ఫాదర్స్ డే స్పెషల్: లైమ్‌లైట్‌కు దూరంగా.. బాధ్యతలకు దగ్గరగా!
ప్రపంచవ్యాప్తంగా తండ్రుల ప్రేమానురాగాలను.. వారి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే `ఫాదర్స్ డే` సందర్భాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అందరి దృష్టి పడింది.
By: Srikanth Kontham | 21 Jun 2026 8:47 PM ISTప్రపంచవ్యాప్తంగా తండ్రుల ప్రేమానురాగాలను.. వారి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే `ఫాదర్స్ డే` సందర్భాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అందరి దృష్టి పడింది. సాధారణంగా వెండితెరపై యాక్షన్, రొమాన్స్, భారీ డైలాగులతో అలరించే బాలీవుడ్ అగ్ర హీరోలు నిజ జీవితంలో తండ్రులుగా మారినప్పుడు వచ్చే మార్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. బిజీ షూటింగ్ షెడ్యూళ్లను, స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి పిల్లల పెంపకంలో భాగస్వామ్యం పంచుకుంటూ నేటితరం కథానాయకులు పితృత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు.
రణవీర్ సింగ్ - భార్య దీపికా పదుకొణెతో కలిసి ఫాదర్ హుడ్ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. 2024లో కుమార్తె ఆ దంపతులకు దువా జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో రణవీర్ తండ్రిగా మారడం జీవితానికి మరింత లోతైన అర్థాన్ని.. బాధ్యతను తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అలాగే మరో యువ హీరో వరుణ్ ధావన్ కూడా కుమార్తె లారా ధావన్ రాకతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. తండ్రిగా మారిన తర్వాత తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని.. భావోద్వేగాల పరంగా మరింత పరిణతి సాధించానని హర్షం వ్యక్తం చేసారు.
విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఇటీవలే నాన్నలుగా ప్రమోట్ అయి జీవితాల్లో మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. భార్య కత్రినా కైఫ్‌తో కలిసి విక్కీ కౌశల్ కుమారుడు విహాన్ పెంపకంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జంట కూడా కుమార్తె రాకతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తారలు వృత్తిగత బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో? అంతే ఆత్మీయంగా తండ్రిగా తమ పాత్రలను పోషిస్తున్నారు.
విలక్షణ నటులు అలీ ఫజల్, రణదీప్ హుడా సైతం తండ్రిగా బాధ్యతలు నెరవర్తిస్తున్నారు. 2024లో కుమార్తెకు జన్మనిచ్చిన అలీ ఫజల్ డాడ్ కావడం తనను మరింత ఆలోచనాపరుడిని చేసిందని చెప్పుకొచ్చారు. 2026లో కుమార్తె న్యోమికా హుడాకు తండ్రి అయిన రణదీప్ హుడా కొత్త బాధ్యత మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. వెండితెరపై రగ్గడ్ .. సీరియస్ పాత్రల్లో కనిపించే ఈ నటులు నిజ జీవితంలో కూతుర్ల దగ్గర ఎంతో సున్నితంగా మారిపోవడం విశేషం.
నేటితరం సెలబ్రిటీ తండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. పాత తరంలా కాకుండా పిల్లల వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ఉన్నా? తమ పిల్లలను లైమ్‌లైట్‌కు వీలైనంత దూరంగా ఉంచుతున్నారు. మీడియా కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్భాను సారం అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. పిల్లల బాల్యం ప్రశాంతంగా సాగేలా చూసుకోవడం వీరి పరిణతికి అద్దం పడుతోంది.
