స్టార్‌హీరోని బెదిరించి కోట్లు కొట్టేసేందుకు కుట్ర.. పోలీసుల విచారణలో కఠోరనిజాలు!
పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రముఖ హీరోను భయభ్రాంతులకు గురిచేసి అతడి నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ నకిలీ గ్యాంగ్ బెదిరింపుల నాటకమాడినట్లు ఒప్పుకున్నాడు.
By: Sivaji Kontham | 26 Aug 2026 9:58 AM ISTప్రముఖ బాలీవుడ్ హీరోను టార్గెట్ చేస్తూ సాగిన ఒక పెద్ద దందాను.. ఆయన పేరు మీద సాగిన నకిలీ బెదిరింపుల కుట్రను ముంబై పోలీసులు సక్సెస్ ఫుల్‌గా ఛేదించారు. ఆ హీరోను.. అతడి కుటుంబాన్ని తీవ్రంగా భయపెట్టి.. అతడి నుంచి భారీగా డబ్బు గుంజాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తి పక్కా ప్లాన్‌తో ఫేక్ ఆపరేషన్ నడిపినట్లు పోలీసుల విచారణలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ముంబై కాప్ వివరాల ప్రకారం... నిందితుడు నకిలీ ఐడెంటిటీలను సృష్టించడమే కాకుండా.. సదరు హీరోకు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ నుంచి తీవ్ర ముప్పు ఉన్నట్లు చిత్రీకరించడానికి కొన్ని నకిలీ వాట్సాప్ చాట్ సంభాషణలను క్రియేట్ చేశాడు. అయితే ఆ మెసేజ్‌లలోని లొసుగు.. సంబంధం లేని డిఫరెంట్ విషయాలను లోతుగా పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో ఈ కుట్ర కోణం బయటపడింది. అంతేకాకుండా నిందితుడు చెప్పిన కథనానికి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో ఈ ఫేక్ అంశంపై పోలీసుల నిఘా మరింత కఠినమైంది.
పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రముఖ హీరోను భయభ్రాంతులకు గురిచేసి అతడి నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ నకిలీ గ్యాంగ్ బెదిరింపుల నాటకమాడినట్లు ఒప్పుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా బాంద్రా సీఫ్రంట్ వద్ద దాచిపెట్టిన రెండు మొబైల్ ఫోన్లతో పాటు.. ఆ నకిలీ వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఫేక్ ఆపరేషన్‌కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోణాన్ని కూడా పోలీసులు వెలికితీశారు. బీహార్‌లోని సివాన్ ప్రాంతం నుండి ఫోన్‌పే ద్వారా నిందితుడికి దాదాపు రూ. 1.30 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని నిందితుడు బాంద్రాలోని ఒక మనీ-ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ ద్వారా నగదు రూపంలో డ్రా చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్) - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులోని ప్రముఖ బాలీవుడ్ హీరోకు ఉన్న భద్రతాపరమైన ఆందోళనల గురించి అందరికీ తెలిసిందే. నిందితుడు ఆ భయాలనే ఆసరాగా చేసుకుని.. పక్కా పథకం ప్రకారం ఈ నకిలీ బెదిరింపులను నిజమైనవిగా నమ్మించి డబ్బులు గుంజాలని కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ నకిలీ బెదిరింపుల డ్రామాలో నిందితుడు ఒక్కడే పాల్గొన్నాడా లేదా అతని వెనుక మరికొందరు ముఠా సభ్యులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
