సొంత సినిమాలను తొక్కేసే ధోరణి ఈ ఇండస్ట్రీలో!
పక్కవాడిని తొక్కేయడం లేదా కాళ్లు పట్టి కిందికి గుంజేయడం.. ఈ తరహా మెంటాలిటీని ఇరుకు మెంటాలిటీ లేదా క్రాప్ మెంటాలిటీ అంటారు.
By: Sivaji Kontham | 12 Jan 2026 9:04 AM ISTపక్కవాడిని తొక్కేయడం లేదా కాళ్లు పట్టి కిందికి గుంజేయడం.. ఈ తరహా మెంటాలిటీని ఇరుకు మెంటాలిటీ లేదా క్రాప్ మెంటాలిటీ అంటారు. ఎదిగేవాడిని చూస్తే కొందరికి ద్వేషం ఆటోమెటిగ్గా పుట్టుకొస్తుంది. పచ్చగా కనిపిస్తే చాలు తట్టుకోలేరు. ఈ తరహా స్వభావం కారణంగా సినీపరిశ్రమల్లో సమస్యలు ఎదుర్కొనే కొందరు చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు.
అనురాగ్ కశ్యప్, హిమేష్ రేషమ్మియా, కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ వంటి వారికి ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలిసిన విషయాలు. గతంలో ఓసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హిందీ సినీ పరిశ్రమలోని కొందరి ప్రవర్తన, కుళ్లు మనస్తత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పరిశ్రమలోని వారు తోటివారి సినిమాలను ప్రశంసించాల్సింది పోయి, వాటిని తక్కువ చేసి చూడటాన్ని ఆయన `క్రాప్ మెంటాలిటీ` అని అభివర్ణించారు.
సొంత సినిమాలను తొక్కేసే ధోరణిపై అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో ఒక విచిత్రమైన వాతావరణం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక సినిమా విడుదలవుతుందంటే, అది ఎలా ఉందో చూడటం కంటే అది ఎలా ఫ్లాప్ అవుతుందో అని ఎదురుచూసేవారే ఎక్కువ. ఇండస్ట్రీలోని వ్యక్తులే ఇతర సినిమాలను తక్కువ చేసి మాట్లాడటంలో ఆనందం వెతుక్కుంటారు! అని విమర్శంచారు.
అయితే దక్షిణాదిలో ఒక పెద్ద సినిమా వస్తుందంటే అందరూ కలిసి దానికి మద్దతు ఇస్తారు. కానీ హిందీలో మాత్రం ఒకరి కాళ్లు ఒకరు లాగే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. హిందీ సినిమా వారు కంటెంట్ కంటే కేవలం స్టార్ ఇమేజ్, పబ్లిసిటీ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, అందుకే వైవిధ్యమైన సినిమాలు రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సెన్సార్ బోర్డు , ఇతర వివాదాల వల్ల `జన నాయకన్ వంటి సినిమాలు ఇబ్బంది పడుతుంటే, ఇండస్ట్రీ నుండి ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంపై అనురాగ్ అసహనం వ్యక్తం చేశారు. మనం ఒకరికొకరు తోడుగా ఉండకపోతే, బయటి శక్తులు మనల్ని మరింత బలహీనపరుస్తాయి! అని హెచ్చరించారు.
అనురాగ్ తరహాలోనే మరో హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా బాలీవుడ్‌లోని ప్రస్తుత పరిస్థితులపైనా, అక్కడ ఉన్న మనస్తత్వాలపైనా అత్యంత ఘాటుగా స్పందించారు. అక్కడ ఒకరి సినిమాలను మరొకరు తక్కువ చేసి మాట్లాడటం, నెగటివిటీని వ్యాప్తి చేయడాన్ని ఆయన `క్రాప్ మెంటాలిటీ` అని అన్నారు. హిందీ ఇండస్ట్రీలో సినిమా విడుదల కాకముందే దాని గురించి చెడుగా మాట్లాడటం మొదలుపెడతారు. పరిశ్రమలోని వ్యక్తులే తోటివారి విజయాలను చూసి అసూయ పడతారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే పండగ చేసుకునే దుర్మార్గపు మనస్తత్వం ఇక్కడ ఎక్కువగా ఉందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ తన పతనాన్ని ఆపాలంటే దక్షిణాది (టాలీవుడ్, కోలీవుడ్) సినిమాల నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు:
దక్షిణాదిలో అందరూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. అక్కడ సినిమానే హీరో. కానీ ఇక్కడ వ్యక్తిగత అహంకారాలు ఎక్కువయ్యాయి! అని విమర్శించారు. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అంతగా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించుకోకుండా, వారిని విమర్శించడం వల్ల ఉపయోగం లేదని ఇమ్రాన్ అన్నారు. ప్రస్తుతం సెన్సార్ బోర్డు వివాదాల వల్ల చిక్కుకున్న సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ఇలాంటి కష్టసమయాల్లో ఇండస్ట్రీ మొత్తం ఒక్కటిగా నిలబడాలని, కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే అని ఆయన పేర్కొన్నారు.
మనం మంచి సినిమాలు తీయడం మానేసి, ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడంలోనే సమయం వృథా చేస్తున్నాం. ఈ క్రాప్ మెంటాలిటీ మారనంత కాలం హిందీ సినిమా పూర్వ వైభవం పొందడం కష్టం అని ఇమ్రాన్ హష్మీ హెచ్చరించారు. ఇమ్రాన్ హష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. ఆయన అన్నట్లుగా బాలీవుడ్ స్టార్లలో ఐక్యత లేకపోవడమే ఆ ఇండస్ట్రీ వెనుకబడటానికి కారణమా? అన్నది విశ్లేషించుకోవాలి. ఇమ్రాన్ హష్మి ఇటీవల పవన్ కల్యాణ్ `ఓజీ`లో కనిపించాడు. అలాగే గూఢచారి 2లో అడివి శేష్ తో కలిసి నటిస్తున్నాడు. అతడు సౌత్ సినీపరిశ్రమలో వర్క్ కల్చర్ కి ఫిదా అయిపోయానని తెలిపారు. పవన్ సహా దక్షిణాది స్టార్లతో మంచి స్నేహాన్ని సంపాదించానని అన్నారు.
