Begin typing your search above and press return to search.

హిట్ ఇచ్చిన న‌యా మేక‌ర్స్ వెయిటింగ్!

ఒక్కో ప్రాజెక్టు కోసం రెండు మూడు ఏళ్లు వెయిట్ చేయాల్సి రావడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

By:  Srikanth Kontham   |   27 April 2026 7:00 PM IST
హిట్ ఇచ్చిన న‌యా మేక‌ర్స్ వెయిటింగ్!
X

తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకులకు అవకాశాలు క్యూ కట్టాలి. అడ్వాన్సుల మీద అడ్వాన్సులు అందుకుంటూ కొత్త సినిమాలతో జోరు చూపించాలి. కానీ కొంత మంది యువ‌ దర్శకులు మాత్రం రెండో సినిమా విడుదల చేయడానికే ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసే సత్తా ఉన్నా? ఒక్కో ప్రాజెక్టు కోసం రెండు మూడు ఏళ్లు వెయిట్ చేయాల్సి రావడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు బుచ్చిబాబు `ఉప్పెన` వంటి సంచ‌ల‌న‌ హిట్‌తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించాడు. కానీ రెండో సినిమా `పెద్ది` రిలీజ్ కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ` తెర‌కెక్కించిన `పెద్ది` మార్చిలో రిలీజ్ అవ్వాలి. కానీ ఇంత వ‌ర‌కూ రిలీజ్ అవ్వ‌లేదు. షూటింగ్ జాప్యం స‌హా ఐటం పాట స‌హా పెండింగ్ ప‌డ‌టం మ‌రికొన్ని టెక్నిక‌ల్ రీజ‌న్స్ తో వాయిదా ప‌డుతోంది. చివ‌రిగా జూన్ 25 న రిలీజ్ తేదీగా ఫిక్స్ చేసారు. అలాగే `బింబిసార` చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అందించిన వశిష్ట పరిస్థితి కూడా బుచ్చిబాబు ను మించి క‌నిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఇప్ప‌టికే `విశ్వంభ‌ర` షూటింగ్ పూర్తి చేసాడు వ‌శిష్ట‌.

కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యంగా కార‌ణంగా సినిమా ఇంత‌వర‌కూ రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేకుండా పోతుంది. ఆ మ‌ధ్య రిలీజ్ విష‌యంలో హ‌డావుడి జ‌రిగినా ప్ర‌స్తుతం ఆ హ‌డావుడి కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో వశిష్ట దాదాపు మూడేళ్ల పాటు ఒకే ప్రాజెక్టుపై కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

`దసరా` వంటి రా అండ్ రస్టిక్ హిట్‌తో సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల కూడా రెండో సినిమా విషయంలో ఎక్కడా తొందర పడటం లేదు. నాని హీరోగా తెర‌కెక్కిస్తోన్న `ది పారడైస్`మార్చిలో రిలీజ్ తేదీ ప్ర‌క‌టించారు. కానీ రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డేస‌రికి షూటింగ్ పూర్తి కాలేద‌న్న విష‌యం వెలుగులోకి వ్చింది. మేకింగ్ లో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటోన్న సమయం వల్ల షూటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ప్రాజెక్ట్ విష‌యంలో శ్రీకాంత్ ఏమాత్రం రాజీ ప‌డ‌టం లేదు. ప‌క్కాగా తాను అకున్న విధంగా వ‌చ్చిన‌ప్పుడే రిలీజ్ చేయాల‌నే ధీమాతో ఉన్నాడు. భారీ లక్ష్యాలు ,పాన్ ఇండియా అంచనాల వల్ల యువ దర్శకులు ఒక్కో అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తున్నారు.

ఇది మేకింగ్ టైమ్ పెరగడానికి కారణమవుతోంది. తొలి సినిమాతో భారీ అంచనాలు పెంచేసిన దర్శకులు రెండవ‌ సినిమాతో దాన్ని మించి నిరూపించుకోవాలనే ఒత్తిడిలో ఉంటారు. అందుకే చిన్న హీరోలతో త్వరగా సినిమాలు ముగించడం కంటే? స్టార్ హీరోల డేట్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటానికే మొగ్గు చూపుతున్నారు. ప్రతిభ గ‌ల దర్శకులకు అవకాశాలకు కొదవ లేదు. కానీ రిలీజ్ కూడా స‌రైన స‌మ‌యంలోనే జ‌ర‌గాలి. లేదంట ఆ సినిమా ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న‌ది అంతే వాస్త‌వం.