Begin typing your search above and press return to search.

గొడ‌వ‌లు కొట్లాట‌ల‌తో విడిపోయి మ‌ళ్లీ క‌లిసిపోయిన బెస్ట్ ఫ్రెండ్స్!

సినీజ‌గ‌త్తులో ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా బంధాలు, అనుబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. కొన్నిసార్లు విభేధాల కార‌ణంగా ఇవ‌న్నీ బీట‌లు వారుతాయి.

By:  Sivaji Kontham   |   3 Aug 2026 9:34 AM IST
గొడ‌వ‌లు కొట్లాట‌ల‌తో విడిపోయి మ‌ళ్లీ క‌లిసిపోయిన బెస్ట్ ఫ్రెండ్స్!
X

సినీజ‌గ‌త్తులో ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా బంధాలు, అనుబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. కొన్నిసార్లు విభేధాల కార‌ణంగా ఇవ‌న్నీ బీట‌లు వారుతాయి. ప్రొఫెషనల్ గా విభేదాలు కావొచ్చు.. ఇగో సమస్యలు అయినా కావొచ్చు.. వ్యక్తిగత పట్టింపుల వల్ల ఎంతటి ప్రాణస్నేహితులైనా శత్రువులుగా మారిపోయిన సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. అయితే కాలక్రమేణా పాత విరోధాలను, మనస్పర్థలను పక్కనబెట్టి మళ్లీ ఒకటైన ప‌లువురు ఫ్రెండ్స్ బాలీవుడ్‌లో ఆద‌ర్శంగా నిలిచారు.

ద‌శాబ్ధాల పాటు తీవ్ర‌మైన వైరం కొన‌సాగించిన త‌ర్వాత గ్రేట్ కంబ్యాక్ షారుఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్‌లది. 2008లో కత్రినా కైఫ్ బర్త్‌డే పార్టీలో జరిగిన గొడవ వల్ల దాదాపు ఐదేళ్ల పాటు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఖాన్‌లు 2013 ఇఫ్తార్ పార్టీలో ఒకరినొకరు కౌగిలించుకుని మళ్లీ ప్రాణస్నేహితులయ్యారు. అలాగే 'డర్' సినిమా సమయంలో వచ్చి 16 ఏళ్ల పాటు సాగిన విరోధాన్ని సన్నీ డియోల్, షారుఖ్‌లు 'గదర్ 2' సక్సెస్ వేళ తుడిచిపెట్టేశారు. మరోవైపు ఏ దిల్ హై ముష్కిల్, శివాయ్ చిత్రాల బాక్సాఫీస్ క్లాష్ వేళ చెడిపోయిన కరణ్ జోహార్ - కాజోల్‌ల దశాబ్దాల స్నేహం కూడా ఆ తర్వాత మళ్లీ చిగురించింది.

అవార్డు వేడుక వివాదంతో దూరమైన సల్మాన్ ఖాన్ - అర్జిత్ సింగ్‌లు 'టైగర్ 3' చిత్రం కోసం మళ్లీ చేతులు కలపగా, 'దోస్తానా 2' వివాదం తర్వాత కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్‌లు కూడా తమ విభేదాలను ముగించి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. 90లలో వరుస హిట్లతో అలరించిన గోవిందా - డేవిడ్ ధావన్ కాంబినేషన్ కొన్నేళ్ల కోల్డ్ వార్ తర్వాత ఒక బహిరంగ వేదికపై ఆప్యాయంగా పలకరించుకుని పాత రోజులను గుర్తుచేసుకోవ‌డం ఆక‌ట్టుకుంది. అలాగే ఫరా ఖాన్ భర్తతో గొడవ వల్ల దూరమైన షారుఖ్ - ఫరా ల జంట మళ్లీ కలిసి `హ్యాపీ న్యూ ఇయర్` వంటి భారీ హిట్ తో తిరిగి స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు.

గతంలో ఆర్థిక పరమైన అంశాల‌లో కీల‌కంగా పారితోషికాల గొడవల వల్ల విడిపోయిన ఫ్రెండ్‌షిప్స్ కూడా కాలక్రమేణా పునరుద్ధరించబడ్డాయి. 'కల్ హో నా హో' ఫీజు వివాదంతో కరీనా కపూర్ - కరణ్ జోహార్ దూరమైనా.. కరణ్ తండ్రి అనారోగ్య సమయంలో కరీనా చూపిన ఆప్యాయత వీరిని మళ్లీ దగ్గర చేసింది. `ఇష్క్` షూటింగ్ వేళ చిన్న గొడవతో ఏడేళ్ల పాటు మాట్లాడుకోని అమీర్ ఖాన్ - జూహీ చావ్లాలు... అమీర్ విడాకుల సమయంలో జూహీ అండగా నిలవడంతో మళ్లీ ఆప్తమిత్రులుగా మారారు.

చివరగా 70ల కాలంలో స్టార్‌డమ్, ఈగో వార్ వల్ల దశాబ్దాల పాటు దూరంగా ఉన్న అమితాబ్ బచ్చన్ - శతృఘ్న సిన్హాలు కూడా వయసుతో పాటు ఆ విభేదాలను మర్చిపోయారు. శతృఘ్న ఆత్మకథ ఆవిష్కరణకు అమితాబ్ ముఖ్య అతిథిగా హాజరై తమ పూర్వ స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారు. ఈ విధంగా తీవ్రమైన పబ్లిక్ ఫైట్స్, వ్యతిరేకతల తర్వాత కూడా విభేదాలను అధిగమించి మళ్లీ ఒకటైన ఈ స్టార్ల ప్రయాణం సినీ పరిశ్రమలో నిజమైన స్నేహానికి అద్దం పడుతోంది. స్నేహితుల దినోత్స‌వం వేళ ఇవ‌న్నీ గుర్తు చేసుకోవ‌డానికి అభిమానులు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.