Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రికీ తోడొచ్చే త‌దుప‌రి ద‌ర్శ‌కులు ఎవ‌రు?

బాక్సాఫీస్ వద్ద పరిశ్రమ ఆధిపత్యాన్ని ..క్రేజ్‌ను సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే ఒకరిద్దరు దర్శకుల విజయం సరిపోదు.

By:  Srikanth Kontham   |   5 Sept 2026 4:00 AM IST
వాళ్లిద్ద‌రికీ తోడొచ్చే త‌దుప‌రి ద‌ర్శ‌కులు ఎవ‌రు?
X

పాన్-ఇండియా రేసు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలో హిందీ, తమిళ పరిశ్రమల నుంచి ఇటీవల కాలంలో ఇద్దరు దర్శకులు మాత్ర‌మే ప్రతిభతో బాక్సాఫీస్‌ను కుదిపేశారు. ఆదిత్య ధర్ అత్యుత్తమ మేకింగ్‌తో రూపొందించిన 'ధురంధర్' చిత్రంతో బాలీవుడ్‌కు సంచలన విజయాన్ని అందించగా.. తమిళంలో నెల్సన్ దిలీప్‌కుమార్ 'జైలర్' సినిమాతో 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కోలీవుడ్‌ను పాన్ ఇండ‌దియా వేదికపై నిలబెట్టారు. అయితే ఆ రెండు పరిశ్రమల నుంచి ఈ వేవ్‌ను నిలబెట్టడానికి ఇద్దరు దర్శకులే క‌నిపించ‌డం విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది.

బాక్సాఫీస్ వద్ద పరిశ్రమ ఆధిపత్యాన్ని ..క్రేజ్‌ను సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే ఒకరిద్దరు దర్శకుల విజయం సరిపోదు. ఆ వేగాన్ని అందుకోవడానికి, విజయాన్ని కొనసాగించడానికి మరికొందరు ప్రతిభావంతులైన దర్శకులు వెలుగులోకి రావాల్సి ఉంది. అలా కొత్త ప్రతిభతో కూడిన దర్శకుల వరుస తయారైనప్పుడే ఆయా పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా 500 -1000 కోట్ల క్లబ్ సినిమాలు వస్తాయి. లేని పక్షంలో ఆ విజయం కేవలం ఒకే ఒక్క సంచలనంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

బాలీవుడ్‌ విషయానికి వస్తే ఆదిత్య ధర్ వంటి దర్శకుడు అందించిన జోష్‌ను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం సిద్ధార్థ్ ఆనంద్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, నితీష్ తివారీ వంటి మేకర్లకు ఉంది . ఆ రేంజ్ ప్ర‌య‌త్నాలు ఎంత మంది చేస్తున్నారంటే? ప్ర‌స్తుతానికి నితీష్ ఒక్క‌రే క‌నిపిస్తున్నారు. అదీ ఆయ‌న రామాయ‌ణం తెర‌కెక్కించ‌డంతో హైలైట్ అవుతున్నారు. మిగ‌తా ఇద్ద‌రు అంత‌గా హైలైట్ అవ్వ‌డం లేదు. కోలీవుడ్‌లో నెల్సన్ సాధించిన 700 కోట్ల బెంచ్‌మార్క్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజు వంటి వారు ఉన్నా? వారి నుండి వచ్చే సినిమాలు జాతీయ స్థాయిలో మరింత పెద్ద విజయం సాధించాల్సి ఉంది.

హిందీ - తమిళ పరిశ్రమలు ఒకరిద్దరి విజయాలపైనే ఆధారపడకుండా కొత్త ఆలోచనలు .. భారీ విజన్ ఉన్న తదుపరి తరం దర్శకులను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆదిత్య ధర్, నెల్సన్ అందించిన ఊపును అందుకోగలిగే ఫాలో-అప్ దర్శకులు రావాలి. లేక‌పోతే ఆ పరిశ్రమలు పాన్-ఇండియా రేసులో తెలుగు సినిమా ఇచ్చే పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వినూత్న కథలతో వచ్చే యువ దర్శకులకు భారీ బడ్జెట్‌లను నమ్మి కేటాయించాలి.

ఈ రకమైన డైరెక్టర్ల లైనప్ సమస్య టాలీవుడ్‌కు లేకపోవడం విశేషం. తెలుగు పరిశ్రమలో పాన్-ఇండియా జెండాను ఎగరేసేందుకు పలువురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌ను ఏలుతుంటే? ఆయ‌న వెంట‌ సుకుమార్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్ర‌శాంత్ నీల్ లాంటి వారు క్యూలో ఉన్నారు.