఉపయోగించిన రోజులను చూసాను. ఒక వ్యాన్ లో మేకప్, మరో వ్యాన్ లో ఆహారం తినడం, ఇంకో వ్యాన్ లో జిమ్, ఒక వ్యాన్ లో సమావేశాలు, అదనపు వ్యాన్ లో పరివారం ఇలా అందరి కోసం వ్యాన్ లు సెట్లో ఉండేవని కూడా అతడు చెప్పాడు. వీటన్నిటికీ నిర్మాతలే బిల్లులు చెల్లించేవారని తెలిపాడు. కొందరు స్టార్లు అయితే భార్య కోసం ఒక ప్రత్యేక వ్యానిటీ కావాలని అడిగిన సందర్భాలున్నాయని, ఆ ఇద్దరూ వేర్వేరు వ్యాన్ లలో భోజనం చేయడం చూసానని కూడా అన్నారు. ఇద్దరూ ఒకటే కదా! అనుకుంటే పొరపాటేనని కూడా సెటైర్ వేసాడు.
అయితే ఇలాంటి చెత్త ట్రెండ్ ని అనుసరించని ఏకైక నటుడు అమితాబ్. బచ్చన్ జీ ఎప్పుడూ తన సిబ్బందికి జీతం ఇవ్వనివ్వడు. ఆయనకు రోజువారీ ఖర్చు లేదు.. రవాణా సౌకర్యం ఇవ్వాల్సిన పని లేదు... ఈ సిబ్బంది నాకోసం.. నిర్మాత కోసం కాదు! అని నిజాయితీగా మాట్లాడతారు అమితాబ్. ఇద్దరు ముగ్గురు స్టాఫ్ తోనే సరిపెడతారు. కానీ కొందరు 30 మందిని మెయింటెయిన్ చేసిన రోజులు ఉన్నాయి. అజయ్ దేవగన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు పరిమిత స్టాఫ్ తోనే సెట్లో పని చేస్తారని వారు ఆదర్శంగా ఉంటారని కూడా అతడు కితాబిచ్చారు.
