Begin typing your search above and press return to search.

రేఖతో ముద్దు వివాదం: యానిమల్ సీన్లపై బిశ్వజిత్ రియాక్షన్!

నేటి తరం సినిమాలో ముద్దు సన్నివేశాలు చాలా సాధారణ విషయంగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు.

By:  Srikanth Kontham   |   25 Sept 2026 4:00 PM IST
రేఖతో ముద్దు వివాదం: యానిమల్ సీన్లపై బిశ్వజిత్ రియాక్షన్!
X

బాలీవుడ్‌లో ఒకప్పటి ముద్దు వివాదం.. నేటికాలంలో వ‌స్తోన్న బోల్డ్ సన్నివేశాల పోలికలపై సీనియర్ నటుడు బిశ్వజిత్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నటి రేఖతో గతంలో తాను నటించిన 'అంజనా సఫర్' (తర్వాత 'దో షికారీ'గా విడుదలైన) సినిమాలోని ముద్దు వివాదంపై ఛ‌ట‌ర్జీ స్పందించారు. అప్పట్లో తనపై వచ్చిన వివాదంతో పోలిస్తే.. ప్రస్తుత సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు, ముఖ్యంగా 'యానిమల్' వంటి చిత్రాల్లోని బెడ్‌రూమ్ సీన్లు చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు.

నేటి తరం సినిమాలో ముద్దు సన్నివేశాలు చాలా సాధారణ విషయంగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో అలాంటి వివాదాలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. తెరపై ముద్దులు పెట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ 'యానిమల్' వంటి చిత్రాల్లో చూపించిన బెడ్‌రూమ్ సన్నివేశాలను చూసి నేను షాక్ అయ్యాను' అని వ్యాఖ్యానించారు. అప్పట్లో తమపై వచ్చిన వివాదాన్ని కేవలం సమయం గడపడానికి మాట్లాడే రచ్చగా కొట్టిపారేశారు.

ఈ వివాదం మూలాల్లోకి వెళితే.. 1969లో రేఖ ముంబైకి వచ్చి బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో 15 ఏళ్ల వయసులో 'అంజనా సఫర్' చిత్రానికి సంతకం చేశారు. తన ఆత్మకథ `రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ`లో రేఖ ఈ సంఘటనను ప్రస్తావిస్తూ,బిశ్వజిత్ తన అనుమతి లేకుండా ఐదు నిమిషాల పాటు ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. తాను దానికి నిరసన తెలిపినా? సెట్‌లోని చిత్రబృందం ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతుంటే ఏడుస్తూ ఉండిపోయానని రేఖ పేర్కొన్నారు.

ఈ సన్నివేశం వివాదాస్పదం కావడంతో సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా `అంజనా సఫర్` సినిమా దాదాపు పదేళ్ల పాటు విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత 1970ల చివరలో రేఖ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత 1979లో ఈ చిత్రాన్ని `దో షికారీ` అనే పేరుతో విడుదల చేశారు. ఈ వివాదంపై గతంలోనూ స్పందించిన బిశ్వజిత్.. మీడియా చిన్న విషయాన్ని కొండంతగా చేసిందని, కథా అవసరం కోసమే ఆ సన్నివేశంలో ముద్దు సన్నివేశాన్ని అనుకోకుండా జోడించామ‌ని వివరణ ఇచ్చారు.

వివాదం తర్వాత కూడా త‌న‌తో రేఖకు మంచి సంబంధాలే ఉన్నాయని బిశ్వజిత్ చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా రేఖ‌ దర్శకత్వంలో, నిర్మాణంలో వచ్చిన సినిమాలో నటించిందని గుర్తుచేసుకున్నారు. `ఆ వివాదం తర్వాత కూడా ఆమె నా సినిమాలో చేసింది. నేను ఆమెతో మాట్లాడాను. వివాదాలు కేవలం కాలక్షేపానికి పుట్టుకొచ్చేవి మాత్రమే` అని బిశ్వజిత్ స్పష్టం చేశారు.