భయం గుప్పిట్లో బాలీవుడ్ స్టార్లు.. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో..!
ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం `గెలాక్సీ అపార్ట్మెంట్స్` వద్ద ముంబై పోలీసులు భద్రతను అత్యంత కఠినతరం చేశారు.
By: Sivaji Kontham | 22 Oct 2026 9:51 PM ISTప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. టాప్ హిందీ సెలబ్రిటీలు బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న నిరంతర హెచ్చరికలు, దాడుల కారణంగా ప్రముఖ నటుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోలతో పాటు దర్శకుడు రోహిత్ శెట్టి నివాసాల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో, బాలీవుడ్ ప్రముఖుల్లో ఏ స్థాయిలో టెన్షన్ నెలకొందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఎక్కడైనా బయట అడుగుపెడుతున్నారంటే ఆయన చుట్టూ భారీ భద్రతా వలయం కనిపిస్తోంది.
ఈ భద్రతా ఆందోళనల ప్రభావం సల్మాన్ ఖాన్ సినిమాలపై కూడా పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న బెదిరింపుల కారణంగా నిర్మాతలు ఆయనతో కొత్త ప్రాజెక్ట్‌లు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. సల్మాన్ తో సినిమా చేస్తే సెట్స్‌లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి రావడం, షూటింగ్ షెడ్యూల్స్ తరచూ తారుమారవడం వంటి సమస్యల వల్ల నిర్మాతలు ఇతర హీరోల వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే బెదిరింపులను లెక్కచేయకుండా సల్మాన్ ఖాన్ తన ప్రస్తుత కమిట్మెంట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకులు రాజ్ & డీకే కాంబినేషన్లో ఆయన చేయబోయే కొత్త అండర్డాగ్ డ్రామా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం `గెలాక్సీ అపార్ట్మెంట్స్` వద్ద ముంబై పోలీసులు భద్రతను అత్యంత కఠినతరం చేశారు. సల్మాన్‌కు ఇప్పటికే `వై ప్లస్` (Y+) కేటగిరీ భద్రతను అందించగా.. తాజాగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులను భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో పబ్లిక్ మూవ్‌మెంట్‌ను పూర్తిగా నియంత్రించి ప్రత్యేక వెహికల్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో ఆయనను కలవడం గానీ, దగ్గరకు వెళ్లడం గానీ ఎవరికైనా అత్యంత కష్టతరంగా మారింది.
ఈ భద్రతా కారణాల ప్రభావం కేవలం సల్మాన్‌కే పరిమితం కాకుండా ఇతర బాలీవుడ్ సూపర్ స్టార్స్‌పై కూడా పడింది. టైగర్ పై ఎటాక్ అనంతరం పట్టుకున్న నిందితుల విచారణలో భయానక విషయాలు వెలుగు చూసాయి. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల ఇళ్లను సైతం నిందితులు సాధారణ పర్యాటకుల మాదిరిగా సందర్శించినట్టు విచారణలో తేలడం కలకలం రేపింది. అంతేకాకుండా.. టైగర్ ష్రాఫ్ తమ ప్రధాన లక్ష్యమని నిందితులు వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గ్యాంగ్స్టర్లు ముంబైలోని టాప్ సెలబ్రిటీల కార్యకలాపాలను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారనే అంచనాకు వచ్చిన పోలీసులు, ఫిల్మ్‌మేకర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద కూడా నిఘాను మరింత పెంచారు.
మొత్తానికి ముంబైలో గ్యాంగ్స్టర్ల కదలికలు.. పోలీసుల విచారణలో వెలుగు చూసిన సంచలన విషయాలతో సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లో కనిపించడమే పూర్తిగా మానేశారు. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో బాలీవుడ్ అంతా ఒక రకమైన ఉత్కంఠ వాతావరణంలో కాలం వెళ్లదీస్తోంది.
