Begin typing your search above and press return to search.

దీపికా ప‌దుకొణేకి పెద్ద పీట వేసిన ఫైర్ బ్రాండ్

ఇండస్ట్రీలో కంగనా రనౌత్ లాంటి మరొక నటీమణి ఎందుకు రాలేకపోయారు అనే ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఎంతో పరిణతితో మాట్లాడారు.

By:  Srikanth Kontham   |   13 Jun 2026 4:00 AM IST
దీపికా ప‌దుకొణేకి పెద్ద పీట వేసిన ఫైర్ బ్రాండ్
X

చిత్ర పరిశ్రమలో కొత్త తరం నటీనటుల రాకతో పాతవారు కనుమరుగవుతుంటారనేది సాధారణంగా వినిపించే మాట. ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయోచ్చ‌ని పరిశ్రమ భావిస్తుంది. అయితే ప్రతిభావంతులైన కొందరు నటీమణులు తమ అసాధారణ నటనతో సృష్టించుకునే ముద్ర చెరగనిదని, వారిని ఎవరూ రీప్లేస్ చేయలేరని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో అమ్మ‌డు చలనచిత్ర రంగానికి చెందిన వివిధ తరాల దిగ్గజ నటీమణుల వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ సమకాలీన స్టార్ దీపికా పదుకోన్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇండస్ట్రీలో కంగనా రనౌత్ లాంటి మరొక నటీమణి ఎందుకు రాలేకపోయారు అనే ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఎంతో పరిణతితో మాట్లాడారు. సాధారణంగా పరిశ్రమలోకి హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు అని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదని కంగనా స్పష్టం చేశారు. గతంలో అద్భుత నటనతో అలరించిన మీనా కుమారి లాంటి మరో నటి మనకు దొరకరని, అలాగే కరిష్మా కపూర్ శైలిని కూడా ఎవరూ అనుకరించలేరని ఉదాహరణగా పేర్కొన్నారు.

ఆయా కాలాల్లో వెండితెరను ఏలిన హేమమాలిని, వహీదా రెహమాన్, లేదా అపురూప సౌందర్యవతి మధుబాల వంటి వారి స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదని కంగనా విశ్లేషించారు. అలాగే ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్ లాంటి నటి మరొకరు రాలేరన్నారు. ఈ సందర్భంగా నటి దీపికా పదుకోన్ గురించి ప్రస్తావించారు. `భవిష్యత్తులో దీపికా పదుకోణే లాంటి మరో నటి కూడా రాబోదు` అంటూ ఎంతో ఉదారంగా ప్రశంసించారు. ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని నటీమణులుగా తామంతా ఆయా కాలాలకు ప్రాతినిధ్యం వహిస్తామని కంగనా వివరించారు.

సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఇప్పటికీ ఎంతో చురుగ్గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారని ప్రేక్షకులు ఆమె నటనను నిరంతరం ఆస్వాదిస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. పాతవారిని పక్కనపెట్టి కొత్తవారిని తీసుకురావాలనే ధోరణి అందరి విషయంలో సాధ్యం కాదన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులు చాలా అరుదుగా జన్మిస్తారని వారు మళ్లీ మ‌ళ్లీ రారని కొనియాడారు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కంగనా రనౌత్ నోటి నుండి తోటి అగ్ర నటి అయిన దీపికా పదుకోణే గురించి ఇలాంటి సానుకూల మాటలు రావడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

గతంలో ఇద్ద‌రి మధ్య పలు విషయాల్లో విభేదాలు ఉన్నా? వాటన్నింటినీ పక్కనబెట్టి ఒక గొప్ప నటిగా దీపికా ప్రాధాన్యతను కంగనా గుర్తించడం విశేషం. కంగనాలోని ఈ కొత్త కోణాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సెన్సిబుల్ కంగూ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తోటి మహిళా కళాకారుల ప్రతిభను అభినందించే మనస్తత్వం ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కంగన కేవలం వివాదాలకే పరిమితం కాకుండా కళ ప‌ట్ల , కళాకారుల పట్ల తనకున్న నిజమైన గౌరవాన్ని ఇదే ఇంటర్వ్యూ ద్వారా నిరూపించుకున్నట్లయింది.