ట్రెండీ స్టోరి: ఖరీదైన బంగ్లాలు వందల కోట్లు ఉన్నా అద్దె కొంపల్లో అడ్జస్టయ్యారు!
సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు అంటేనే కోట్లాది రూపాయల విలువైన బంగళాలు, విలాసవంతమైన ఫ్లాట్లు ఉంటాయని మనం భావిస్తుంటాం.
By: Sivaji Kontham | 23 April 2026 8:30 AM ISTసాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు అంటేనే కోట్లాది రూపాయల విలువైన బంగళాలు, విలాసవంతమైన ఫ్లాట్లు ఉంటాయని మనం భావిస్తుంటాం. కానీ తెరపై వెలిగిపోయే ఈ తారల జీవితాల్లో అద్దె ఇళ్లు కహానీలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సొంత బంగ్లాలు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నా.. రకరకాల కారణాలతో కొందరు స్టార్స్ నెలకు లక్షల రూపాయల అద్దె చెల్లిస్తూ అద్దె నివాసాల్లోనే ఉంటున్నారు. ఇది ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్‌గా మారింది.
సొంత ఇళ్లలో రిపేర్లు జరుగుతున్న సమయంలోనో లేదా తాత్కాలిక అవసరాల కోసమో ఈ స్టార్లు అద్దె ఇళ్లను ఎంచుకుంటారు. ఉదాహరణకు.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన నివాసం `మన్నత్` మరమ్మతుల సమయంలో పాలి హిల్‌లోని జాకీ భగ్నానీకి చెందిన ఇంట్లో అద్దెకు ఉన్నారు. దీనికోసం టంచనుగా లక్షల్లో అద్దెను షారూఖ్ చెల్లిస్తున్నారు. ఖాన్ గౌరవనీయమైన అద్దె చెల్లింపుదారు అని భగ్నానీ కితాబు కూడా ఇచ్చాడు. అలాగే ఆమిర్ ఖాన్ కూడా గతంలో తన పాలి హిల్ నివాసం రిపేర్ల సమయంలో జుహూలో నెలకు సుమారు 10 లక్షల రూపాయల అద్దె చెల్లించి ఫ్లాట్‌లో నివసించారు. ఇలాంటి పరిస్థితులు హీరోయిన్లకు కూడా తప్పడం లేదు.
కొంతమంది నటీమణులు తమ కెరీర్ ప్రయాణంలో భాగంగా మంచి లొకేషన్‌లో నివాసం ఉండాలని అద్దె ఇళ్లను ఎంచుకుంటారు. స్టార్ హీరోయిన్ కృతి సనన్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన జుహూలోని డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను నెలకు దాదాపు 10 లక్షల అద్దెతో తీసుకున్నారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా గతంలో ప్రియాంక చోప్రా నివసించిన జుహూలోని `కర్మాయోగ్` భవనంలో భారీ అద్దె చెల్లిస్తూ నివసించారు. ఇలాంటి అపార్ట్‌మెంట్‌లు వారికి ప్రెస్టేజ్‌ను దాంతో పాటే అవకాశాల్ని కూడా అందిస్తాయి.
పెళ్లి చేసుకున్న కొత్త జంటలు కూడా అద్దె ఇళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ జంట పెళ్లి తర్వాత జుహూలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. విశేషమేమిటంటే.. వీరు నివసించే అదే భవనంలో విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ కూడా ఉంటున్నారు. వీరి నెలవారీ అద్దె సుమారు 8 నుంచి 9 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. సౌకర్యం, భద్రతతో పాటు ప్రముఖుల నివాసాల సామీప్యత వంటి అంశాలు వీరిని ఇలాంటి అద్దె ఇళ్ల వైపు ఆకర్షిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్లు అద్దె ఇళ్లలో ఉండటం అనేది కేవలం అవసరమే కాదు.. వారి జీవనశైలిలో ఒక భాగంగా మారింది. రణబీర్ కపూర్ ఒకానొక సమయంలో తన కుటుంబ ఇంటి పునరుద్ధరణ పనులప్పుడు నెలకు 15 లక్షల రూపాయలు అద్దె చెల్లించి నివసించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ హీరోలు కూడా కెరీర్ ఆరంభంలో తన కుటుంబంతో కలిసి ఖార్ ప్రాంతంలో అద్దె ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు ఆయన సొంత ఇల్లు కొనుగోలు చేసినా కానీ.. ముంబై వంటి నగరాల్లో సౌలభ్యం కోసం అద్దెకు ఉండటం అనేది స్టార్లకు ఒక సాధారణ విషయంగా మారిపోయింది. ఎంతటి విలాసవంతమైన జీవితం ఉన్నా.. పరిస్థితులకు తగ్గట్లుగా అద్దె ఇళ్లలో అడ్జస్ట్ అవుతున్న ఈ సినీ తారల `ట్రెండీ స్టోరీ` ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సొంత ఇల్లు ఉన్నా సరే కొన్నిసార్లు సౌలభ్యం కోసం లేదా పని ప్రదేశానికి దగ్గరగా ఉండటం కోసం ఇలా లక్షల రూపాయల అద్దె చెల్లించి ఉండటాన్ని ఈ తారలు ఏమాత్రం సంకోచించరు.
