Begin typing your search above and press return to search.

బాబీ యూటర్న్.. హనీ రోజ్‌కు సారీ!

తానెప్పుడూ ప్రతి ఒక్కరినీ గౌరవంతో, మర్యాదతో చూడాలనే ఆలోచనతోనే వ్యవహరిస్తానని బాబీ చెమ్మనూర్ పేర్కొన్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 Jun 2026 4:32 PM IST
బాబీ యూటర్న్.. హనీ రోజ్‌కు సారీ!
X

కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ తాజాగా నటి హనీ రోజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ కీలక ప్రకటన చేశారు. తన కామెంట్స్ వల్ల ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా బాధపడాల్సి వచ్చిందని అంగీకరిస్తూ, ఆ వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఫేస్‌బుక్ అకౌంట్ లో ఒక సుదీర్ఘ పోస్టును షేర్ చేసిన చెమ్మనూర్, వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

తానెప్పుడూ ప్రతి ఒక్కరినీ గౌరవంతో, మర్యాదతో చూడాలనే ఆలోచనతోనే వ్యవహరిస్తానని బాబీ చెమ్మనూర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సరదా, హాస్యభరితమైన పోస్టులు చేస్తుంటానని, అయితే ఎవరినైనా కించపరచడం లేదా వారి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరించారు. అయినప్పటికీ, తన కామెంట్స్ హనీ రోజ్‌ను తీవ్రంగా బాధించిన‌ట్టు తాను గ్రహించానని తెలిపారు.

త‌న కామెంట్స్ హనీ రోజ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా గణనీయమైన మానసిక వేదన కలిగించాయని త‌న‌కు పూర్తిగా అర్థమైంద‌ని, త‌న కామెంట్స్ వ‌ల్ల వల్ల జరిగిన నష్టానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాన‌ని, త‌న‌ మాటలకు, వాటి ప్రభావానికి పూర్తి బాధ్యత వహిస్తున్నాన‌ని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ క్షమాపణను సానుకూలంగా స్వీకరించి తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసును హనీ రోజ్ ఉపసంహరించుకోవాలని కూడా చెమ్మనూర్ విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం న్యాయపరమైన పోరాటంగా కొనసాగకుండా పరస్పర అవగాహనతో ముగియాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలను వ‌ద‌లేసి, ఫ్యూచ‌ర్ లో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

కాగా, బాబీ చెమ్మనూర్ చేసిన కొన్ని కామెంట్స్ తన గౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తూ హనీ రోజ్ ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేరళలో విస్తృత చర్చకు దారితీసింది. సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు కూడా ఈ అంశంపై స్పందిస్తూ మహిళల పట్ల గౌరవప్రదమైన భాషను ఉపయోగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెమ్మనూర్ బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఈ వివాదంలో కీలక పరిణామంగా మారింది. అయితే ఈ క్షమాపణను హనీ రోజ్ ఎలా స్వీకరిస్తారు? ఆమె నిజంగానే కేసును ఉపసంహరించుకుంటారా? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలపై కేరళ సినీ, వ్యాపార వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.