Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలో దేవ‌గ‌న్

అయితే దేవ‌గ‌న్ ప్ర‌ణాళిక వేరుగా ఉంది. ఆయ‌న దేశ‌వ్యాప్తంగా త‌న పేరు మీద‌నే దేవ‌గ‌న్ సినీ -ఎక్స్ స్క్రీన్ల‌ను ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నారు.

By:  Sivaji Kontham   |   14 Dec 2025 10:03 PM IST
హైద‌రాబాద్‌ మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలో దేవ‌గ‌న్
X

ఇటీవ‌ల తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ - 2025 కార్య‌క్రమంలో స‌ల్మాన్ ఖాన్, అజ‌య్ దేవ‌గ‌న్ భారీ పెట్టుబడుల‌తో హైద‌రాబాద్ కు వ‌స్తున్నార‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. స‌ల్మాన్ ఖాన్ హైద‌రాబాద్ లో అత్యంత అధునాత‌న‌ ఫిలిం స్టూడియోని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా, అజ‌య్ దేవ‌గ‌న్ కూడా ఒక ఫిలిం స్టూడియోని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

అయితే దేవ‌గ‌న్ ప్ర‌ణాళిక వేరుగా ఉంది. ఆయ‌న దేశ‌వ్యాప్తంగా త‌న పేరు మీద‌నే దేవ‌గ‌న్ సినీ -ఎక్స్ స్క్రీన్ల‌ను ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా దాదాపు 250 స్క్రీన్ల‌ను ప‌లు ద‌ఫాలుగా సినీ-ఎక్స్ పేరుతో ప్రారంభించాల‌ని ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసారు. అతడికి గుర్ గావ్ లో ఇప్ప‌టికే `దేవ‌గ‌న్ సినీ-ఎక్స్` పేరుతో ఒక‌ థియేటర్ ఉంది. ఇంత‌కుముందు అజ‌య్ దేవ‌గ‌న్- కాజోల్ జంట త‌మ‌ కుమార్తె నైసా దేవ‌గ‌న్, కుమారుడు యుగ్ పేర్లపై `ఎన్-వై సినిమాస్` పేరుతో థియేట‌ర్ ని న‌డిపించారు. కానీ ఇప్పుడు బ్రాండ్ నేమ్ `దేవ‌గ‌న్`గా మార్చారు.

త‌దుప‌రి హైద‌రాబాద్ లో దేవ‌గ‌న్- సినీ ఎక్స్ మ‌ల్టీప్లెక్స్ ని అజ‌య్ దేవ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. హైదరాబాద్‌-కర్మాన్‌ఘాట్‌లోని కొలీజియం మాల్‌లో ఒక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌నున్నారు. ఇది ఏడు స్క్రీన్‌ల లగ్జరీ మల్టీప్లెక్స్. వచ్చే ఏడాది ప్రారంభమ‌వుతుంది. దేవగన్ సినీఎక్స్‌ను భారతదేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, అజయ్ దేవగన్ చివరిగా సన్ ఆఫ్ సర్దార్ 2 , దే దే ప్యార్ దే 2 చిత్రాలలో కనిపించారు. దేదే ప్యార్ దే బాక్సాఫీస్ వ‌ద్ద సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని ఇచ్చింది. త‌దుప‌రి దృశ్యం 3, ధమాల్ 4, రేంజర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఇవ‌న్నీ 2026లో అజ‌య్ కెరీర్ కి అద‌న‌పు బూస్ట్ నిచ్చే సినిమాలుగా విశ్లేషిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా..

ఏషియ‌న్ సినిమాస్ భాగస్వామ్యంతో హైద‌రాబాద్ లో మ‌హేష్, అల్లు అర్జున్, ర‌వితేజ సొంత మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌ను ప్రారంభించారు. మ‌హేష్ - ఏఎంబి మాల్, అల్లు అర్జున్- ఏఏఏ సినిమాస్, ర‌వితేజ‌- ఏఆర్ టి సినిమాస్ ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. త‌దుప‌రి మ‌హేష్- వెంక‌టేష్ కాంబినేష‌న్ లో ఏఎంబి క్లాసిక్ ప్రారంభ‌మ‌వుతుంది. అలాగే అల్లు కుటుంబం ఇప్ప‌టికే హైద‌రాబాద్ ఔట‌ర్ లో భారీ ఫిలిం స్టూడియోని నిర్మించ‌డ‌మే గాక‌, మ‌రో మ‌ల్టీప్లెక్స్ ని కూడా ప్రారంభిస్తుంద‌ని చెబుతున్నారు. ఇప్పుడు దేవ‌గ‌న్ కూడా తెలుగు స్టార్ల‌తో పోటీప‌డుతూ మ‌ల్టీప్లెక్స్ రంగంలో ఏ మేర‌కు దూసుకెళ‌తారో వేచి చూడాలి.