Begin typing your search above and press return to search.

కామెడీ సీక్వెల్స్‌కి 2025 బిగ్ షాక్‌!

ఈ ఏడాది క్రేజీ కామెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌కి సీక్వెల్స్‌గా రూపొందిన ఈ సినిమాలు ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.

By:  Tupaki Entertainment Desk   |   18 Dec 2025 11:29 AM IST
కామెడీ సీక్వెల్స్‌కి 2025 బిగ్ షాక్‌!
X

గ‌త ఏడాదితో పోలిస్తే 2025 బాలీవుడ్‌కు బాగానే క‌లిసొచ్చింద‌ని చెప్పొచ్చు. చావా, సైయారా, ఇప్పుడు ధురంధ‌ర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా బాలీవుడ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మ‌రింత జోష్‌ని నింపాయి. చావా రూ.800 కోట్లు, సైయారా దాదాపు రూ.600 కోట్లు, ధురంధ‌ర్ రూ.640 కోట్లు రాబ‌ట్టి బాలీవుడ‌ఖు స‌రికొత్త ఉత్సాహాన్ని అందించాయి. అయితే సీక్వెల్స్ ప‌రిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఈ ఏడాది క్రేజీ కామెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌కి సీక్వెల్స్‌గా రూపొందిన ఈ సినిమాలు ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కానీ ఫ‌స్ట్ పార్ట్‌కున్న క్రేజ్‌ని ఏ మాత్రం కంటిన్యూ చేయ‌లేక, ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌ బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేశాయి. అజ‌య్ దేవ్‌గ‌న్, మాధ‌వ‌న్‌, ర‌కుల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `దేదే ప్యార్ దే 2` ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. `దేదే ప్యార్‌దే`కు సీక్వెల్ ఇది.

ఫ‌స్ట్ పార్ట్ అంత ఇంపాక్ట్‌ని `దేదే ప్యార్ దే 2` క‌లిగించ‌లేక‌పోయింది. కానీ మిగ‌తా వాటితో పోలిస్తే కొంత ఫ‌ర‌వాలేదు అనిపించింది. అజ‌య్‌దేవ్‌గ‌న్ క్రేజ్ మాత్ర‌మే కొంత వ‌ర‌కు ఈ సినిమాకు ప్ల‌స్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద రూ.70 కోట్లు రాబ‌ట్టేలా చేసింది. ఇదే త‌ర‌హాలో వ‌చ్చిన సీక్వెల్స్ ``స‌న్ ఆఫ్ స‌ర్దార్ 2`, మ‌స్తీ 4, కిస్ కిస్ కో ప్యార్ క‌రూం 2 విడుద‌ల‌య్యాయి. ఫ‌స్ట్ పార్ట్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఈ సీక్వెల్స్ విష‌యంలో వ‌ర్క‌వుట్ కాలేదు.

తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `మ‌ర్యాద రామ‌న్న‌` రీమేక్‌గా రూపొంది అక్క‌డ కూడా హిట్ అనిపించుకున్న `స‌న్ ఆఫ్ స‌ర్దార్‌`కు అజ‌య్ సీక్వెల్ చేశాడు. అదే `స‌న్ ఆఫ్ స‌ర్దార్ 2`.. మొద‌టిది ఒరిజిన్ స్టోరీతో చేసిన రీమేక్‌.. రెండ‌వ‌ది డ్ర‌మెటిక్‌గా అల్లిన క‌థ కావ‌డంతో ఏ విష‌యంలో `స‌న్ ఆఫ్ స‌ర్దార్ 2` ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ అయింది. అజ‌య్ క్రేజ్ తోడైనా కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం రూ.43 కోట్ల‌కే ప‌రిమితం అయి షాక్ ఇవ్వ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌ని విష్మ‌య‌ప‌రిచింది.

దీని ప‌రిస్థితే ఇలా ఉంటే మ‌స్తీ 4, కిస్ కిస్ కో ప్యార్ క‌రూం సీక్వెల్స్ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఇవి కేవ‌లం రూ.10, రూ.12 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టి సీక్వెల్స్‌ల‌లో అత్యంత డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఫ‌స్ట్ పార్ట్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది క‌దా అని దాన్నే ప‌ట్టుకుని పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌ల‌తో సీక్వెల్స్ చేస్తామంటే ఆడియ‌న్స్ రిజెక్ట్ చేస్తార‌ని 2025 నిరూపించింది. మ‌రీ ముఖ్యంగా కామెడీ సీక్వెల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌పై ఫ్రాంచైజీల‌ని న‌మ్ముకుని కాకుండా కంటెంట్‌ని న‌మ్ముకుని సినిమాలు చేయాల‌ని ఈ ఏడాది బాలీవుడ్ మేక‌ర్స్ పెద్ద గుణ‌పాఠం నేర్పారు.