కోన వెంకట్ ఉన్నంతవరకు రూపాయి కూడా పోదు: డైరెక్టర్ బాబీ
కోన వెంకట్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ బాబీ సరదా కామెంట్స్ చేశారు.
By: M Prashanth | 6 Sept 2026 8:44 AM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస సక్సెస్ ట్రాక్‌లో ఉన్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియడ్ కామెడీ ఎంటర్‌టైనర్ కామ్రేడ్ కళ్యాణ్. డెబ్యూ డైరెక్టర్ జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ బాబీ కొల్లి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. వేదికపై బాబీ మాట్లాడిన ఫన్నీ ముచ్చట్లు, పంచుకున్న సీక్రెట్స్ అందరిని నవ్వించాయి.
కోన వెంకట్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ బాబీ సరదా కామెంట్స్ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని మధ్యాహ్నం మూడున్నర వరకు కలిసే ఉన్నామని, సడన్‌గా 4:45కి వచ్చేయ్ అని గట్టిగా అరిచి కోన వెంకట్ వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఎక్కడికో తెలియక ఆయన డ్రైవర్‌ను ఎంక్వైరీ చేసి మరీ ఫంక్షన్‌కు చేరుకున్నానని నవ్వుతూ చెప్పారు.
తనకు సినిమా తీయడానికి రెండేళ్లు పడుతుంటే, కోన వెంకట్ మాత్రం ఏడాదిలోనే మూడు నాలుగు ప్రాజెక్టులు ప్రొడ్యూస్ చేసి ఫంక్షన్లకు పిలుస్తున్నారని, ఆయన స్పీడ్ చూస్తుంటే తనకు కూడా కాస్త వేగం పెంచాలనిపిస్తుందని అన్నారు. ఈ చిత్ర కథ తాను ముందే విన్నానని, డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు జానకిరామ్ గురించి మాట్లాడుతూ తన ఇంట్లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను బయటపెట్టారు. తన మొదటి సినిమా నుంచి జానకిరామ్ తనతోనే ట్రావెల్ అయ్యాడని చెప్పారు.
తన కో డైరెక్టర్ రాధ, అసిస్టెంట్ జానకిల పేర్లు అమ్మాయిల పేర్లలా ఉండటంతో, రాత్రిపూట వాళ్లు ఫోన్లు చేస్తుంటే తన భార్య ఎంతగానో టెన్షన్ పడేదని సరదాగా గుర్తు చేసుకున్నారు. సినిమా రిలీజ్ టైంలో అర్ధరాత్రిళ్లు ఫోన్లు చేసి ఆర్ఆర్ రాలేదు, అది అవ్వలేదు అని వాళ్లు గోల చేస్తుంటే తన భార్యకు ఏం అడగాలో పాలుపోయేది కాదని, ఇవాళ స్టేజ్ మీద ఉన్న జానకిని చూపిస్తూ జానకి అంటే అమ్మాయి కాదు ఇతనే అని క్లారిటీ ఇస్తున్నాను అని నవ్వించారు.
డైరెక్టర్‌గా ప్రమోట్ అయిన తర్వాత కూడా తన రీసెంట్ మూవీ డాకు మహారాజ్ కోసం పిలవగానే వచ్చి మూడు నాలుగు నెలలు ఉండి ఫస్ట్ కాపీ వచ్చేదాకా హెల్ప్ చేశాడని జానకిని ప్రశంసించారు. మొదటి సినిమా చేస్తున్న దర్శకులకు స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే చేతులు వణుకుతాయని, కానీ జానకి మాత్రం ప్రొడ్యూసర్ల మీద పంచులేస్తూ ఫుల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడని మెచ్చుకున్నారు.
ఫస్ట్ కాపీ చూసుకున్న ధైర్యంతోనే ఇంత నమ్మకంగా ఉన్నాడని, ఈ సినిమాతో తమ్ముడు పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రొడ్యూసర్ కిట్టు కర్నాటికి భరోసా ఇస్తూ, ప్రాజెక్ట్ వెనుక కోన వెంకట్ ఉన్నంతవరకు రూపాయి కూడా పోదని, అంతా ఇన్కమింగ్ తప్ప అవుట్‌గోయింగ్ ఉండదని, డబ్బులు కచ్చితంగా వెనక్కి వస్తాయని భరోసా ఇచ్చారు.
అలాగే హీరో శ్రీ విష్ణును మాస్ మహారాజా రవితేజతో పోల్చారు. ఇండస్ట్రీలో రవితేజ తర్వాత ఎవరైనా కొత్త డైరెక్టర్ వచ్చి తలుపు తడితే ప్రేమతో లోపలికి ఆహ్వానించే గొప్ప మనసు శ్రీ విష్ణుకు ఉందని కొనియాడారు. మా శివ నిర్వాణ ద్వారా రవితేజకు ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్ ఎలా పడిందో, శ్రీ విష్ణుకు కూడా ఈ సినిమాతో అంతటి హిట్ రావాలని, అప్పుడే మాలాంటి ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
శ్రీ విష్ణు స్క్రీన్ మీద వేసే పంచుల కంటే రియల్ లైఫ్‌లో ఈవెంట్లలో పక్కన నిలబడి సైలెంట్‌గా వేసే కౌంటర్లు అదిరిపోతాయన్నారు. చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ వెనక నుంచి గిల్లితే టీచర్స్ ముందు ఎలా సైలెంట్‌గా ఉంటామో, విష్ణు కూడా ఎవరూ చూడకుండా సైలెంట్‌గా పంచ్ విసిరి ఏమీ తెలియనట్టు మీసం తిప్పుకుంటాడని, అది విని పక్కనున్న వాళ్లు నవ్వు ఆపుకోలేరని చెప్పారు. జానకిని నమ్మి అవకాశం ఇచ్చినందుకు శ్రీ విష్ణుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ బాబీ తన స్పీచ్‌ను ముగించారు.
