బాబీ శిష్యుడు గురువు అంత ఎదుగుతాడా?
తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుల వద్ద శిక్షణ పొంది, ఆపై స్వతంత్ర దర్శకులుగా మారి సంచలనాలు సృష్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది.
By: Sivaji Kontham | 6 Sept 2026 9:51 AM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుల వద్ద శిక్షణ పొంది, ఆపై స్వతంత్ర దర్శకులుగా మారి సంచలనాలు సృష్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ వంటి ప్రముఖుల శిష్యరికం నుంచి వచ్చిన ఎందరో అసిస్టెంట్ డైరెక్టర్లు నేడు పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా `ఉప్పెన`తో జాతీయ స్థాయి గుర్తింపు సాధించగా, త్రివిక్రమ్, కొరటాలల కాంపౌండ్ నుంచి వచ్చిన వెంకీ కుడుముల వరుస హిట్‌లతో తన ముద్ర వేశారు. ఇప్పుడు అదే బాటలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కే.ఎస్. రవీంద్ర (బాబీ) వద్ద పనిచేసిన శిష్యుడు జానకి రామ్ `కామ్రేడ్ కళ్యాణ్` చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండటంతో గురువు స్థాయిని అందుకుంటాడా అనే ఆసక్తి నెలకొంది.
ఇటీవల జరిగిన `కామ్రేడ్ కళ్యాణ్` టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ పాల్గొని ప్రసంగించారు. పరిశ్రమను పక్కాగా చదువుకుని వచ్చిన బాబీ.. తనకు రచయిత-నిర్మాత కోన వెంకట్ గారే గురువు- గాడ్‌ఫాదర్ అని కొనియాడారు. చలనచిత్ర పరిశ్రమలో ఏ విధంగా ప్రవర్తించాలో.. ఎలాంటి నడవడిక ఉండాలో తాను కోన వెంకట్ నుంచే నేర్చుకున్నానని తెలిపారు. సంవత్సరానికి 3-4 సినిమాలు నిర్మిస్తూ ఎంతో స్పీడ్‌గా పనిచేసే తన గురువును చూసి తాను కూడా వేగం పెంచాలనిపిస్తుంటుందని వ్యాఖ్యానించారు. ఈ వేదికపై విజయేంద్ర ప్రసాద్, ఆర్. నారాయణమూర్తి వంటి సీనియర్లను కలవడం తన సినీ ప్రయాణపు తొలి రోజులను గుర్తుచేసిందని చెప్పారు.
తన వద్ద మొదటి సినిమా నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ అసిస్టెంట్ జానకి రామ్ దర్శకుడిగా ప్రమోట్ కావడంపై బాబీ సంతోషం వ్యక్తం చేశారు. జానకి ఇప్పటికే దర్శకుడిగా మారినా ఇటీవల వచ్చిన `డాకు మహారాజ్` చిత్రం కోసం చివరి మూడు-నాలుగు నెలలు తనతోనే ఉండి ఫస్ట్ కాపీ వరకు సహాయపడ్డాడని ఆయన క్రమశిక్షణను గుర్తుచేసుకున్నారు. `కామ్రేడ్ కళ్యాణ్` కథ తాను ఇప్పటికే విన్నానని, జానకిలోని ఐడియాలు, స్టేజ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతడు మంచి కంటెంట్‌తో సినిమా తీశాడని నమ్మకం కలుగుతోందని అన్నారు. జానకికి ఇది సరైన లాంచ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కథానాయకుడు శ్రీవిష్ణుపై బాబీ ప్రశంసల వర్షం కురిపించారు. మాస్ మహారాజ రవితేజ గారి తర్వాత పరిశ్రమకు వచ్చే కొత్త దర్శకులకు.. అప్ కమ్ టాలెంట్‌కు తలుపులు తీసి అవకాశాలు ఇస్తున్నది శ్రీవిష్ణునే అని కొనియాడారు. స్క్రీన్‌పైనా, బయట వేదికలపైనా శ్రీవిష్ణు వేసే సైలెంట్ పంచ్‌లు ఎంతో అలరిస్తాయని వ్యాఖ్యానించారు. తన శిష్యుడు జానకి శ్రీరామ్‌ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీవిష్ణుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
చిత్ర నిర్మాణం- వ్యాపార అంశాల గురించి మాట్లాడుతూ.. కోన వెంకట్ వెనకుండి నడిపిస్తున్నప్పుడు ప్రాజెక్ట్‌లో ఆర్థికపరమైన నష్టాలు వచ్చే అవకాశమే ఉండదని.. ప్రతి రూపాయి వసూలు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారని బాబీ సరదాగా చెప్పారు. అందుకే ఈ సినిమాతో నిర్మాతలకు ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయని అన్నారు. గురువు బాబీ ఆశీస్సులు, శ్రీవిష్ణు మద్దతుతో బరిలోకి దిగుతున్న జానకి శ్రీరామ్ `కామ్రేడ్ కళ్యాణ్` చిత్రంతో పెద్ద బ్లాక్‌బస్టర్ సాధించి తన గురువు బాబీ లాగే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఎదుగుతాడని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.
