Begin typing your search above and press return to search.

అంచనాలు తారుమారు... అయిదులో మూడు ఫ్లాప్

బాలీవుడ్‌లో సక్సెస్‌ రేటు దారుణంగా పడిపోయింది. గతంతో పోల్చితే సినిమాల విడుదల కూడా చాలా తక్కువ అయింది

By:  Ramesh Palla   |   9 Oct 2026 11:45 AM IST
అంచనాలు తారుమారు... అయిదులో మూడు ఫ్లాప్
X

బాలీవుడ్‌లో సక్సెస్‌ రేటు దారుణంగా పడిపోయింది. గతంతో పోల్చితే సినిమాల విడుదల కూడా చాలా తక్కువ అయింది. గత నెలలో టాలీవుడ్‌ నుంచి దాదాపుగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కానీ బాలీవుడ్‌ నుంచి కేవలం అయిదు సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెప్టెంబర్‌ ఆరంభంలో సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్ మీర్జాపూర్‌ కి సంబంధించి అదే టైటిల్‌తో 'మీర్జాపూర్‌' సినిమా వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా, ఒక వర్గం ప్రేక్షకుల దృష్టిని మాత్రమే ఆకర్షించిన మీర్జా పూర్‌ విడుదలైన తర్వాత మొత్తం పరిస్థితిని మార్చింది. సినిమాకు పాజిటివ్‌ పబ్లిసిటీ దక్కడంతో పాటు, సినిమాకు మొదటి షో తోనే పాజిటివ్‌ టాక్ రావడంతో మొదటి రోజు ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్‌లో సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో సూపర్‌ హిట్‌గా నిలిచింది.

మీర్జాపూర్ సినిమా తర్వాత...

మీర్జాపూర్‌ బాక్సాఫీస్‌ దండయాత్ర కొనసాగుతున్న సమయంలోనే హైవాన్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హైవాన్‌ సినిమా విడుదలకు ముందు వరకు చాలా అంచనాలను మోస్తూ వచ్చింది. మల్టీస్టారర్‌ మూవీ అంటూ ప్రచారం చేయడంతో హైప్‌ దక్కింది. హైవాన్‌ మినిమం గ్యారెంటీ హిట్‌ అంటూ మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. తీరా చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సినిమాకు వచ్చిన నెగిటివ్‌ రివ్యూల కారణంగా మొదటి రోజు దారుణమైన నెంబర్ నమోదు అయ్యాయి. అంతే కాకుండా లాంగ్‌ రన్‌లోనూ సినిమాకు గౌరవప్రదమైన వసూళ్లు నమోదు కాలేదు. ఇప్పటికే సినిమాను జనాలు మర్చి పోయి, ఆ సినిమా ఎప్పుడు వచ్చింది అనే స్థాయికి చేరింది అనడంలో సందేహం లేదు. హైవాన్‌ తర్వాత వైబ్‌, దాయారా సినిమాలు వచ్చాయి.

వైబ్ సినిమా విడుదలతో...

కునాల్‌ ఖేము, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో రూపొందిన వైబ్‌ సినిమా విడుదలకు ముందు పాజిటివ్ బజ్ ను క్రియేట్‌ చేయడంలో సఫలం అయింది. సినిమా పబ్లిసిటీ స్టఫ్‌తో పాటు ఇతర విషయాలు సైతం కలిసి వచ్చి వైబ్‌ కి మంచి వైబ్‌ కలిసి వచ్చిందనే టాక్‌ వచ్చింది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. సాధారణంగానే సినిమాకు నెగిటివ్‌ టాక్ వచ్చింది, పైగా సినిమాకు పోటీగా దాయరా సినిమా సైతం ఉంది. దాంతో వైబ్‌ సినిమాకు మినిమం ఓపెనింగ్స్‌ నమోదు కాలేదు. రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదల అయిన చాలా సందర్భాల్లో పాజిటివ్‌ టాక్ వస్తే మంచి స్పందన దక్కించుకున్నాయి. కానీ వైబ్ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ వసూళ్లను పూర్తిగా డ్రాప్‌ చేశాయి. ఈ సినిమా వచ్చిందనే విషయం చాలా మందికి తెలియలేదు. అంతలోనే థియేటర్ల నుంచి వెళ్లి పోయింది.

ది వాన్‌, దాయారా సినిమాల ఫలితాలు..

వైబ్ తో పాటు అదే రోజు దాయారా సినిమా వచ్చింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, కరీనా కపూర్ ఖాన్‌ ముఖ్య పాత్రల్లో నటించడంతో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా కరీనా కపూర్‌ ఒక మంచి పవర్‌ ఫుల్‌ రోల్‌ లో కనిపించబోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన కథ, కథనం అంటూ రివ్యూలు వచ్చాయి. కరీనా కపూర్‌ పాత్ర సైతం ఫ్యాన్స్ ను మెప్పించలేక పోయింది. దాంతో వైబ్‌తో పాటే దాయారా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

ఇక సెప్టెంబర్‌లో చివరగా ది వాన్‌ సినిమాతో సిద్దార్థ్‌ మల్హోత్రా వచ్చాడు. సినిమాను స్త్రీ రేంజ్‌ లో ప్రమోట్‌ చేశారు. కానీ అంత సీన్ లేదని విడుదలైన వెంటనే రివ్యూలు వచ్చాయి. దాంతో వసూళ్ల పై ప్రభావం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ది వాన్‌ కి హిట్ మూవీ అనిపించుకునేలా గౌరవప్రధమైన వసూళ్లు నమోదు అయ్యాయట. మొత్తానికి ఈ నెలలో అయిదు సినిమాలు వస్తే మూడు దారుణంగా ఫ్లాప్‌గా నిలిచాయి. ఒకటి సూపర్‌ హిట్‌ కాగా, మరోటి హిట్‌గా నిలిచింది. మంచి కంటెంట్‌తో వస్తే బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం తప్పకుండా ఆధరిస్తారని ఈ నెల మరోసారి నిరూపితం అయిందని బాక్సాఫీస్‌ వర్గాల వారు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.