Begin typing your search above and press return to search.

ప‌వ‌న్-విజ‌య్-బాల‌య్య పాలిటిక్స్ గురించి ఈ విల‌న్ ఏమ‌న్నారంటే?

`యానిమల్` చిత్రంతో సెన్సేషనల్ విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలపై గట్టిగా దృష్టి పెట్టారు.

By:  Sivaji Kontham   |   7 Jun 2026 5:00 AM IST
ప‌వ‌న్-విజ‌య్-బాల‌య్య పాలిటిక్స్ గురించి ఈ విల‌న్ ఏమ‌న్నారంటే?
X

`యానిమల్` చిత్రంతో సెన్సేషనల్ విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలపై గట్టిగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలి కాలంలో దక్షిణాది అగ్ర కథానాయకులైన పవన్ కల్యాణ్, దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో వైరల్ అవుతున్న ఒక ఇంటర్వ్యూ క్లిప్‌లో.. తనతోటి సహ నటులు వరుసగా రాజకీయాల్లోకి రావడం..ప్రజా సేవలో నిమగ్నమవ్వడంపై బాబీ డియోల్ చేసిన ఆసక్తికర విశ్లేషణ ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో `హరిహర వీరమల్లు`, దళపతి విజయ్‌తో జ‌న‌నాయ‌గన్‌, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చిత్రాల్లో బాబీ డియోల్ విలన్ పాత్రలు పోషించారు. షూటింగ్ సెట్స్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన షేర్ చేస్తూ... వారు కేవలం వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ ఎంతటి పట్టుదల, ప్రజాదరణ ఉన్న నాయకులో కొనియాడారు. స్టార్‌డమ్ పీక్స్‌లో ఉన్నప్పటికీ వారు ఎంతో నిరాడంబరంగా ఉంటారని.. సెట్స్‌లో వారి ప్రవర్తన - క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బాబీ డియోల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సినిమాల్లో అగ్ర న‌టులుగా ఉంటూనే ఈ ముగ్గురూ సమాజంపై బాధ్యతతో రాజకీయ రంగ ప్రవేశం చేయడంపై బాబీ డియోల్ ప్రత్యేకంగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం... బాలకృష్ణ ఎమ్మెల్యేగా.. హిందూపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా కొనసాగుతుండటం.. అలాగే తమిళనాడులో దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి పరిణామాలను ఆయన ప్రస్తావించారు. తన తోటి నటులు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి దేశ రాజకీయాల్లో కూడా ఇంతటి ప్రభావం చూపడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి బాలీవుడ్ హీరో అయిన బాబీ డియోల్ సౌత్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ ఇక్కడి స్టార్ల పొలిటికల్ ఎంట్రీలపై.. వారి వ్యక్తిత్వాలపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. దక్షిణాది హీరోలకు ప్రజల్లో ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ..వారికున్న లాయల్ ఫ్యాన్ బేస్ చూసి తాను ఆశ్చర్యపోయానని గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఈ ముగ్గురు అగ్ర నాయకులతో కలిసి నటించినప్ప‌టి విశేషాల‌ను బాబి రీల్స్ లాగా రివైండ్ చేసుకుని మరీ ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు.

బాబి నెక్ట్స్ ఏంటి?

బాబి డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో అనురాగ్ కశ్యప్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించిన `బందర్` చిత్రం జూన్ 4న థియేటర్లలోకి వచ్చినా ఇది బాక్సాఫీస్ వద్ద నెమ్మ‌దిగా మొద‌లైంది. ఈ చిత్రం ఇండియాలో మొదటి రోజున కేవలం 50 లక్షల నెట్ వసూళ్లను మాత్రమే సాధించిందని సాక్‌నిల్క్ తెలిపింది. దేశవ్యాప్తంగా కేవలం 300 కి పైగా పరిమిత స్క్రీన్లలోనే విడుదలైన ఈ సినిమా కేవలం 13 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో బాబీ డియోల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ఈ ఓపెనింగ్స్ కొంచెం నిరాశపరిచేవే అని చెప్పాలి. మరోవైపు దీనికి గట్టి పోటీగా నిలిచిన వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేల ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ `హై జవానీ తో ఇష్క్ హోనా హై` (డేవిడ్ ధావన్ దర్శకత్వం) దాదాపు 2,500 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదలై మొదటి రోజు 7.50 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి కూడా మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి.