ఆ నలుగురు సరిపోరు అలాంటోళ్లు ఇంకా కావాలి!
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ సినిమా వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.
By: Srikanth Kontham | 29 March 2026 6:00 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ సినిమా వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. అయితే మారుతున్న కాలం మరియు పెరుగుతున్న పోటీ దృష్ట్యా కేవలం ఆ నలుగురు సరిపోరు అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. పాన్-వరల్డ్ స్థాయిలో తెలుగు సినిమా శాశ్వతంగా నిలబడాలంటే? మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్న క్రియేటర్లు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన టెక్నీషియన్ల అవసరం ఎంతైనా ఉంది.
బాలీవుడ్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్న తరుణంలో టాలీవుడ్ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ధురందర్ 2' వంటి భారీ విజయంతో దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు నెంబర్ వన్ రేసులోకి దూసుకొచ్చేలా ఉన్నారు. అద్భుతమైన మేకింగ్ , కంటెంట్‌తో ఆయన బాలీవుడ్ ఇమేజ్‌ను మార్చేస్తున్నారు. మరోవైపు `దంగల్ ఫేం నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణ చిత్రం 'దంగల్' రికార్డులను కూడా మించిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే తెలుగు నుండి మరిన్ని పవర్‌ఫుల్ ప్రాజెక్టులు రావాల్సి ఉంది.
హాలీవుడ్ , బాలీవుడ్ దర్శకులకు ధీటుగా పని చేసే నిపుణులు మన దగ్గర ఉన్నప్పటికీ, వారి సంఖ్య పెరగాలి. కేవలం భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే విజువల్ వండర్స్‌ను సృష్టించే దర్శకుల అవసరం ఉంది. గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించాలంటే కేవలం యాక్షన్ మాత్రమే సరిపోదు. బలమైన కథా బలంతో పాటు అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించగల టెక్నీషియన్లు ప్రతి సినిమాకు తోడుగా నిలవాలి.టాలీవుడ్ ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉంది. బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టే సత్తా మన హీరోలకు ఉంది.
కానీ ఆ వసూళ్లను నిలబెట్టుకోవాలంటే దర్శకులు నిరంతరం కొత్తదనంతో రావాలి. ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే పాన్-ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగించాలంటే రాజమౌళి లాంటి దార్శనికత ఉన్న మరో ఐదుగురు దర్శకులు మన టాలీవుడ్ నుండి పుట్టుకురావాలి. పోటీ అనేది కేవలం వసూళ్లలోనే కాదు. టెక్నాలజీ వినియోగంలో కూడా ఉండాలి. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్ మేకింగ్ ఉండాలి. ప్రస్తుతం ఆదిత్య ధర్, నితేష్ తివారీ వంటి దర్శకులు చేస్తున్న ప్రయోగాలు బాలీవుడ్ గ్రాఫ్‌ను పెంచుతున్నాయి.
వారిని మించిన ప్రతిభావంతులు, కష్టపడే తత్వం ఉన్న క్రియేటర్లు తెలుగు పరిశ్రమలో ఉన్నా? వారిని ప్రోత్సహించి సరైన ప్లాట్‌ఫామ్ కల్పించాల్సిన బాధ్యత నిర్మాతల పైనా, సీనియర్ డైరెక్టర్లపైనా ఉంది. తెలుగు సినిమాకిప్పుడు ఒక స్వర్ణయుగంలో ఉంది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ గ్లోబల్ స్థాయిలో టాలీవుడ్ ఏలాలంటే? మన క్రియేటివ్ ల్యాబ్‌లో నిరంతరం కొత్త ఆలోచనలు పుడుతూనే ఉండాలి. రాజమౌళి వేసిన బాటలో మరికొంతమంది యువ దర్శకులు నడిచి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పాలి. అప్పుడే టాలీవుడ్ ప్రపంచ సినిమా సింహాసనంపై కూర్చోగలదు.
