Begin typing your search above and press return to search.

మేటి న‌టి బ‌యోపిక్ రైట్స్‌పై తెలివైన నిర్ణ‌యం

ఈ వివాదంపై అల్మైటీ మోషన్ పిక్చర్స్ సహ-వ్యవస్థాపకురాలు ప్రబ్లీన్ సంధు మాట్లాడుతూ.. భారతీయ సినిమా అనేది ఒకే ఒక సృజనాత్మక కుటుంబం.

By:  Sivaji Kontham   |   4 July 2026 9:55 AM IST
మేటి న‌టి బ‌యోపిక్ రైట్స్‌పై తెలివైన నిర్ణ‌యం
X

ఈరోజుల్లో బయోపిక్ లు తీయ‌డం స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత‌క‌థ‌ల‌పై హ‌క్కుల కొనుగోలు టూమ‌చ్ కాస్ట్ లీగా మారింది. ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజ నటి, ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించనున్న‌ బయోపిక్‌కు సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ అల్మైటీ మోషన్ పిక్చర్స్ ఒక కీలకమైన చట్టపరమైన ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. మీనా కుమారి పేరు మీద సినిమాటిక్, ఆడియో-విజువల్ హక్కులు పూర్తి స్థాయిలో తమకే ఉన్నాయని..ఈ పేరును తమ అనుమతి లేకుండా ఫీచర్ ఫిల్మ్స్.. వెబ్ సిరీస్, టెలివిజన్ ప్రొడక్షన్స్ లేదా డాక్యుమెంటరీల కోసం ఎవరు ఉప‌యోగించుకున్నా చట్టపరమైన చర్యలు తప్పవని స్టూడియో గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ఇటీవలే `భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ`, `మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ` వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన అల్మైటీ మోషన్ పిక్చర్స్ తమ లీగల్ పొజిషన్‌ను కాపాడుకోవడానికి ఇప్పటికే జాతీయ మీడియా - ట్రేడ్ మ్యాగజైన్లలో పబ్లిక్ నోటీసులను జారీ చేసినట్లు పేర్కొంది. మీనా కుమారి బయోపిక్ కోసం దాదాపు నాలుగేళ్ల పాటు సుదీర్ఘమైన రీసెర్చ్ తో స్క్రిప్ట్ ను డెవలప్‌ చేశామని.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లే అధికారికంగా లాక్ అయిందని వెల్లడించింది. మ‌రికొన్ని నెలల్లోనే ఈ భారీ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు స్టూడియో స్పష్టం చేసింది.

ఈ వివాదంపై అల్మైటీ మోషన్ పిక్చర్స్ సహ-వ్యవస్థాపకురాలు ప్రబ్లీన్ సంధు మాట్లాడుతూ.. భారతీయ సినిమా అనేది ఒకే ఒక సృజనాత్మక కుటుంబం. భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం, వివాదాలు రాకూడదనే పూర్తి పారదర్శకత కోసం మాత్రమే మేం ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు తమ టీమ్ పడిన కష్టాన్ని, ప్రాజెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి ట్రేడ్‌మార్క్‌ను రక్షించుకోవడం తమ లీగల్ బాధ్యత అని చెప్పారు. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కు సంబంధించిన దర్శకుడు, న‌టీనటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

ఈ పరిణామం సినీ పరిశ్రమలో ఒక కొత్త చర్చకు దారితీసింది. సాధారణంగా ఒక వ్యక్తి పేరుపై లేదా వారి జీవిత చరిత్రపై ఒకే ఒక్క స్టూడియోకు పూర్తి హక్కులు ఉండటం వల్ల ఇండస్ట్రీలో మోనోపలీ (ఏకఛత్రాధిపత్యం) పెరుగుతుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే.. బయోపిక్స్‌ విషయంలో రీసెర్చ్ దొంగతనాలు, ఒకే కథతో ఇద్దరు వేర్వేరు సినిమాలు తీసి నష్టపోవడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో అల్మైటీ మోషన్ పిక్చర్స్ తీసుకున్న ఈ చట్టపరమైన నిర్ణయం తమ పెట్టుబడిని.. సృజనాత్మకతను రక్షించుకోవడానికి సరైనదేనని మెజారిటీ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మేటి న‌టి మీనా కుమారి బయోపిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.