Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: వెండితెర వీరుల 'ఫ్యామిలీ మ్యాన్' అవతారం!

ముఖ్యంగా బ్యాచిలర్ లైఫ్‌లో సినీ ప్రపంచంలో విహరించిన స్టార్లు.. వివాహం చేసుకుని తండ్రులు అయ్యాక వారి ప్రవర్తనలో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే అంశంపై అభిమానులు నిరంత‌రం చ‌ర్చించ‌డం స‌హ‌జం.

By:  Sivaji Kontham   |   6 Jun 2026 7:00 PM IST
టాప్ స్టోరి: వెండితెర వీరుల ఫ్యామిలీ మ్యాన్ అవతారం!
X

గ్లామ‌ర్ రంగంలో టాప్ హీరోల‌ వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ అభిమానులకు, మీడియాకు అమితమైన ఆసక్తిని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా బ్యాచిలర్ లైఫ్‌లో సినీ ప్రపంచంలో విహరించిన స్టార్లు.. వివాహం చేసుకుని తండ్రులు అయ్యాక వారి ప్రవర్తనలో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే అంశంపై అభిమానులు నిరంత‌రం చ‌ర్చించ‌డం స‌హ‌జం. బాధ్యతాయుతమైన పితృత్వం అనేది వెండితెర వీరుల జీవితాల్లో ఎలాంటి పెను మార్పులు తీసుకువచ్చిందో ఈ తరం హీరోల లైఫ్‌స్టైల్‌ను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

ముఖ్యంగా హిందీ చిత్రసీమకు చెందిన రణబీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్ వంటి నేటి తరం బాలీవుడ్ హీరోలందరిలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ తరం నటులంతా ఎంతో ఫ్లేమ్‌బోయెంట్ (సందడిగా, విలాసవంతంగా) జీవనాన్ని గడిపినవారే. విదేశీ వెకేషన్లలోనో ఎయిర్‌పోర్టుల్లోనో త‌మ గాళ్ ఫ్రెండ్స్ (హీరోయిన్‌లు)తో షికార్లు చేస్తూ కెమెరాలకు చిక్కడం.. నిరంతరం ఫేజ్‌-3 వార్తల్లో నిలవడం వీరికి అలవాటుగా ఉండేది. కానీ పెళ్లయి పిల్లలు పుట్టి తండ్రులుగా ప్రమోషన్ పొందాక ఈ బాలీవుడ్ స్టార్లందరిలోనూ ఒక పరిణతి వచ్చింది. తమ గ‌త‌ వేగాన్ని, రోమాంచిత `భామా కలాపాన్ని` పూర్తిగా తగ్గించి వివాదాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన ఫ్యామిలీ మెన్‌గా పబ్లిక్ లైఫ్‌లో కనిపిస్తున్నారు.

మరోవైపు దక్షిణాది చిత్రసీమలోని తెలుగు స్టార్ల విషయానికి వస్తే... ఇక్కడి సమీకరణాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. టాలీవుడ్ అగ్ర నటులైన సూపర్‌స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని, గోపీచంద్, నితిన్, నిఖిల్ వంటి హీరోల గురించి కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎలాంటి అనవసరమైన వ్యక్తిగత గాసిప్పులు ప్రచారంలోకి రాలేదు. మన హీరోల వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు, వారు ఎల్లప్పుడూ కుటుంబ విలువలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం వల్లే ఇండస్ట్రీలో వారిపై ఎలాంటి మచ్చ పడలేదు.

టాలీవుడ్‌లో ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటానికి తెలుగు మీడియా మంచితనం, సంయమనం కూడా ఒక ప్రధాన కారణం. హిందీ మీడియా తరహాలో ఇక్కడి జర్నలిజం నటుల వ్యక్తిగత జీవితాలపై అనవసరమైన దుష్ప్రచారం చేయ‌డం లేదా గాసిప్ రాయడం వంటివి అరుదు. మన స్టార్లు ఫలానా హీరోయిన్‌తో ఎఫైర్ సాగించారని నిరూపించే ఒక్క సంఘటన కూడా ఎప్పుడూ బయటపడకపోవడానికి ఇరువైపులా ఉన్న ఈ హుందాతనమే కారణం. షూటింగ్ ముగియగానే మన హీరోలు తమ పూర్తి సమయాన్ని భార్యాపిల్లలకే కేటాయిస్తూ ఆదర్శవంతమైన తండ్రులుగా నిలుస్తున్నారు.

పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో కూడా కొన్నిసార్లు కో-స్టార్స్‌తో ముడిపెడుతూ రూమర్స్ వచ్చినా... వాటికి ఎలాంటి సరైన ఆధారాలు లభించలేదు.. ఎవరూ చూపించలేకపోయారు కూడా. మొత్తానికి ఉత్తరాది హీరోలు తండ్రులు అయ్యాక బాధ్యతగా మారుతుంటే... మన తెలుగు హీరోలు మాత్రం మొదటి నుండి తమ వృత్తిగత జీవితానికి, కుటుంబ విలువలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఇండస్ట్రీలో తమదైన ప్రత్యేక గౌరవాన్ని కాపాడుకుంటున్నారు.