పాన్ వరల్డ్ లో ఆ భామలకే పెద్ద పీట!
దేశీయ మార్కెట్‌నే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో దక్షిణాది దర్శకులు భారీ బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు
By: Srikanth Kontham | 23 March 2026 4:00 AM ISTప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ టార్గెట్ `పాన్-వరల్డ్` లో సంచలనం సృష్టించడం. దేశీయ మార్కెట్‌నే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో దక్షిణాది దర్శకులు భారీ బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకులు తమ సినిమాల్లోని కథానాయికల ఎంపిక విషయంలో కొత్త ఒరవడిని సృష్టి స్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకోవడానికి, బాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరవ్వడానికి మన డైరెక్టర్లు అంతా బాలీవుడ్ భామలకే పెద్ద పీట వేస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` కోసం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రియాంక చోప్రాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
హాలీవుడ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రియాంక ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో సినిమా బిజినెస్‌ను విస్తరించడానికి ప్రియాంక వంటి గ్లోబల్ స్టార్ తోడవ్వడం ఈ ప్రాజెక్టుకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. నవతరం మాస్ సినిమాల స్పెషలిస్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా `స్పిరిట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మలనే ఎంపిక చేసారు. ప్రభాస్ సరసన త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేయగా, మరో పాత్రకు ఐశ్వర్య దేశ్ తీసుకున్నారు.
`యానిమల్` సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తీ డిమ్రీ ప్రభాస్ సరసన నటిస్తుండటంతో సినిమాపై బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ హీరో - నార్త్ హీరోయిన్ అనే కాంబినేషన్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ మంత్రంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది` చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన `దేవర` సినిమాలోనూ ఆమెనే కథానాయికగా నటించింది.
`దేవర 2` లో తంగగా జాన్వీ కపూర్ ప్రేక్షకుల మరంత దగ్గర కానుంది. శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ ఈ రెండు మెగా ప్రాజెక్టుల ద్వారా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. ఆమె రాకతో ఈ సినిమాలకు హిందీ బెల్ట్‌లో విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇలా దక్షిణాది దర్శకులు బాలీవుడ్ నటీమణుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం మార్కెట్ విస్తరణే. దక్షిణాది నటుల యాక్షన్ మాస్ ఇమేజ్‌కు బాలీవుడ్ హీరోయిన్ల గ్లామర్ తోడైతే సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అంతే కాదు ఓటీటీ , శాటిలైట్ హక్కుల పరంగా కూడా ఇలాంటి కాంబినేషన్లకు భారీ ధర పలుకుతోంది.
అందుకే కథానాయికల ఎంపికలో దర్శకులు ఎక్కడా రాజీ పడలేదు. పాన్-ఇండియా లేదా పాన్-వరల్డ్ అప్పీల్ ఉన్న భామలనే ఎంచుకుంటున్నారు. భవిష్యత్ లో టాలీవుడ్ గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా మారునుంది. మన హీరోల సత్తాకు బాలీవుడ్ భామల పాపులారిటీ తోడవ్వడం వల్ల భారతీయ సినిమా రేంజ్ అంతకంతకు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్టుల్లో ఇలాంటి క్రేజీ కాంబినేషన్లను చూడబోతున్నాం.
