త్రిగుణ్కి నోటి దూల మాములుగా లేదుగా!
ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్‌కు త్రిగుణ్ ఈశ్వరన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న మాట వాస్తవమే అయినా, అతనిలోని లోపాలు మాత్రం గేమ్ మొత్తాన్ని దెబ్బ తీస్తున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 11 Sept 2026 12:35 PM ISTప్రస్తుత బిగ్‌బాస్ సీజన్‌కు త్రిగుణ్ ఈశ్వరన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న మాట వాస్తవమే అయినా, అతనిలోని లోపాలు మాత్రం గేమ్ మొత్తాన్ని దెబ్బ తీస్తున్నాయి. రోహిత్‌ను పదే పదే గెలకడం, రెచ్చగొట్టడం రోజురోజుకూ శృతి మించుతోంది. గత కొన్ని ఎపిసోడ్లను గమనిస్తే, రోహిత్ అన్న మాటలను వక్రీకరిస్తూ మిగతా సెలబ్రిటీల ముందు అతన్ని విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం త్రిగుణ్ చాలా చాకచక్యంగా చేస్తున్నాడు.
అంట్లు తోమే విషయంలో వచ్చిన వాగ్వాదంలో, ఏమాత్రం వాస్తవం లేని విషయాలను త్రిగుణ్ ప్రస్తావించాడు. దానికి రోహిత్ బదులిస్తూ" లేనిది ఊహించుకొని మీరే స్క్రిప్టులు రాసుకోకండి" అన్నాడు. దానికి త్రిగుణ్, "నీలాంటి వాళ్ల మీద స్క్రిప్ట్ రాయడం కూడా దండగ" అంటూ అతన్ని తక్కువ చేసి మాట్లాడాడు. తీరా వర్షిణి దగ్గరికి వెళ్లేసరికి... రోహిత్ తన సినీ కెరీర్‌ను అవమానించాడంటూ మాట మార్చి విషం చిమ్మాడు.
మరో సందర్భంలో, రోహిత్‌కు బట్టీ పట్టడం తప్ప ఏ టాస్క్ చేతకాదని త్రిగుణ్ కించపరిచాడు. రోహిత్ ఎక్కడా హద్దు మీరకుండా కౌంటర్ ఇవ్వగానే, దాన్ని కూడా తీసుకెళ్లి రోహిత్ తన ఎడ్యుకేషన్‌ను కించపరిచాడంటూ తోటి సభ్యుల ముందు మరోసారి విక్టిమ్ కార్డు ప్లే చేశాడు త్రిగుణ్.
ఇంతటితో ఆగకుండా, రోహిత్ స్టీరాయిడ్స్ వాడి బాడీ పెంచాడని, అతనొక "డొల్ల" అని పర్సనల్ ఎటాక్‌లు చేశాడు. చివరకు కామనర్స్‌ను ఉద్దేశించి "ఛీ ఛీ అగ్నిపరీక్ష" అంటూ అత్యంత నీచంగా మాట్లాడాడు.
అయితే, మాటల యుద్ధాన్ని పక్కనపెట్టి టాస్క్ మీదే దృష్టి పెట్టిన రోహిత్... ఏకంగా త్రిగుణ్‌నే ఓడించి పర్మనెంట్ హౌస్‌మేట్‌గా ఎంపికై తన సత్తా చాటాడు. ఒకవేళ ఆ టాస్కులో త్రిగుణ్ గెలిచి ఉంటే రోహిత్‌పై ఎంత రచ్చ చేసేవాడో ఊహించడానికే భయమేస్తుంది. ఇదిలాగే కొనసాగితే త్రిగుణ్ మీద నెగటివిటీ పెరగడం ఖాయం. ఒక వ్యక్తి ఆట బాగుంది అని షో చూడాలి కానీ, నెగటివ్ అయితున్నాడు అని జనాలు చూస్తే, తర్వాత అది తన కెరీర్కే ప్రభావం చూపుతుంది.
ఈ వీకెండ్ వేదికపై హోస్ట్ నాగార్జున అతనికి గట్టిగానే క్లాస్ పీకాల్సిన సమయం వచ్చింది; కాకపోతే నాగ్ ఎంతవరకు ఈ తప్పులను ఎత్తిచూపుతారనేదే అసలు సందేహం.
