Begin typing your search above and press return to search.

జైలు కూడు యాత‌న‌ గురించి మాట్లాడిన టాప్ -5 స్టార్లు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల ఒక రియాలిటీ షోలో పాల్గొని తన జైలు అనుభవాలను నిర్మొహమాటంగా రివీల్ చేసారు.

By:  Sivaji Kontham   |   5 Aug 2026 6:00 PM IST
జైలు కూడు యాత‌న‌ గురించి మాట్లాడిన టాప్ -5 స్టార్లు
X

వెండితెర న‌టులుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని.. సకల సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే సినీ తారలు కొన్ని అనుకోని పరిస్థితుల్లో జైలు జీవితాన్ని అనుభవించాల్సిన దుస్థితి రావొచ్చు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు జైలు పాలయ్యారు. లగ్జరీ కార్లు, పంచభక్ష్య పరమాన్నాలు తినే వీరంతా జైలు గోడల మధ్య సాధారణ ఖైదీల వలె జీవితాన్ని గడపడం, అక్కడి సౌకర్యాలు, భోజనం గురించి బయటకు వచ్చాక షేర్ చేసుకున్న అనుభవాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల ఒక రియాలిటీ షోలో పాల్గొని తన జైలు అనుభవాలను నిర్మొహమాటంగా రివీల్ చేసారు. దాదాపు 50 నుండి 70 మంది ఖైదీలు ఒకే ఒక్క బాత్‌రూమ్‌ను ఉపయోగించుకోవాల్సి వచ్చేదని.. కేవలం పప్పు (దాల్), రొట్టెలు వంటి అత్యంత సాధారణ ఆహారాన్ని తింటూ రోజులు గడిపానని తెలిపారు. అయితే ఆ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత పెద్దగా కష్టమనిపించలేదని.. పరిస్థితులకు అనుగుణంగా మారడం జైలు జీవితమే నేర్పించిందని ఆయన వెల్లడించారు. సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా బాలీవుడ్ మరో నటుడు సంజయ్ దత్ కూడా పూణేలోని యెరవాడ జైలులో కఠిన శిక్షను అనుభవించారు. అక్కడి భోజనం, పేలవమైన సౌకర్యాలు మరియు కవర్లు కుట్టడం లాంటి పనులు చేస్తూ గడిపిన రోజులను ఆయన పలు ఇంటర్వ్యూలలో గుర్తు చేసుకున్నారు.

మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ హీరో దిలీప్ కూడా ఒక నటిపై దాడి కేసులో సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపారు. సాధారణ ఖైదీలతో కలిసి జైలు భోజనం తింటూ.. సరైన నిద్ర లేక అక్కడి వాతావరణంలో తీవ్ర అవస్థలు పడినట్లు సమాచారం. బయటకు వచ్చాక జైలులోని ఆహారం, అధికారుల ప్రవర్తన, అక్కడి నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో పలు సందర్భాల్లో చర్చల్లోకి వచ్చాయి. ఎంతటి అగ్ర నటులైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని.. జైలులో ప్రత్యేక విలాసాలకు తావుండదని వీరి అనుభవాలు నిరూపించాయి.

హీరోలతో పాటు పలువురు కథానాయికలు కూడా ర‌క‌ర‌కాల‌ కేసుల్లో చిక్కుకుని జైలు శిక్ష అనుభవించారు. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలతో పాటు నటి రన్యా రావు వంటి వారు పరప్పన అగ్రహార జైలులో గడిపారు. జైలులో వడ్డించే భోజనం తినలేక.. అక్కడి వసతులు నచ్చక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి భోజనం లేదా బయటి ఆహారం కోసం వారు కోర్టులను కూడా ఆశ్రయించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

అధికారుల ప్రవర్తన విషయానికొస్తే.. కొందరు తారలకు చట్ట ప్రకారం లభించే కనీస వసతులు కల్పిస్తే, మరికొందరికి అధికారుల కఠినమైన వైఖరి వల్ల మానసిక వేదన తప్పలేదు. స్క్రీన్ మీద గ్లామరస్‌గా కనిపించే సెలబ్రిటీలు జైలు గోడల మధ్య కూడు, గూడు కోసం పడిన యాతన వారి జీవితాల్లో ఒక మరకగా మిగిలిపోవడమే కాకుండా.. ఎంతటి వారికైనా చట్టం- జైలు శిక్షలు సమానమేననే చేదు నిజాన్ని గుర్తుచేశాయి.