Begin typing your search above and press return to search.

బిపాసా బ‌సు కంబ్యాక్ ఎన్నాకెన్నాళ్ల‌కు!

బాలీవుడ్ నటి బిపాసా బసు ఎనిమిదేళ్ల‌ విరామం తర్వాత తిరిగి వెండి తెరపైకి అడుగుపెడుతున్నారు.

By:  Srikanth Kontham   |   7 Sept 2026 6:00 AM IST
బిపాసా బ‌సు కంబ్యాక్ ఎన్నాకెన్నాళ్ల‌కు!
X

బాలీవుడ్ నటి బిపాసా బసు ఎనిమిదేళ్ల‌ విరామం తర్వాత తిరిగి వెండి తెరపైకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తోన్న `బారాబంకి` చిత్రంతో బిప్స్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ముంబైలో వేగంగా జరుగుతుండగా.. బిపాసా బసు కూడా సెట్స్‌లో అడుగుపెట్టడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తన షూటింగ్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఇది 1984 కాలం నాటి నేపథ్యంతో సాగే పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్‌. యథార్థ సంఘటనలు, నాటకీయ పరిణామాల ఆధారంగా హన్సల్ మెహతా కథను ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత బిపాసా బసు ఒక విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలో నటించబోతుండటంతో బాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. `బారాబంకి` చిత్రంలో బిపాసా బసుతో పాటు యువ నటులు సన్నీ కౌశల్, విశాల్ జేత్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న నటనతో ఆకట్టుకుంటున్న ఈ తరం నటులతో కలిసి బిపాసా స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. నటీనటుల మధ్య ఉండే ప్రతిభావంతమైన ప్రదర్శన సినిమాలోని ఉత్కంఠను మరింత పెంచుతుందని చిత్రబృందం భావిస్తోంది.

తల్లిగా మారిన తర్వాత కుటుంబానికే ప్రాధాన్యమిస్తూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బిపాసా బసు మళ్లీ కెమెరా ముందుకు రావడం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీ-ఎంట్రీకి బలమైన కథ, ప్రతిభావంతుడైన దర్శకుడు లభించడంతోనే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆమె కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. `స్కామ్ 1992`, `స్కూప్` వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లు .. సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హన్సల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రాజెక్ట్ విలువ మరింత పెరిగింది.

రియలిస్టిక్ డ్రామాలను ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించే ఆయన శైలికి తగినట్లుగా 1984 నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్, డ్రామా కలబోతగా వస్తున్న `బారాబంకి` బిపాసా బసు కెరీర్‌లో ముఖ్యమైన రీ-ఎంట్రీ చిత్రంగా నిలవనుంది. ఆమె సీనియారిటీ, యువ నటుల జోరు, హన్సల్ మెహతా మార్క్ మేకింగ్ అన్నీ కలిసి పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు ప్రత్యేకమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించనున్నాయి. అయితే బిపాసా రీ ఎంట్రీకి సంబంధించి అమ్మ‌డు మాత్రం అధికారికంగా ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఆమె నుంచి అధికారిక అప్ డేట్ వ‌స్తుంద‌ని అభిమానుల ఎదురు చూస్తున్నారు. మ‌రి విష‌యం తెలిసిన త‌ర్వాతైనా? ఓ పెన్ అవుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.