ఇండస్ట్రీలో స్నేహం ఆ రెండింటి కోసమే..!
ధర్మ ప్రొడక్షన్స్‌లో ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. క్లాసిక్ సినిమాలను అంధించిన ధర్మ ప్రొడక్షన్ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ సినిమాలను అందించడంలో విఫలం అవుతూ వచ్చింది.
By: Ramesh Palla | 9 Oct 2025 2:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే విషయం. అయితే ఒకరి నుంచి మరొకరు కేవలం ఆర్థిక పరమైన లాభం లేదా, మరే ఇతర లాభం అయినా చూసుకుని మాత్రమే ఒకరికి ఒకరు ఇండస్ట్రీలో సాయం చేసుకుంటారు అని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. ఈయన ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి తాజాగా ఒక చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ నెపోటిజం అనగానే ఎక్కువగా కరణ్ జోహార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన బ్యానర్‌లో వచ్చే సినిమాలన్నీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కిడ్స్ పిల్లల సినిమాలు కావడంతో ఈయన్ను అంతా నెపోటిజంను పెంచి పోషించే వ్యక్తిగా, నిర్మాతగానే చూస్తారు. కానీ ఆయన మాత్రం ఇది తాను బంధుప్రీతి తో చేస్తున్నదో లేదా మరే కారణం వల్ల చేస్తున్నదో కాదని, కేవలం వ్యాపారంలో భాగంగానే చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
కరణ్ జోహార్ కామెంట్స్
ధర్మ ప్రొడక్షన్స్‌లో ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. క్లాసిక్ సినిమాలను అంధించిన ధర్మ ప్రొడక్షన్ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ సినిమాలను అందించడంలో విఫలం అవుతూ వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది యంగ్ హీరోలకు, హీరోయిన్స్‌కి ధర్మ ప్రొడక్షన్స్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనే కోరిక ఉంటుంది. కరణ్ జోహార్ ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ చాలా మంది స్టార్స్ తన బ్యానర్‌లో నటించడానికి కారణం వారికి ఫేమ్ వస్తుందని, అలాగే మేము వారితో సినిమాను నిర్మించడానికి కారణం మాకు డబ్బు వస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంతే తప్ప ఇక్కడ బంధుప్రీతి గాని, స్నేహం గాని ఏమీ ఉండవు అన్నాడు. అంతే కాకుండా ఇండస్ట్రీలో స్నేహంను నమ్ముకుని ముందుకు పోతే చివరకు నిరాశ మిగులుతుందని, చాలా విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించాడు.
బాలీవుడ్‌లో నెపోటిజం
ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అనుభవం అనుసారం.. ఇక్కడ బంధాలు, స్నేహాలు కేవలం అవకాశాలు, డబ్బు కోసం మాత్రమే ఏర్పాటు అవుతాయి. కొత్త స్నేహాలు సినిమా వరకే పరిమితం అవుతాయి. వ్యక్తిగత విషయాల వరకు ఎప్పుడూ ఆ స్నేహాలు వెళ్లవు. అంతే కాకుండా వ్యక్తిగత అవసరాలకు ఆ స్నేహాలు, బంధుత్వాలు ఎప్పుడూ సహాయం గా నిలిచిన దాఖలాలు ఉండవని ఆయన చెప్పుకొచ్చాడు. నిర్మాతలతో నటీనటులు చాలా సన్నితంగా ఉన్నట్లుగా అనిపిస్తారు. కానీ ఎప్పుడూ కూడా నిర్మాతల యొక్క నష్టాలను నటీనటులు షేర్ చేసుకున్న దాఖలాలు లేవు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల నష్టాలను పట్టించుకోవడం అనేది జరగదు. అయినా కూడా నిర్మాతలు ఇండస్ట్రీలో కొత్త వారిని ప్రోత్సహించడం, ఉన్నవారితో సినిమాలు చేయడం మానడం లేదని కరణ్ జోహార్ తాజా చిట్ చాట్ లో పేర్కొన్నాడు.
టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి
ఈ మధ్య కాలంలో తాను నిర్మించిన సినిమాల్లో కొన్ని సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమాకు సంబంధించిన నటీనటులు నాకు డబ్బు వెనక్కి ఇవ్వడం కానీ, నాకు మద్దతుగా నిలవడం కానీ చేయలేదు అని కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎప్పుడూ స్నేహితుల నుంచి సాయం పొందలేదు, అంతే కాకుండా నేను నా స్నేహితులకు ఇండస్ట్రీ పరంగా మద్దతుగా ఉన్నాను తప్ప ఎక్కువగా వ్యక్తిగత సాయం చేయలేదు అన్నాడు. ఇండస్ట్రీలో తాను, తన స్నేహితులు మాత్రమే కాకుండా అందరూ కేవలం డబ్బు, ఆఫర్ల కోసమే స్నేహంగా ఉంటారని, బంధుత్వం ను ఏర్పాటు చేసుకుంటారు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే బాలీవుడ్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందని అంటారు.
