స్టార్ కిడ్స్ Vs అవుట్ సైడర్స్.. నెపోటిజంపై ఇప్పుడెందుకీ రచ్చ?
బాలీవుడ్ లో నెపోటిజం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఆలియా భట్, శర్వరి వాఘ్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
By: M Prashanth | 23 Jun 2026 9:32 AM ISTబాలీవుడ్ లో నెపోటిజం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఆలియా భట్, శర్వరి వాఘ్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రీసెంట్ గా ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్-2లో వీరిద్దరూ పాల్గొనడం, అక్కడ జరిగిన కొన్ని సందర్భాలు ఇప్పుడు పలువురు నెటిజన్ల మధ్య కామెంట్స్ వార్ కు దారితీసిందనే చెప్పాలి.
నిజానికి ఆ షోకి వచ్చినందుకు ఆలియా, శర్వరికీ ప్రశంసలు లభించాయి. అయితే అదే సమయంలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరిద్దరి బిహేవియర్ ను కంపేర్ చేస్తూ నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆలియా భట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు కావడంతో బాలీవుడ్ ఛాన్సులు ఈజీగా వచ్చాయని అంటున్నారు.
అందుకే ఆమెను నెపోకిడ్ గా పరిగణిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. విమర్శలు వచ్చినప్పుడు ఆలియా వాటిని రిసీవ్ చేసుకోలేదని, రెస్పాన్స్ కొంత డిస్ కంఫర్ట్ కనిపించిందని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు శర్వరి వాఘ్ ను మరికొందరు ‘అవుట్ సైడర్ గా పేర్కొంటున్నారు. ఆమె విమర్శలను చాలా పాజిటివ్ గా తీసుకుందని, కూల్ గా రెస్పాండ్ అయిందని ప్రశంసిస్తున్నారు.
టాలెంట్ తోనే ఛాన్సులు సంపాదించుకుంటోందని, అందుకే ఆమెకు సోషల్ మీడియాలో సపోర్ట్ పెరుగుతోందని అంటున్నారు. అయితే దాన్ని ఆలియా ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. శర్వరిని పూర్తిగా అవుట్ సైడర్ గా చూపించడం సరైంది కాదని వారు చెబుతున్నారు. శర్వరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ప్రస్తావిస్తూ ఆమె కూడా మంచి పొలిటికిల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తేనని గుర్తుచేస్తున్నారు.
శర్వరి వాఘ్ మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి మనవరాలు అనే విషయాన్ని ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. అలాంటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిని పూర్తిగా అవుట్ సైడర్ గా ఎలా అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే శర్వరికి కూడా ఇండస్ట్రీలో పరిచయాలు, అవకాశాలు లభించే పరిస్థితులు ఉన్నాయని వాదిస్తున్నారు.
ఒకవైపు ఆలియాను నెపోటిజం సింబల్ గా చూపించే ప్రయత్నం జరుగుతుండగా, మరోవైపు శర్వరిని పూర్తిగా హార్డ్ వర్క్ తో ఎదిగిన హీరోయిన్ గా చూపించడం సరైనది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో నెపోటిజం అంశం తరచూ చర్చకు వస్తోంది. స్టార్ ఫ్యామిలీల నుంచి వచ్చిన నటీనటులు, బయట నుంచి వచ్చిన టాలెంటెడ్ పర్సన్స్ మధ్య కంపేరిజన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఆడియన్స్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కంటే యాక్టింగ్, టాలెంట్, సినిమా సెలక్షన్స్ ను ఎక్కువగా చూస్తున్నారని అంటున్నారు. ఆలియా భట్, శర్వరి వాఘ్ విషయంలో కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఎవరు నెపోకిడ్, ఎవరు అవుట్ సైడర్ అనే దానికంటే, తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తారనేదే కీలకమని చెప్పాలి.
