ఐదేళ్లు వెయిట్ చేయించి హ్యాండ్ ఇచ్చింది..!
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ది ఇంటర్న్' ను హిందీలో రీమేక్ చేయాలని ప్రముఖ దర్శకుడు అమిత్ శర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.
By: Ramesh Palla | 11 Aug 2025 12:40 PM ISTహాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ది ఇంటర్న్' ను హిందీలో రీమేక్ చేయాలని ప్రముఖ దర్శకుడు అమిత్ శర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు. 2015లో ది ఇంటర్న్ సినిమా విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో రాబర్ట్ డి నీరో, అన్నే హాత్వే లు ముఖ్య పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఒక వృద్ధుడికి అమ్మాయి తారసపడుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథగా నడుస్తుంది. ఆ 70 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం మొదట రిషి కపూర్‌ను అనుకున్నారు. కానీ ఆయన ఆకస్మిక మరణంతో ప్రాజెక్ట్‌లోకి అమితాబ్ బచ్చన్ వచ్చి చేరారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు దీపికా పదుకునేను నటింపజేయాలని భావించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ గురించిన చర్చలు జరుగుతూ వచ్చాయి.
రీమేక్‌లో అమితాబ్ బచ్చన్
2020 సంవత్సరంలో ది ఇంటర్న్ హిందీ రీమేక్ గురించి మొదటి సారి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలో కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం, దీపికా పదుకునే బిజీ షెడ్యూల్, ఆ తర్వాత దీపికా పదుకునే యొక్క పెగ్నెంట్ ఇలా వరుస కారణాల వల్ల ఇన్నాళ్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాదిలో సినిమా పట్టాలెక్కుతుందని బాలీవుడ్‌లో ప్రముఖంగా చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఈ రీమేక్ నుంచి దీపికా పదుకునే తప్పుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించేందుకు మొదట ఓకే చెప్పిన దీపికా పదుకునే ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో మార్పులు, ఇతర విషయాలు సాకుగా చూపించి హ్యాండ్ ఇచ్చింది అంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దీపికా పదుకునే తీరుపై విమర్శలు
హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చిన స్క్రిప్ట్ దీపికా పదుకునేకు నచ్చలేదని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఆమె పారితోషికం విషయంలోనూ దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం ఆమె డిమాండ్ చేస్తుందని, ఆ పారితోషికం తగ్గించుకోమంటూ సూచించినందుకు ఇప్పుడు తప్పుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి దాదాపు ఐదు ఏళ్ల పాటు ఊరించి, సినిమాలో నటిస్తాను అంటూ చెప్పి ఇప్పుడు అనూహ్యంగా తప్పుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. దీపికా పదుకునే ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని పలువురు ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ దీపిక తీరును తీవ్రంగా విమర్శిస్తూ స్వయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్పిరిట్ నుంచి కూడా ఔట్
కొన్ని వారాల క్రితం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా నుంచి కూడా దీపికా పదుకునే తప్పుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే దీపికా తీరును చాలా మంది విమర్శించారు. ప్రభాస్ వంటి సూపర్ స్టార్ సినిమాలో నటించేందుకు గాను పారితోషికం విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే ఏమైంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పదుకునే బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది. అన్ని సినిమాలకూ ఆమె అదే స్థాయి పారితోషికంను ఆశిస్తుంది.
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలను పారితోషికంతో పట్టింపు లేకుండా నటనకు ఆస్కారం ఉండే పాత్రలు వస్తే ఖచ్చితంగా ఓకే చెబుతున్నారు. దీపికా పదుకునే మాత్రం కేవలం డబ్బు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నట్లు ఈ రెండు సినిమాల నుంచి వైదొలగడం చూస్తే అనిపిస్తుందని సోషల్ మీడియా జనాలు మాట్లాడుతున్నారు. ముందు ముందు ఇలాంటివి దీపికా పునరావృతం చేస్తే ఖచ్చితంగా ఆమె తీవ్రమైన విమర్శలు మరింత ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
