గత 30 ఏళ్లుగా నరకం చూస్తున్నా -బాబీ డియోల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. ఇటు టాలీవుడ్ లో కూడా విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు.
By: Madhu Reddy | 5 Oct 2025 1:44 PM ISTప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. ఇటు టాలీవుడ్ లో కూడా విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు. అలాంటి ఈయన గత 30 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అన్నయ్య వల్లే ఇదంతా..
ఒక సినిమాలో సన్నివేశం అద్భుతంగా రావాలి అంటే నటీనటులు ప్రాణాలు కూడా పెట్టాల్సిన సందర్భాలు వస్తాయని.. అప్పుడే ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేసిన వాళ్లమవుతామంటూ ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వారి కష్టం ఎలా ఉంటుందో అప్పుడప్పుడు మాటల్లో కూడా చెప్పలేనిది. గాయాలను కూడా లెక్కచేయకుండా చిత్రీకరణలో పాల్గొంటూ ఉంటారు. అలా ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి బాబీ డియోల్ తాజాగా గుర్తు చేసుకున్నారు. తన అన్న సన్నీ డియోల్ లేకపోతే తన విరిగిన కాలు తనకు వచ్చేది కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు.
తొలి సినిమాతోనే కెరియర్ ముగిసిపోయిందనుకున్నా..
తన కెరియర్ తొలినాళ్లల్లో జరిగిన సంఘటనను బాబీ డియోల్ గుర్తు చేసుకుంటూ.. "నా తొలి సినిమా బర్సాత్ షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నా కెరియర్ మొదలు కాకముందే ముగిసిపోయిందని భావించాను. ఆ సమయంలో మా అన్నయ్య లేకపోతే ఈరోజు ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు. విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండులో జరుగుతోంది. అందులో భాగంగానే గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు మరో గుర్రం ఎదురుగా రావడంతో రెండు ఢీకొన్నాయి. దాంతో బలంగా నేను కింద పడిపోయాను. నా కాలు విరిగింది. నిలబడలేకపోయాను. అదృష్టం కొద్దీ ఆరోజు మా అన్నయ్య నాతోనే ఉన్నారు.
గత 30 ఏళ్లుగా నరకం చూస్తున్నా..
నన్ను తన భుజాలపై మోస్తూ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.. అయితే అక్కడి వైద్యులు మాత్రం నాకు కాలు రాదు అని చెప్పడంతో ఇక అంతా అయిపోయింది అని దిగ్భ్రాంతి చెందుతూ ఉండగా.. మా అన్నయ్య సన్నీ నన్ను రాత్రికి రాత్రి లండన్ లోని ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించారు. అలా ఈ ఘటన జరిగి 30 సంవత్సరాల అవుతోంది. శస్త్ర చికిత్స సమయంలో నా కాలులో వేసిన రాడ్ లు ఇంకా అలాగే ఉండిపోయాయి. అసౌకర్యం కారణంగా గత 30 సంవత్సరాలుగా ఆ బాధ నన్ను ఇప్పటికీ ఇబ్బంది పెడుతోంది. అయితే అసౌకర్యానికి అలవాటు పడిన నేను అందరిలాగే నడవగలను, పరిగెత్తగలను కూడా..అలా ఈ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. ముఖ్యంగా మా అన్నయ్యపై ప్రేమను రెట్టింపు చేసింది"అంటూ చెప్పుకొచ్చారు బాబీ డియోల్..
బాబీ డియోల్ సినిమాలు..
బాబీ డియోల్ సినిమాల విషయానికి వస్తే.. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో బిజీగా మారిన ఈయన ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటించారు. అలాగే వార్ 2 చిత్రంలో అతిధి పాత్ర పోషించిన ఈయన.. ప్రస్తుతం విజయ్ చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
