Begin typing your search above and press return to search.

మాతృత్వం (Vs) స్టార్‌డమ్: కెరీర్‌ను రీడిఫైన్ చేస్తున్న నటీమణులు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పెళ్లి లేదా మాతృత్వం అంటే హీరోయిన్ల కెరీర్‌కు ముగింపు అనే ముద్ర ఉండేది.

By:  Sivaji Kontham   |   19 April 2026 6:00 PM IST
మాతృత్వం (Vs) స్టార్‌డమ్: కెరీర్‌ను రీడిఫైన్ చేస్తున్న నటీమణులు
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పెళ్లి లేదా మాతృత్వం అంటే హీరోయిన్ల కెరీర్‌కు ముగింపు అనే ముద్ర ఉండేది. కానీ నేటి తరం నటీమణులు ఆ భావనను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారు. కేవలం మాతృత్వాన్ని ఆస్వాధించడమే కాకుండా.. అగ్ర కథానాయికలుగా తమ స్థానాన్ని పదిలం చేసుకుంటూ ఇటు కుటుంబం.. అటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మార్పు సినీ పరిశ్రమలో ప్ర‌ధానంగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

ప్రస్తుత టాప్ హీరోయిన్లను గమనిస్తే.. దీపికా పదుకొనే, ఆలియా భట్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఆలియా తల్లి అయిన తర్వాత కూడా `రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ` వంటి హిట్స్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాణిస్తోంది. ఇక దీపికా తన ప్రెగ్నెన్సీ సమయంలోనే `కల్కి 2898 AD` వంటి భారీ చిత్రంలో నటించి మెప్పించింది. ఇప్పుడు రెండో ఫ్రెగ్నెన్సీని ప్ర‌క‌టించిన క్ర‌మంలో అల్లు అర్జున్- అట్లీ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌లైవి నయనతార సరోగాసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చినా.. సౌత్ ఇండియాలో `లేడీ సూపర్ స్టార్`గా తన హవాను కొనసాగిస్తూనే ఉంది. కత్రినా కైఫ్, కియారా అద్వానీ వంటి వారు కూడా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. క‌త్రిన‌, కియ‌రా, కాజ‌ల్ లాంటి టాప్ హీరోయిన్స్ ఫ్రెగ్నెన్సీ కార‌ణంగా చాలా ముఖ్య‌మైన ప్రాజెక్టుల‌ను సైతం వ‌దులుకున్నారు.

మరోవైపు సీనియర్ నటీమణులు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో తమ సత్తా చాటుతున్నారు. రాణీ ముఖర్జీ, కాజోల్, మాధురి ధీక్షిత్ వంటి న‌టీమ‌ణులు ఇటీవల మళ్లీ కెమెరా ముందుకు వచ్చి వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. రాణీజీ ఇటీవ‌ల మ‌ర్ధానీ సిరీస్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటే.. కాజోల్ ఉత్త‌రాది ద‌క్షిణాది సినిమాల్లో న‌టిస్తూ భ‌ర్త దేవ‌గ‌న్ తో క‌లిసి సినిమాల నిర్మాణంలోను బిజీగా ఉన్నారు. మాధురి ధీక్షిత్ బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా ప‌ని చేస్తూనే , వెండితెర‌పైనా కొన్ని ముఖ్య‌మైన సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే అందరి కెరీర్ గ్రాఫ్ ఒకేలా ఉండటం లేదు. అనుష్క శర్మ తన ఇద్దరు పిల్లల బాధ్యతలతో నటనకు కొంత దూరంగా ఉంటూ, చాలా అరుదుగా ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. అలాగే కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చినా కెరీర్ మునుపటి వేగంతో పోలిస్తే కొంచెం నెమ్మదించినట్లు కనిపిస్తోంది.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. నటీమణులు తమ ప్రాధాన్యతలను బట్టి కెరీర్‌ను మలుచుకుంటున్నారని అర్థమవుతోంది. కొందరు గ్లామర్ ఫీల్డ్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతుంటే.. మరికొందరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ పరిమితంగా సినిమాలు చేస్తున్నారు. ఏదేమైనా మాతృత్వం అనేది కెరీర్‌కు అడ్డంకి కాదని.. అది వ్యక్తిగత ఎదుగుదలకు... ఎంపిక చేసుకునే పాత్రల్లో పరిణతికి తోడ్పడుతుందని వీరందరూ నిరూపిస్తున్నారు.

స్టార్ ప‌వ‌ర్ త‌గ్గ‌దు.. యూత్ కి ఛాన్సులు:

నేటి తరం నటీమణులు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాతృత్వానికి లేదా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ బ్రేక్ తీసుకోవడం అనేది పరిశ్రమలో సానుకూల మార్పులకు దారితీస్తోంది. టాప్ హీరోయిన్లు బ్రేక్ తీసుకున్న సమయంలో యువ నటీమణులకు కొత్త అవకాశాలు లభించి పరిశ్రమలో పోటీ పెరగడానికి మార్గం సుగమం అవుతుంది. అదే సమయంలో సీనియర్ నటీమణులు తిరిగి వచ్చినప్పుడు వారి ఇమేజ్‌కు తగ్గట్టుగా వైవిధ్యమైన కథలు సిద్ధమవ్వడం వల్ల చిత్ర పరిశ్రమలో కథల పరంగా వైవిధ్యం, నాణ్య‌త‌ పెరుగుతుంది తప్ప స్టార్ పవర్ బలహీనపడదు.