సెలబ్రిటీస్ అంతా ఏంటి కోర్టు బాట పట్టారు.. అసలేం జరుగుతోంది?
బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో బాలీవుడ్ సెలబ్రిటీలేంటి హైకోర్టు బాట పట్టారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
By: Madhu Reddy | 15 Sept 2025 3:26 PM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో బాలీవుడ్ సెలబ్రిటీలేంటి హైకోర్టు బాట పట్టారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అసలేం జరుగుతోంది? వీరు ఎందుకు ఇలా వరుసగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు? అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఎందుకంటే మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా హైకోర్టును ఆశ్రయించి తన బాధను వెల్లబుచ్చుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కూడా హైకోర్టు బాట పట్టడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి సెలబ్రిటీలంతా వరుసగా హైకోర్టును ఆశ్రయించడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గత నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని.. తన అనుమతి లేకుండా తన ఫోటోలను, వాయిస్ ను ఉపయోగిస్తున్నారని, ఫోటోలను ఉపయోగించి అశ్లీల కంటెంట్ తయారు చేస్తున్నారని.. వీటివల్ల పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది.. దయచేసి వీటి నుంచి రక్షణ కల్పించండి అంటూ ఐశ్వర్యరాయ్ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఐశ్వర్య పిటిషన్ పై స్పందిస్తూ.. ఈ కామర్స్ వెబ్సైట్లకు, గూగుల్ సహా ఇతర ప్లాట్ ఫామ్ లకు.. ఐశ్వర్య తన పిటీషన్ లో పేర్కొన్న యుఆర్ఎల్ ను వెంటనే బ్లాక్ చేయాలి అని.. 72 గంటలలోపు ఇది జరిగిపోవాలని, లేకపోతే శిక్ష తప్పదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 15 కు వాయిదా వేసింది.
ఇదే విషయంపై ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని.. కొన్ని వెబ్ సైట్ లు తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని, ఏఐతో చేసిన తన ఫోటోలను అశ్లీల కంటెంట్ కు ఉపయోగించుకుంటున్నారని సంబంధిత ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు.
ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా చేరిపోయారు. తాజాగా ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.. తన వ్యక్తిగత, సమాచార హక్కులకు భంగం కలిగించకుండా ఆదేశాలు ఇవ్వాలి అని.. కొంతమంది దుండగులు తన ఫోటోలు, వాయిస్ ఉపయోగించి తప్పుదోవ పట్టిస్తున్నారని.. దయచేసి తన ఫోటోలను ఎవరు వాడకుండా.. టీ షర్ట్లపై తన ఫోటోలు ముద్రించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈయన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.
వీరే కాదండోయ్ గత వారం రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఈ కామర్స్ సంస్థలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది. తన ఫోటోలను తప్పుగా ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడింది.
ఇలా ఒకరి తరువాత ఒకరు కోర్టును ఆశ్రయించడంతో సెలబ్రిటీలకు ఏ రేంజ్ లో నష్టం వాటిల్లుతోందో అర్థం చేసుకోవచ్చు అని సదరు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి సెలబ్రిటీల ఫోటోల దుర్వినియోగంపై కోర్టు కఠిన ఆదేశాలు జారీచేస్తోంది. మరి ఈ జాబితాలోకి ఇంకెంత మంది సెలబ్రిటీలు వచ్చి చేరతారో చూడాలి.
