Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటులను టాలీవుడ్ యూజ్ చేసుకోలేకపోతుందా?

టాలీవుడ్ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా సినిమాలు పెరిగాయి. దీంతో మన సినిమాల్లో వేరే లాంగ్వేజ్ క్యాస్టింగ్ కనిపించడం కూడా కామన్ అయిపోయింది.

By:  M Prashanth   |   24 Sept 2026 8:38 PM IST
బాలీవుడ్ నటులను టాలీవుడ్ యూజ్ చేసుకోలేకపోతుందా?
X

టాలీవుడ్ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా సినిమాలు పెరిగాయి. దీంతో మన సినిమాల్లో వేరే లాంగ్వేజ్ క్యాస్టింగ్ కనిపించడం కూడా కామన్ అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటులను విలన్లు, కీలక పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ కోసం తీసుకొస్తున్నారు. అయితే తీసుకొస్తున్నారు కానీ.. ఆ స్టార్‌ లోని నటుడిని మాత్రం పూర్తిగా యూజ్ చేసుకోలేకపోతున్నారా అనే చర్చ ఇప్పుడు నెట్టింట జోరుగా జరుగుతోంది

ఒకప్పుడు బాలీవుడ్ నటుడు తెలుగు సినిమాలో కనిపిస్తే అదే పెద్ద స్పెషాలిటీ. ఇప్పుడు పరిస్థితి మారింది. దివ్యేందు శర్మ, రాఘల్ జుయాల్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ సహా అనేక మంది మన సినిమాల్లో కనిపించారు. వీళ్లంతా హిందీ ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవాళ్లే. కానీ తెలుగు చిత్రాల్లో వారి రోల్స్ మాత్రం ఆ రేంజ్ లో ఎఫెక్ట్ చూపించలేకపోయాయనే అభిప్రాయాలు సినీ ప్రియుల నుంచి ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇక్కడ సమస్య నటులది కాదు.. క్యారక్టరైజేషన్ లో ఉందనే మాట వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమా అనగానే హీరో, హీరోయిన్‌ తో పాటు ఇతర భాషల్లో తెలిసిన వాళ్లు ఉండటం ఇప్పుడు ఒక రకమైన అవసరంగా మారింది. ఒక బాలీవుడ్ నటుడు సినిమాలో ఉన్నారనే విషయం నార్త్‌ లో ప్రమోషన్స్ కు బాగా యూజ్ అవుతుంది. కానీ క్యారక్టరైజేషన్ స్ట్రాంగ్ గా లేకపోతే స్టార్ ఇమేజ్ కూడా ఎక్కువసేపు పనిచేయదు.

విలన్ అయితే హీరోకు గట్టి పోటీ ఇవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కథలో ఎమోషన్ పెంచాలి. స్టోరీలో కీలకమైన పాత్ర అయితే సినిమా జర్నీపై ఎఫెక్ట్ చూపించాలి. ఇలా కాకుండా కేవలం కొన్ని సీన్లు, నాలుగు డైలాగులు, ఓ స్టైలిష్ లుక్‌ తో సరిపెడితే.. ప్రేక్షకుడికి ఆ నటుడి అవసరం పెద్దగా కనిపించదు. ఇటీవల పెద్ది, ప్యారడైజ్, ఓజీ సినిమాల విషయంలో కూడా అదే విషయం డిబేట్ గా మారింది.

ఆ సినిమాల్లో బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, రాఘవ్ జుయాల్, ఇమ్రాన్ హష్మీ ఉన్నట్లు మూవీ టీమ్ నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు సినీ ప్రియుల్లో అంచనాలు పెరిగాయి. కానీ స్క్రీన్ పై వారి రోల్స్ చూసిన తర్వాత ఆ అంచనాలకు తగ్గ రేంజ్ లో వారిని యూజ్ చేయలేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపించాయి. గతంలో సైంధవ్ లో నవాజుద్దీన్ సిద్దిఖీ, డబుల్ భగవంత్ కేసరి’లో అర్జున్ రాంపాల్, సాహోలో పలువురు బాలీవుడ్ నటుల విషయంలో కూడా ఇలాంటి చర్చే జరిగింది.

అందుకే ఇప్పుడు డిబేట్ తెలుగు సినిమాల్లో బాలీవుడ్ నటులను తీసుకోవాలా వద్దా అనేది కాదు. తీసుకొచ్చిన నటుడి క్రేజ్‌ ను వాడుకోవడమే కాదు.. టాలెంట్‌ కూడా యూజ్ చేసుకోవాలనేదే మెయిన్ పాయింట్. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ పెరుగుతున్న వేళ, క్యారక్టరైజేషన్ విషయంలో డైరెక్టర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనేక మంది నెటిజన్లు సజ్జెస్ట్ చేస్తున్నారు. మరి టాలీవుడ్ మేకర్స్ అప్ కమింగ్ సినిమాల విషయంలో ఏం చేస్తారో..