కేసీఆర్.. ప్రియదర్శి తర్వాత ఇదేం టైమింగ్ సత్తి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తు చేసేలా టాలీవుడ్ నటుడు ప్రియదర్శి చేసిన శంకరన్న రోల్ ది ప్యారడైజ్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 27 Sept 2026 9:31 AM ISTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తు చేసేలా టాలీవుడ్ నటుడు ప్రియదర్శి చేసిన శంకరన్న రోల్ ది ప్యారడైజ్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. థియేటర్లలో ఆ రోల్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇప్పుడు కమెడియన్ కమ్ యాక్టర్ బిత్తిరి సత్తి కూడా కేసీఆర్ ను ఇమిటేట్ చేసిన వీడియోతో సోషల్ మీడియాలోకి రావడంతో హాట్ టాపిక్ గా మారింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ లో ప్రియదర్శి ఎమ్మెల్యే శంకరన్నగా కనిపించారు. 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగే కథలో సవారీ తెగకు అండగా నిలిచే పొలిటికల్ లీడర్ రోల్ ఇది. తెలంగాణ యాస, మాట తీరు, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తో ప్రియదర్శి ఆ రోల్ ను స్పెషల్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా శంకరన్న పాత్రలో కనిపించే కొన్ని ఎక్స్ప్రెషన్స్, మాట్లాడే విధానం కేసీఆర్‌ను గుర్తు చేస్తున్నాయని ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దీంతో సినిమాలో ప్రియదర్శి కనిపించిన ప్రతిసారి కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఆ రోల్ ను అంత ఈజీగా చేయలేదని ప్రియదర్శి స్వయంగా మీడియా ములాఖత్ లో చెప్పారు. కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ లీడర్ ఎక్స్ప్రెషన్స్ తో పాత్ర చేయాలని శ్రీకాంత్ ఓదెల చెప్పినప్పుడు మొదట తనకు భయం వేసిందని తెలిపారు. అదే సమయంలో ఆ భయమే తనకు ఆ రోల్ ను మరింత ఛాలెంజింగ్ గా తీసుకోవాలనే జోష్ ను ఇచ్చిందని చెప్పారు.
శంకరన్న లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఆ రోల్ వేసుకునే బట్టలు, చెప్పులు, వాచ్ నుంచి మేకప్ వరకు ప్రతిదానిపై స్పెషల్ గా వర్క్ చేసినట్లు ప్రియదర్శి వెల్లడించారు. మేకప్, ప్రోస్తటిక్ టీమ్ తో కలిసి రోల్ ను సిద్ధం చేయడానికి చాలా రీసెర్చ్ చేశామని చెప్పారు. ఒక్క రోజులో ఆ లుక్ తయారు కాలేదని.. దాని వెనుక చాలా రోజుల హార్డ్ వర్క్ ఉందని చెప్పుకొచ్చారు.
ఇక ప్రియదర్శి శంకరన్నగా అదరగొట్టాడంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్న సమయంలోనే బిత్తిరి సత్తి వీడియో ఫుల్ చక్కర్లు కొడుతోంది. కేసీఆర్ ను ఇమిటేట్ చేస్తూ బిత్తిరి సత్తి చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గణేష్ నవరాత్రుల నిమజ్జనాల గురించి మాట్లాడుతున్న ఆ వీడియోలో ఆయన తనదైన శైలిలో ఇమిటేట్ చేశారు.
దీంతో ఒకవైపు సినిమాలో ప్రియదర్శి శంకరన్నగా కేసీఆర్ ను గుర్తు చేస్తుంటే.. మరోవైపు బిత్తిరి సత్తి కూడా తన ఇమిటేషన్ తో నవ్వులు పూయిస్తున్నారు. దీంతో శంకరన్న రోల్ కు బిత్తిరి సత్తి వీడియో యాడ్ చేస్తూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రియదర్శికి తాను కాంపిటీషన్ గా ఉన్నానని చెబుతున్నట్లు ఆ వీడియో ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి మీరు ఆ వీడియో చూశారా? మీకెలా అనిపించింది?
