Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ కొనసాగుతున్న వేళ, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎదిగిన నటులు తమ సత్తా చాటుతున్నారు. కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్, విక్రాంత్ మాస్సే, విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ వంటి నటులు ప్రతిభ, కష్టంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్‌డమ్ అందుకుంటున్నారు.

By:  Sivaji Kontham   |   20 Nov 2026 11:03 PM IST
ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!
X

బాలీవుడ్‌లో వారసత్వ రాజకీయాలు- నెపోటిజం చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. సీనియ‌ర్ న‌టి కంగ‌న ర‌నౌత్ నిరంత‌రం త‌న మాట‌ల్లో న‌ట‌వార‌సుల‌ను తూల‌నాడుతూనే ఉంటారు. ఇటీవ‌ల ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ నేపో కిడ్స్ కార‌ణంగా అవ‌కాశాలు పోయాయ‌ని ఆవేద‌న చెందాడు. అయితే ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా..కేవలం తమ ప్రతిభ- కష్టంతోనే ముంబై చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఔట్‌సైడర్ నటులు నేడు గట్టి పోటీనిస్తున్నారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చి.. చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టే స్థాయికి ఎదిగిన నటుల జాబితా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కంగ‌న లేదా బిబిల్ ఖాన్ వాస్త‌వం వేరుగా ఉంద‌నేది కూడా ఇక్క‌డ అర్థం చేసుకోవడానికి ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

కమర్షియల్ హీరోలుగా.. కంటెంట్ ఆధారిత స్టార్లుగా రాణిస్తున్న ఔట్ సైడ‌ర్స్ లో కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్ ముందు వరుసలో నిలుస్తారు. గ్వాలియర్ నుంచి ఇంజనీరింగ్ చదువుతూ వచ్చిన కార్తీక్ ఆర్యన్ `భూల్ భులయ్యా`సిరీస్, `చందు ఛాంపియన్` వంటి సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. మరోవైపు రేడియో జాకీగా మొదలైన ఆయుష్మాన్ ఖురానా `అంధాధున్`, `బధాయి హో` వంటి వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ ఏర్పరుచుకున్నారు. అలాగే గురుగ్రామ్ నుంచి వచ్చిన రాజ్‌కుమార్ రావ్ షాహిద్, న్యూటన్ వంటి సినిమాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొంది.. `స్త్రీ 2` భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు.

సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ దూసుకుపోతున్న వారిలో విక్రాంత్ మాస్సే, సిద్ధాంత్ చతుర్వేది, అవినాష్ తివారీ ప్రత్యేకంగా నిలుస్తారు. బుల్లితెర నుంచి వచ్చిన విక్రాంత్ మాస్సే `ట్వ‌ల్త్ ఫెయిల్` చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి నేటి తరం అత్యుత్తమ నటులలో ఒకరిగా నిలిచారు. సీఏ చదువును మధ్యలోనే వదిలేసి వచ్చిన సిద్ధాంత్ చతుర్వేది `గల్లీ బాయ్`లోని ఎంసీ షేర్ పాత్రతో స్టార్‌డమ్ అందుకుని యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బీహార్‌కు చెందిన అవినాష్ తివారీ సైతం `లైలా మజ్ను`, `మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్` వంటి వైవిధ్యమైన చిత్రాలతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు.

ఇక విలక్షణ పాత్రలు... నెగటివ్ షేడ్స్‌తో పాటు ఓటీటీ- వెండితెరపై తమ ముద్ర వేస్తున్న నటుల్లో హైదరాబాద్‌కు చెందిన విజయ్ వర్మ, హర్యానా నటుడు జైదీప్ అహ్లావత్ చూస్తుండ‌గానే ఐకాన్ స్టార్స్ గా ఎదిగారు. ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత గల్లీ బాయ్, డార్లింగ్స్, ఐసీ 814 వంటి ప్రాజెక్టులతో విజయ్ వర్మ అత్యంత బిజీ నటుడిగా ఎదిగారు. `పాతాళ్ లోక్` సిరీస్‌తో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న జైదీప్ అహ్లావత్ మహారాజ్, జానే జాన్ వంటి చిత్రాలతో ప్రధాన పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. వీరితో పాటు డ్యాన్సర్‌గా మొదలై నటుడిగా `కిల్` వంటి చిత్రాలతో ఆకట్టుకుంటున్న రాఘవ్ జుయల్ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

కొత్త తరం ప్రతిభావంతుల్లో జంషెడ్‌పూర్‌కు చెందిన ఆదర్శ్ గౌరవ్ `ది వైట్ టైగర్` చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో బాఫ్టా నామినేషన్ వరకు వెళ్లి బాలీవుడ్ సత్తాను చాటారు. రాజస్థాన్ నుంచి వచ్చిన స్పర్శ్ శ్రీవాస్తవ `జామ్‌తారా` సిరీస్ తర్వాత `లాపతా లేడీస్`లో దీపక్ కుమార్ పాత్రతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి గాడ్ ఫాదర్ అండ లేకపోయినా కేవలం కఠోర శ్రమ.. సరైన కథల ఎంపికతో వీరంతా బాలీవుడ్‌లో తమదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఎంతోమంది కొత్త నటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేపో కిడ్స్ పై విరుచుకుప‌డే బాబిల్ ఖాన్ లేదా కంగ‌న ర‌నౌత్ ఇలాంటి అప్ డేటెడ్ విష‌యాల‌ను కూడా ఇక‌పై స్మ‌రించుకోవాల్సి ఉంటుందేమో!