బాలీవుడ్ దుస్థితి.. స్టార్ సినిమాకు 1+1 ఆఫర్
నార్త్ ఇండియాలో కొన్ని వారాలుగా ‘సైయారా’ సినిమాదే జోరంతా. ఆ సినిమా కొన్ని వారాల తర్వాత కూడా స్ట్రాంగ్‌గా నిలబడుతోంది.
By: Garuda Media | 31 July 2025 5:45 PM ISTథియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా? ఇప్పుడు ఇండియాలో అన్ని ఫిలిం ఇండస్ట్రీలూ ఇదే ప్రశ్నతో తలలు పట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏ సినిమా ఆడుతుందో తెలియని పరిస్థితి. చాలా కొన్ని సినిమాలు మాత్రం ఊహించిన స్థాయిలో ఆడేస్తున్నాయి. చాలా సినిమాలు బోల్తా కొడుతున్నాయి. స్టార్లు ఉన్నా సరే.. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం కష్టమవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లు కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు టాప్ హీరోల సినిమాలంటే కంటెంట్ గురించి ఆలోచించకుండా జనం థియేటర్లకు వచ్చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలకు కూడా ఇబ్బందులు తప్పట్లేదు.
బాలీవుడ్ పెద్ద హీరోల్లో ఒకడైన అజయ్ దేవగణ్ పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. ఆయన కొత్త చిత్రం ‘సన్నాఫ్ సర్దార్-2’కు ఆశించిన బజ్ లేదు. దీంతో నార్త్ ఇండియా అంతటా టికెట్ల మీద 1+1 ఆఫర్ నడుస్తోంది. ఒక పెద్ద హీరో సినిమాకు తొలి రోజే 50 పర్సంట్ డిస్కౌంట్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మన దగ్గర పెద్ద హీరోల సినిమాలకు వీకెండ్లో రేట్లు పెంచి అమ్ముతున్నారు. అలాంటిది రేట్లు సగానికి తగ్గించడం బాలీవుడ్ దుస్థితికి నిదర్శనం. గురువారం రిలీజైన మరో సినిమా ‘ధడక్-2’కు కూడా ఇదే ఆఫర్ పెట్టారు.
నార్త్ ఇండియాలో కొన్ని వారాలుగా ‘సైయారా’ సినిమాదే జోరంతా. ఆ సినిమా కొన్ని వారాల తర్వాత కూడా స్ట్రాంగ్‌గా నిలబడుతోంది. మరోవైపు 'మహావతార నరసింహ' దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లు రాబడుతోంది. వీటి పోటీని తట్టుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కొత్త సినిమాలకు సవాలుగా మారింది. అందుకే అజయ్ లాంటి స్టార్ ఉన్న సినిమా అయినా ‘సన్నాఫ్ సర్దార్-2’ హైప్ తెచ్చుకోలేకపోయింది. దీంతో టికెట్ల రేట్లలో డిస్కౌంట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకర్షించాలని చూస్తున్నారు.
