పెద్ద స్టార్‌తో లొల్లు పెట్టుకున్న ఇద్దరు డైరెక్టర్ల పని ఖతమ్
ట్యాలెంట్ ఉండడం ఒకెత్తు అనుకుంటే, `పట్టు పరిశ్రమ`లో పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం.
By: Sivaji Kontham | 9 Sept 2025 3:00 AM ISTట్యాలెంట్ ఉండడం ఒకెత్తు అనుకుంటే, `పట్టు పరిశ్రమ`లో పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. గ్లామర్ రంగంలో పెద్ద స్టార్లు లేదా పెద్ద బ్యానర్లతో `చాణక్య నీతి`ని ప్రదర్శించడం చాలా అవసరం. ప్రతిభావంతులైన దర్శకులకు అగ్రనిర్మాతలు, పెద్ద హీరోలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించడం సహజం. కానీ యాటిట్యూడ్ (హెడ్ వెయిట్) ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కొందరికి ప్రత్యక్ష అనుభవం. అలా యాటిట్యూడ్ చూపిస్తే, వివాదాస్పద స్వభావంతో దొరికిపోతే, ఎంత గొప్ప ట్యాలెంట్ ఉన్నా అది మరుగున పడిపోవాల్సిందే. ఇప్పుడు అలాంటి ఇద్దరు దర్శకుల గురించి బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆ ఇద్దరు ప్రముఖ దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ కు దూరమయ్యారు. ఆ ఇద్దరూ వరుసకు అన్నదమ్ములు. ఇండస్ట్రీలో గొప్ప ప్రతిభావంతులు. పెద్ద వాడు బాలీవుడ్ దిగ్గజ హీరోకి పాథ్ బ్రేకింగ్ హిట్ ని అందించాడు. రెండో వాడు నేడు భారతదేశం మొత్తం చర్చించుకునేంత గొప్ప దర్శకరచయితలలో ఒకరిగా స్థిరపడ్డారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకరచయితగా నిరూపించారు. ఇండస్ట్రీ మూలస్థంభం లాంటి హీరోలకు అతడు అద్భుతమైన కథల్ని అందించాడు. కానీ అతడు బాలీవుడ్ వర్క్ కల్చర్ ప్రతిభావంతులకు చోటివ్వదని తీవ్రంగా విమర్శించాడు. పెద్ద నిర్మాతలతో గొడవలు పెట్టుకున్నాడు. కారణం ఏదైనా, ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితి పూర్తి అయోమయంలో పడిపోయింది. దానికి కారణం యాటిట్యూడ్ లేదా పట్టు పరిశ్రమలో పట్టు పట్టడంలో విఫలమవ్వడం ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. సరైన సమయంలో చాణక్య నీతిని ప్రదర్శించడంలో విఫలమవ్వడం, పైగా పరిశ్రమను శాసించే లేదా నియంత్రించే పెద్ద హీరోతో శత్రుత్వం పెట్టుకోవడం ఆ ఇద్దరికీ ఈరోజు ఇండస్ట్రీలో చోటు లేకపోవడానికి కారణమైందని కూడా విశ్లేషిస్తున్నారు.
బాలీవుడ్ ని పెద్ద హీరో నియంత్రిస్తున్నాడని, అతడు తన కెరీర్ ని నాశనం చేసాడని, అతడికి నటించడం చేతకాదని కూడా అన్నదమ్ముల్లో పెద్దవాడు బహిరంగంగా మీడియా ఇంటర్వ్యూలో విమర్శించాడు. అతడు (పెద్ద హీరో) గూండా.. రాబందు.. అని కూడా ఇంటర్వ్యూలో విమర్శించాడు. ఇలాంటి వివాదాస్పద వైఖరి, బయటపడిపోయే స్వభావం సదరు దర్శకుడికి చేటు తెచ్చిందే కానీ, మేలు చేయలేదు. కేవలం అతడికి మాత్రమే చేటు తేలేదు. ప్రయోగాత్మక ఆలోచనలతో గొప్ప ప్రతిభావంతుడైన అతడి సోదరుడు కూడా బాలీవుడ్ ని వదిలి దక్షిణాదికి వెళ్లిపోవడానికి కారణమైంది. చాలా కాలంగా బాలీవుడ్ నుంచి అనధికారికంగా నిషేధానికి గురైన ఈ అన్నదమ్ములు పరిశ్రమలో ఆశించిన స్థాయికి ఎదగడంలో విఫలమయ్యారు.
మనుగడకు ముప్పు వచ్చిన క్రమంలోనే ఒకరు దక్షిణాదికి షిఫ్టవ్వగా, మరొకరు ఇంకా వివాదాస్పద వైఖరిని విడిచిపెట్టక పెద్ద హీరోకి, అతడి కుటుంబానికి శత్రువుగా మిగిలిపోయాడు. ఇప్పుడు మరోసారి పెద్ద హీరోపై దుమ్మెత్తిపోయడంతో ఇకపై ఈ అన్నదమ్ములకు ఇండస్ట్రీలో అవకాశాలొస్తాయా? అన్న గుసగుస వేడెక్కిస్తోంది. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. పెద్ద హీరోలు లేదా పెద్ద నిర్మాతలతో గొడవలు పెట్టుకుని సినీపరిశ్రమలో మనుగడ సాగించడం సాధ్యమవుతుందా? .. కాలమే దీనికి సమాధానం.
