Begin typing your search above and press return to search.

అతని వల్ల నాగార్జునపై విమర్శలు..!

తాజా ఎపిసోడ్‌లో రోహిత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోను బిగ్ బాస్ టీమ్ చూపించింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   4 Oct 2026 1:35 PM IST
అతని వల్ల నాగార్జునపై విమర్శలు..!
X

ప్రతిసారి ఎవరో ఒక కంటెస్టెంట్ వల్ల.. బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న వ్యక్తులపై నెగిటివ్ పోస్టులు రావడం జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అదే రిపీట్ అయింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ హీట్ పెరుగుతోంది. తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున చాలా సీరియస్‌గా కనిపించారు. ఈసారి ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్లకు ఎల్లో కార్డులు ఇచ్చారు. అంటే మరోసారి తప్పు చేస్తే షో నుంచి బయటకు పంపించే స్థాయిలో ఇది ఫైనల్ వార్నింగ్‌గా భావించవచ్చు. అయితే ఈ ఎపిసోడ్‌లో రోహిత్ విషయంలో నాగార్జున వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

తాజా ఎపిసోడ్‌లో రోహిత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోను బిగ్ బాస్ టీమ్ చూపించింది. అందులో రోహిత్ తోటి కంటెస్టెంట్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన పదం ఉపయోగించినట్లు చూపించారు. అయితే ఆ తర్వాత జరిగిన చర్చలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు బిగ్ బాస్‌ను ఉద్దేశించినవి కావని, చరణ్‌ను ఉద్దేశించి చేసినవని స్పష్టత వచ్చింది. రోహిత్ కూడా తన ఉద్దేశం వేరని, అది తప్పుగా అర్థమైందని చెప్పే ప్రయత్నం చేశాడు.

అయితే నాగార్జున మాత్రం రోహిత్‌పై గట్టిగానే మాట్లాడారు. తన తప్పును ఒప్పుకోవాలని పదేపదే ప్రశ్నించినట్లు కనిపించింది. దీంతో రోహిత్ విషయంలో బిగ్ బాస్ టీమ్ మరీ కఠినంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు త్రిగుణ్, ముఖేష్ విషయంలో కూడా గతంలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, హావభావాలు కనిపించాయని ప్రేక్షకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. సెలబ్రిటీ కంటెస్టెంట్లు అగ్ని పరీక్షా షోపై చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో చర్చకు వచ్చాయి. అయితే వీటిపై బిగ్ బాస్ టీమ్ పెద్దగా స్పందించలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది.

రోహిత్ కూడా తన గేమ్‌లో కొన్ని తప్పులు చేస్తున్నాడనే విషయం నిజమే. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో అతను తన కోపాన్ని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి కంటెస్టెంట్ విషయంలో ఒకే విధమైన ప్రమాణాలు ఉండాలనేది ప్రేక్షకుల అభిప్రాయం.

ఈ ఎపిసోడ్‌లో ముగ్గురికి ఎల్లో కార్డులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో రోహిత్ విషయంలో బిగ్ బాస్ టీమ్ నిజంగానే పక్షపాతం చూపిస్తోందా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఇకపై రోహిత్ తన ఆటను ఎలా మార్చుకుంటాడు, ఈ వార్నింగ్ తర్వాత మరింత బలంగా తిరిగి వస్తాడా అనేది చూడాలి.