Begin typing your search above and press return to search.

రోహిత్ ని అభినందించాల్సింది పోయి టార్గెట్ చేస్తున్నారుగా!

బిగ్‌బాస్ తొలి శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వ్యవహరించిన తీరు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   13 Sept 2026 11:23 AM IST
రోహిత్ ని అభినందించాల్సింది పోయి టార్గెట్ చేస్తున్నారుగా!
X

బిగ్‌బాస్ తొలి శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వ్యవహరించిన తీరు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి, 'అగ్నిపరీక్ష' కామనర్లను పూర్తిగా డీమోరలైజ్ చేసేలా నాగ్‌ వైఖరి సాగింది. సెలబ్రిటీల తప్పులను తేలిగ్గా వదిలేసి, కామనర్లనే పని గట్టుకుని టార్గెట్ చేయడంతో సెలబ్రిటీలలో లేనిపోని అతివిశ్వాసం పెరిగే ప్రమాదం ఏర్పడింది.

'అగ్నిపరీక్ష' నుంచే ఒక విన్నర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలను చాటుకున్న రోహిత్, టాప్లో ఖాయంగా ఉంటాడని మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. హౌస్‌లో త్రిగుణ్ మొదటి రోజు నుంచీ రోహిత్‌ను గెలుకుతూ, తోటి సభ్యులను అతనిపైకి ఉసిగొల్పుతూనే ఉన్నాడు. కానీ వీకెండ్ స్టేజ్‌పై త్రిగుణ్‌కు నాగ్‌ ఇచ్చిన క్లాస్ ఏమాత్రం సరిపోలేదు.

అసలు వివాదం గిన్నెలు తోమే అంశం చుట్టూ తిరిగింది. "ఎవరి ఎంగిలి కప్పులు వాళ్లే కడుక్కోవాలి" అని హౌస్‌లో ముందే మాట్లాడుకున్న విషయాన్ని రోహిత్ గుర్తు చేస్తూ, అలాంటప్పుడు మళ్లీ తనను ఎందుకు లాగుతున్నారని వివరణ ఇవ్వబోయాడు. కానీ నాగార్జున ఆ వాదనను రోహిత్‌కు వ్యతిరేకంగా మార్చి, బలవంతంగా అతను తప్పు చేశాడని ఒప్పుకునేలా చేశారు. అంతటితో ఆగకుండా, రోహిత్ మిల్క్‌షేక్ తాగిన గ్లాస్‌ను స్వయంగా నాగార్జునే శుభ్రం చేసి చూపించి అతన్ని మరింత చిన్నబుచ్చే ప్రయత్నం చేశారు. హౌస్‌మేట్స్ అంతా ఏకమై రోహిత్‌ను కార్నర్ చేయడంతో అతనికి మాట్లాడే అవకాశం కూడా దక్కకుండా పోయింది.

ఇక శాలిని విషయంలోనూ నాగ్ వైఖరి అలాగే ఉంది. చైత్ర ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేదని, కేవలం రోహిత్ గెలుపును మాత్రమే ఆస్వాదించానని ఆమె స్పష్టత ఇచ్చినప్పటికీ, ప్రత్యేకంగా వీడియో వేసి మరీ ఆమెను తప్పుగా చూపించేలా విమర్శించారు.

రాంప్రసాద్‌కు మాటల విషయంలో సున్నిత హెచ్చరిక చేసి, త్రిగుణ్‌కు చిన్నపాటి శిక్ష వేసిన నాగార్జున... రోహిత్‌ను మాత్రం తీవ్రంగా ఏకిపారేశారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే హౌస్‌తో పాటు హోస్ట్ కూడా రోహిత్‌ను కావాలనే ఒంటరిని చేస్తున్నారనే భావన ప్రేక్షకుల్లో బలపడింది. దేవయాని, వర్షిణిలు సైతం రోహిత్‌పై పనిగట్టుకుని నెగెటివిటీని ప్రదర్శించారు. ముఖేష్ తనను 'అన్‌అటెంటివ్' అన్నాడని రోహిత్‌పై అనవసరంగా రంకెలేశాడు; కానీ వీడియో ప్రూఫ్‌లో రోహిత్ అన్న మాటే నిజమని తేలింది. ముఖేష్ అంత దురుసుగా ప్రవర్తించినా రోహిత్ ఏమాత్రం సహనం కోల్పోకుండా నిగ్రహం పాటించాడు.

శనివారం ఎపిసోడ్‌లో జరిగిన ఈ పరిణామాలన్నీ రోహిత్‌ను హౌస్‌లో డిఫెన్స్‌లో పడేసి ఉండొచ్చు, కానీ బయట ప్రేక్షకుల్లో మాత్రం అతనిపై అమితమైన సానుభూతిని, తిరుగులేని ప్రజాదరణను తెచ్చిపెట్టడం ఖాయం. రోహిత్‌ను కావాలని ఇరికించే ప్రయత్నం స్పష్టంగా కనిపించినా, అది అతనికి సింపతీ తెచ్చిపెట్టి మరింత ప్లస్ అయ్యేలా ఉంది.