'రామాయణ్' విమర్శలపై కపూర్లు.. ఖాన్లు మౌనం
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తోన్న ఈ సినిమా గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యూక్తమవుతోంది.
By: Srikanth Kontham | 9 April 2026 8:36 AM ISTబాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్ `రామాయణ్`. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తోన్న ఈ సినిమా గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యూక్తమవుతోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మేకర్స్‌కు అండగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాను పూర్తిగా చూడకుండానే కేవలం ఒక చిన్న గ్లింప్స్ ఆధారంగా గ్రాఫిక్స్ మీద కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఆయా కథల టోన్‌కు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో హృతిక్ మినహా ఇతర అగ్రశ్రేణి తారలైన కపూర్లు , ఖాన్లు మాత్రం మౌనం వహించడం చర్చకు దారి తీస్తోంది.
సాధారణంగా పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్ట్ విమర్శలను ఎదుర్కొంటున్నప్పుడు తోటి నటులు , అగ్ర హీరోలు స్పందించి మద్దతు తెలపడం జరుగుతుంటుంది. కానీ రణబీర్ సినిమా విషయంలో కపూర్ కుటుంబానికి చెందిన వారు గానీ, పరిశ్రమను శాసించే ఖాన్ త్రయం గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ సైలెన్స్ వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయా? అని బాలీవుడ్ వర్గాలు సహా మిగతా పరిశ్రమల్లో చర్చకొస్తుంది. ఇలాంటి పరిస్థితి కేవలం `రామాయణ్` విషయంలోనే కాదు. ఇటీవల విడుదలైన రణవీర్ సింగ్ `ధురందర్` విషయంలోనూ కనిపించింది.
`ధురంధర్ 2` సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ చాలా మంది స్టార్ హీరోలు ఆ సినిమా గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. మిగతా పరిశ్రమల్లో రణవీర్ సింగ్ పనితనంపై చర్చ జరిగినా? హిందీ పరిశ్రమలో మత్రం అదెక్కడా కనిపించలేదు. బాలీవుడ్‌లో హీరోల మధ్య అంతర్గతంగా ఉన్న పోటీ ఈగో వార్స్ దీనికి కారణం కావచ్చన్నది కొందరి అభిప్రాయం. ఒక హీరో సినిమా సంచలనం సృష్టిస్తున్నప్పుడు లేదా విమర్శల పాలవుతున్నప్పుడు మిగతా వారు అంటీముట్టనట్టుగా ఉండటం సంప్రదాయంగా మారుతోందా అనే సందేహాలు లేకపోలేదు.
`రామాయణ్` లాంటి పౌరాణిక చిత్రాలు కేవలం ఒక నటుడికి లేదా ఒక చిత్ర యూనిట్‌కు సంబంధించినవి కావు. అవి భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే ప్రయత్నాలు. అటువంటి ప్రాజెక్టులపై విమర్శలు వచ్చినప్పుడు పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నిలబడి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. హృతిక్ రోషన్ తన స్పందన ద్వారా అదే విషయాన్ని గుర్తు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ , టెక్నికల్ అంశాలపై పైనల్ ప్రోడక్ట్ చూసాకే నిర్ణయానికి రావడం సమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఈ మౌనం వెనుక వ్యూహాత్మక కారణాలు కూడా ఉండొచ్చు అనే అనుమానాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండటమో లేదా తమ తదుపరి సినిమాలపై దృష్టి పెట్టడమో కావచ్చు. కానీ రణబీర్ కపూర్ వంటి అగ్ర నటుడు ఒక పవిత్రమైన పాత్రను పోషిస్తున్నప్పుడు నైతిక మద్దతు ఇవ్వకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణాదిలో ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు హీరోలందరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం చూస్తుంటాం. బాలీవుడ్‌లో అటువంటి వాతావరణం తగ్గిపోతుందా అనే చర్చ తాజాగా మొదలైంది.
హృతిక్ రోషన్ మద్దతు `రామాయణ్` మేకర్స్‌కు కొంత ఊరటనిచ్చినప్పటికీ మిగతా స్టార్ల నిశ్శబ్దం మాత్రం అనేక ప్రశ్నలను మిగిలిస్తోంది. కేవలం మాటలతో కాకుండా? చేతలతో పరిశ్రమలోని ఐకమత్యాన్ని చాటాల్సిన సమయం ఇది. భవిష్యత్తులో కపూర్లు, ఖాన్లు తమ మౌనాన్ని వీడి భారీ ప్రాజెక్టుపై స్పందిస్తారో లేదో చూడాలి.
