బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల మౌనం దేనికి సంకేతం?
బాలీవుడ్‌లో గతంతో పోలిస్తే రాజకీయ ..సామాజిక అంశాలపై ప్రముఖుల స్పందన పూర్తిగా మారిపోయింది.
By: Srikanth Kontham | 21 July 2026 1:15 PM ISTబాలీవుడ్‌లో గతంతో పోలిస్తే రాజకీయ ..సామాజిక అంశాలపై ప్రముఖుల స్పందన పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు దేశంలో జరిగే కీలక పరిణామాలు, వివాదాలు ..రాజకీయ నిర్ణయాలపై బాలీవుడ్ నటీనటులు నిర్మొహమాటంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణిలో పెద్ద మార్పు వచ్చిందన్నది వాస్తవం. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు చాలా వరకు మౌనాన్ని పాటిస్తున్నారు. ఈ పరిణామం వెనుక ఉదాసీనత మాత్రమే కాదు. తీవ్రమైన భయాలు, అనిశ్చితి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ విధానాలపై .. దేశంలో జరిగే సున్నితమైన అంశాలపై పెదవి విప్పితే తక్షణమే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన సెలబ్రిటీల్లో కనిపిస్తోందంటున్నారు. సోషల్ మీడియాలో వ్యవస్థీకృత ట్రోలింగ్ ఎదుర్కొనడం, నటించే సినిమాలు బహిష్కరణ బారిన పడటం వంటివి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిమంది నటులు గతంలో ప్రభుత్వ తీరును ..పెరుగుతున్న అసహనాన్ని ప్రశ్నించి నప్పుడు ఏ విధంగా వ్యతిరేకతను, ఆరోపణలను ఎదుర్కొన్నారో? తెలిసిందే. ఈ కారణాల వల్లే వివాదాల్లో తలదూర్చడానికి సాహసించడం లేదంటున్నారు.
సోషల్ మీడియా దాడులు మాత్రమే కాకుండా, అధికారిక విచారణలు , సంస్థల పరమైన వేధింపుల భయం కూడా బాలీవుడ్‌ను కమ్మేసిందని పరిశ్రమలోని కొందరు సీనియర్ ప్రముఖులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ , సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల రైడ్స్ జరుగుతాయనే భయం సెలబ్రిటీలను మౌనంగా ఉండేలా చేస్తోందని ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్ వంటి వారు ఇటీవల పరోక్షంగా ప్రస్తావించారు. కోట్లాది రూపాయల వ్యాపారాలు, పెద్ద బడ్జెట్ చిత్రాలు ముడిపడి ఉన్న సినీ పరిశ్రమలో ప్రభుత్వంతో విభేదిస్తే వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని వారు భావిస్తున్నారు.
మరోవైపు ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమలతో (ముఖ్యంగా టాలీవుడ్ లేదా సౌత్ సినిమా) పోలిస్తే బాలీవుడ్ నేరుగా జాతీయ రాజకీయ కేంద్రమైన దిల్లీకి మరింత చేరువగా ఉండటం కూడా కారణమే. ఇక్కడ జరిగే ప్రతి రాజకీయ పరిణామం చిత్ర పరిశ్రమపై వేగంగా ప్రభావం చూపుతుంది. సెన్సార్ బోర్డ్ నిబంధనలు, చిత్రాల విడుదలకు అడ్డంకులు సృష్టించడం వంటి అధికారిక నిబంధనల కారణంగా నిర్మాతలు , నటులు ప్రభుత్వం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. వివాదాలకు దూరంగా ఉంటూ సినిమా వ్యాపారంపై దృష్టి పెట్టడమే సురక్షితమైన మార్గమని భావిస్తున్నారు.
మొత్తం పరిస్థితులను బట్టి చూస్తే బాలీవుడ్ సెలబ్రిటీల మౌనం వారి స్వచ్ఛమైన సమ్మతికి సంకేతం కాదని.. అది ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మనుగడ సాగించడానికి ఎంచుకున్న రక్షణ కవచం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో గళం వినిపించాల్సిన కళాకారులు సైతం ఇలా భయంతో మౌనం వహిం చడం వల్ల సృజనాత్మక స్వేచ్ఛపై ప్రభావం పడుతుందనే విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు నిర్భయంగా గొంతు వినిపించిన బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రాజకీయ జోక్యానికి దూరంగా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ మౌనం తాత్కాలిక భయమా? లేక భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
