3.30 గంటల నిడివి... చాలా పెద్ద రిస్క్
బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయినప్పటికీ ముందు ముందు రాబోతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
By: Ramesh Palla | 28 Nov 2025 12:00 AM ISTబాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయినప్పటికీ ముందు ముందు రాబోతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఈ ఏడాది ముగింపుకు వచ్చేశాం. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో హిట్ అయిన సినిమాల జాబితా తీయాలంటే ఎంత వెతికినా పది కంటే ఎక్కువ పేర్లు చెప్పడం కష్టం. సూపర్ హిట్ అంటే రెండు మూడు పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఇలాంటి సమయంలో రాబోతున్న సినిమాల విషయంలో జాగ్రత్తలు ఒకటికి పది తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బాలీవుడ్ సినిమాలను రిస్క్ ఫ్యాక్టర్‌తో తీసుకు రావడం అనేది చాలా పెద్ద నిర్ణయం అనే విషయం ఇప్పటికే చాలా మందికి అర్థం అయింది. అయినా కూడా ధురంధర్ మేకర్స్ మాత్రం రన్ టైం రిస్క్ ఫ్యాక్టర్‌తో పెద్ద రిస్క్ చేసేందుకు గాను రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ధురంధర్..
ఓటీటీ, షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు చాలా తక్కువ నిడివిని కోరుకుంటున్నారు. సినిమా రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటే ఓకే. ఈ మధ్య కాలంలో మూడు గంటలు అన్నా కూడా కాస్త ఎక్కువే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి సమయంలో ధురంధర్ సినిమాను ఏకంగా మూడున్నర గంటల పాటు ఉండే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజం అయితే ఖచ్చితంగా సినిమా విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధురంధర్ సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి కిందా మీదా పడుతున్నారు. ఇలాంటి సమయంలో రన్ టైం విషయంలో నెగిటివ్ ప్రచారం జరిగితే ఓపెనింగ్స్ పై ప్రభావం ఉటుందని అంటున్నారు.
సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్రల్లో...
బాలీవుడ్ మీడియాలో ధురంధర్ సినిమాను ఏకంగా మూడున్నర గంటల నిడివితో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో హీరో రణ్‌వీర్ సింగ్ అభిమానులతో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు బాబోయ్ అంత అవసరమా అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉంది. అందుకే ఈ సినిమా నిడివి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది అని చాలా మంది యూనిట్ సభ్యులు భావించారట. అందుకే సినిమాను మూడున్నర గంటల పాటు రన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు అని తెలుస్తోంది. అంత మంది నటీనటులను చూపించాలంటే వారికి మినిమం స్కోప్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రన్ టైం ఎక్కువ అయిందని యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
సారా అర్జున్ నటించిన..
ఆదిత్య ధార్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్‌లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్ లు సంయుక్తంగా నిర్మించిన ధురంధర్ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సారా అర్జున్, రాకేష్ బేడీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను దర్శకుడు ఆదిత్య ధార్ కొట్టిపారేశాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. ఒకవేళ నేను మోహిత్ శర్మ జీవిత చరిత్రతో సినిమాను తీయాలి అనుకుంటే ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఆయన జీవిత విశేషాలను తెలుసుకున్న తర్వాత సినిమాను తీస్తాను. అంతే తప్ప నాకు తెలిసిన విషయాలతో తీయను అన్నాడు. ఈ సినిమా ఎవరి బయోపిక్ కాదని తేల్చి చెప్పాడు. దాంతో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కి తెర పడ్డట్లు అయింది.
