Begin typing your search above and press return to search.

హీరోల మోడల్‌నే ఫాలో అవుతున్న హీరోయిన్లు.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

భారీ బడ్జెట్ సినిమాలు, భారీ ఓపెనింగ్స్, డిజిటల్ రైట్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో వారి స్టార్ పవర్‌కు ఎలాంటి గ్యాప్ వచ్చినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   31 Aug 2026 10:14 AM IST
హీరోల మోడల్‌నే ఫాలో అవుతున్న హీరోయిన్లు.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
X

బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌కు సంబంధించిన నిర్వచనం క్రమంగా మారుతోంది. ఒకప్పుడు ఓ హీరో మార్కెట్‌ను డిసైడ్ చేసేది అతను ఏడాదిలో ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని హిట్లు అందుకున్నాడు అన్నదే. కానీ ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా లేదా గరిష్ఠంగా రెండు సినిమాలు మాత్రమే చేస్తూ కూడా తమ మార్కెట్‌ను అంతే బలంగా కొనసాగిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, భారీ ఓపెనింగ్స్, డిజిటల్ రైట్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో వారి స్టార్ పవర్‌కు ఎలాంటి గ్యాప్ వచ్చినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు.

ఇదే మోడల్‌ను ఇప్పుడు బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లు కూడా తమదైన రీతిలో అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే వారి కెరీర్ ప్లానింగ్‌లో మరో ముఖ్యమైన మార్పు ఉంది. సినిమా కెరీర్‌తో పాటు తమకంటూ ప్రత్యేకమైన బిజినెస్, బ్రాండ్ ఐడెంటిటీని నిర్మించుకోవడంపై స్టార్ హీరోయిన్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందుకే ఒకప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు?” అనే ప్రశ్నకు బదులుగా సినిమా బయట వారి మార్కెట్ ఎంత? అనే ప్రశ్న కూడా కీలకంగా మారుతోంది.

హీరోల విషయంలో స్టార్ పవర్ ప్రధానంగా సినిమాల చుట్టూనే తిరుగుతుంటే, హీరోయిన్ల విషయంలో మాత్రం ఆ పరిధి విస్తరిస్తోంది. బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, వెల్‌నెస్, ప్రొడక్షన్ వంటి రంగాల్లోకి అడుగుపెడుతున్న హీరోయిన్లు తమ పేరును ఒక పూర్తి స్థాయి బ్రాండ్‌గా మార్చుకుంటున్నారు. ఒక సినిమా రిలీజ్ కాకపోయినా వారి మార్కెట్ యాక్టివ్‌గా ఉండటానికి ఇది మరో కారణంగా మారుతోంది.

ఇదే సమయంలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ మార్పుకు బలమైన కారణాలుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో వరుసగా కనిపించకపోయినా డిజిటల్ కంటెంట్, బ్రాండ్ క్యాంపెయిన్లు, ఫ్యాషన్ ఈవెంట్లు, ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్టులు, సోషల్ మీడియా ద్వారా ఆడియ‌న్స్ తో కనెక్షన్ కొనసాగుతోంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను కేవలం బాక్సాఫీస్‌తో కొలిచే పాత విధానం బలహీనపడుతోంది. మరోవైపు, ఈ మార్పు హీరోయిన్ల‌కు కెరీర్‌పై మరింత కంట్రోల్‌ను కూడా ఇస్తోంది. ప్రతి ఏడాది ఎక్కువ సినిమాలు చేయాలనే అవసరం లేకుండా, తమ ఇమేజ్‌కు సరిపోయే ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవ‌డంతో పాటు లాంగ్ టైమ్ బ్రాండ్ వాల్యూను పెంచుకునే అవకాశం లభిస్తోంది.

అందుకే బాలీవుడ్‌లో ఫిమేల్ స్టార్ అనే పదానికి అర్థం కూడా మారుతోంది. తెరపై కనిపించే హీరోయిన్‌గానే కాకుండా, వ్యాపారవేత్తగా, బ్రాండ్ ఓనర్‌గా, గ్లోబల్ సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును నిర్మించుకోవడం హీరోయిన్ల‌ స్టార్‌డమ్‌కు ప్రతీకగా మారుతోంది. మొత్తంగా చూస్తే.. హీరోల చేతిలో సినిమాలు ఉంటే, హీరోయిన్ల చేతిలో సినిమాలతో పాటు బ్రాండ్లు కూడా ఉండే రోజులు వచ్చేశాయనే చెప్పాలి.