గేమ్ ఛేంజర్ గా నెట్ ఫ్లిక్స్.. వార్నర్ బ్రదర్స్ తో భారీ డీల్..
ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లో ఒకటైన నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ గా మారింది.
By: Madhu Reddy | 6 Dec 2025 2:15 PM ISTప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లో ఒకటైన నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ గా మారింది. ముఖ్యంగా వార్నర్ బ్రదర్స్ తో కుదుర్చుకున్న భారీ డీల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా ఆరున్నర లక్షల కోట్ల విలువైన డీల్ అని తెలియడంతో అందరూ నోరెళ్ళబెడుతున్నారు. అసలు ఏంటా భారీ డీల్? వార్నర్ బ్రదర్స్ తో నెట్ ఫ్లిక్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? అసలు ఏం జరుగుతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన ఫిలిం స్టూడియోలు, టీవీ, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమయింది. ఏకంగా రూ.6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ అంగీకరించింది. ఇకపోతే నెట్ ఫ్లిక్స్ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ గా కొనసాగుతూ ఉండగా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కూడా భారీ డీల్ తో సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ముఖ్యంగా ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేర్ కు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్ ఫ్లిక్స్ బిడ్ వేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవ్వాలి అంటే వార్నర్ బ్రదర్స్ టీబీఎస్, సీఎన్ఎన్, టీ ఎన్ టీ వంటి కేబుల్ ఛానల్ లో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని, అప్పుడే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని నివేదిక తెలిపింది. ఇక దీనిపై బోకె క్యాపిటల్ పార్ట్నర్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కిమ్ ఫారెస్ట్ దీనిపై మాట్లాడుతూ.. "విజేత బిడ్డర్ గా నెట్ ఫ్లిక్స్ అవతరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బలమైన డొమైన్ అయిన నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వ్యాపారం పై దృష్టి సారిస్తున్నందున ఇది సాధ్యమైంది" అంటూ తెలిపారు.
ఇకపోతే ఈ ఒప్పందం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థ నుంచి తీవ్ర పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆమె హెచ్చరించారు. ఏది ఏమైనా నెట్ఫ్లిక్స్ ఇంత పెద్ద మొత్తంలో స్ట్రీమింగ్ వ్యాపారం పై దృష్టి సారించి ఇంత పెద్ద భారీ డీల్ కుదుర్చుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ భారీ డీల్ కారణంగా షేర్ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోయింది.. దీనికి తోడు ముఖ్యంగా ఇటువంటి డీల్స్ ఇతర స్టూడియోలు, స్ట్రీమింగ్ సేవల మధ్య మార్గం సుగమం చేస్తుంది. అంతేకాదు వినోద పరిశ్రమలో ఉపాధి అవకాశాల పెరుగుదలకు కూడా దారితీస్తుంది.
పైగా కంటెంట్ సృష్టికి డిమాండ్ పెరగడం వల్ల వినోద పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్ట్రీమింగ్ సేవల కోసం కంటెంట్ ఉత్పత్తికి, పంపిణీకి మద్దతు ఇవ్వడానికి కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. వార్నర్ బ్రదర్స్ - నెట్ ఫ్లిక్స్ మీడియా వినియోగ విధానాలలో మార్పుకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ సేవలు ఎంటర్టైన్మెంట్ కి ప్రధాన వనరుగా మారవచ్చు. మొత్తానికైతే ఈ ఒప్పందం కారణంగా షేర్ మార్కెట్ విలువ కూడా అమాంతం పెరిగిపోయింది
