అజయ్ దేవగన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఫ్యాన్స్ కూడా అసహనం!
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆయన చేసే ప్రకటనల ద్వారా ఎప్పుడు విమర్శలపాలవుతూ ఉంటారు.
By: Madhu Reddy | 13 Oct 2025 11:34 AM ISTబాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆయన చేసే ప్రకటనల ద్వారా ఎప్పుడు విమర్శలపాలవుతూ ఉంటారు. అయితే తాజాగా అజయ్ దేవగన్ ఓ విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేసి మరోసారి విమర్శల పాలవుతున్నారు. తాజాగా అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఓవైపు పాన్ మసాలా, గుట్కాయాడ్ లను ప్రమోట్ చేస్తూనే తాజాగా ఇండియాలోకి తన సొంత విస్కీబ్రాండ్ ని ప్రారంభించాడు. కార్టెన్ బ్రదర్స్ తో కలిసి ఆయన లగ్జరీ సింగిల్ మాల్ట్ అయినటువంటి ది గ్లెన్ జర్నీస్ అనే విస్కీని ఇండియాలోకి తీసుకువచ్చారు. ఇది స్కాటిష్ హైలాండ్స్ లో ఉత్పత్తి చేయబడింది. అయితే ఈ మాల్ట్ విస్కీని ఇప్పుడు భారతదేశంలోకి తీసుకొచ్చారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్.
ఇండియాలోని లగ్జరీ సింగిల్ మాల్ట్ విభాగంలో 20 శాతం వరకు తమ బ్రాండ్ పొందాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ మాల్ట్ విస్కీని ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, చండీగఢ్ లలో ఈ ఏడాది నవంబర్ వరకు మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లలో వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారు. అలా కార్టెన్ బ్రదర్స్ తో చేయి కలిపి ది గ్లెన్ జర్నీస్ కి సహ-వ్యవస్థాపకుడిగా మారారు అజయ్ దేవగన్. అయితే అజయ్ దేవగన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలామందికి నచ్చడం లేదు. ఆయన తన మాల్ట్ విస్కీని హై ఎండ్ ఇండియన్ ఉత్పత్తిగా ప్రమోట్ చేస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియా జనాలు వెంటనే స్పందించారు.
అజయ్ దేవగన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు.. అని ఒక నెటిజన్ కామెంట్ పెడితే.. మరో నెటిజన్ అజయ్ దేవగన్ సాబ్ నోటి కాన్సర్ , కాలేయ వైఫల్యం మధ్య వివక్ష చూపడం లేదు అంటూ కామెంట్ పెట్టారు. మరో వ్యక్తి ఇప్పుడు ఒక సుత్తా బ్రాండ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ ఒక్క బ్రాండ్ కూడా ప్రమోట్ చేస్తే దాదాపు అన్ని అవయవాలు అజయ్ దేవగన్ కవర్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో అజయ్ దేవగన్ పై విమర్శలు చేస్తున్నారు..డబ్బు కోసం మనుషుల ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
అజయ్ దేవగన్ లాంటి పెద్ద హీరోని ఎంతోమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అలా లక్షలాదిమందిని ప్రభావితం చేసే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఈయన ఇలాంటి ప్రమోషన్స్ చేయడం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం చాలామందికి నచ్చడం లేదు. అభిమానుల ఒత్తిడి మేరకైనా సరే అజయ్ దేవగన్ తాను చేసే ప్రకటనలపై, బ్రాండ్ ప్రమోషన్స్ పై ఒకసారి పునరాలోచన చేయాలని కొంతమంది హెచ్చరిస్తున్నారు.
